Newsminute24

తెలంగాణలో టగ్ ఆఫ్ వార్.. బీఆర్ఎస్ కు కష్టమే..?

Telangana: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఎన్నికలకు  నాలుగు నెలలు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడ్ అప్ చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో హ్యాట్రిక్ పై కన్నేసింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వంపై  వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని పట్టుదలతో ఉన్నాయి.ఇప్పటికే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ జరిగేందుకు ఆస్కారం ఉందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.

తెలంగాణలో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తున్నా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా డబుల్ బెడ్ రూమ్, పేదలకు ఇళ్ల నిర్మాణం , దళిత బంధు,నిరుద్యోగ సమస్య వాటిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో రైతులు, మహిళలు తిట్టిపోస్తున్నారు. బీసీ బంధు, మైనార్టీ బంధు, క్రిస్టియన్లకు లక్ష రూపాయలు ప్రకటించినా దళిత బంధు తరహాలో అమలుకు నోచుకోదన్న భావన ఆయా వర్గాల ప్రజల్లో కనిపిస్తోంది.

కాగా  రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ అని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల మార్పు ఉంటుందన్న సంకేతాలు పార్టీ నుంచి వెలువడుతున్నాయి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష నేతలు కాచుకొని కూర్చున్నారు. ఇప్పటికే కారు పార్టీ ఓవర్ లోడ్ అవడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నా బీఆర్ఎస్ ఆశావాహులు టికెట్ రాని పక్షంలో పార్టీలో చీలిక తెచ్చి పార్టీని దెబ్బ కొట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది. దీంతో ఎమ్మెల్యేల మార్పు సమస్య సీఎం కేసిఆర్ కు కత్తి మీద సాముల మారింది. ఎన్నికల వ్యూహాలు రచించడంలో సిద్ధ హస్తుడైన కేసిఆర్ రాజకీయ చతురతతో ఏం చేస్తాడన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

హస్తం పార్టీలో జోరు: 

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో జోష్ పెరిగింది. పార్టీలోకి ఇతర పార్టీల ముఖ్య నేతల వలసలు పెరగడంతో నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అయితే టీపీసీసీ రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్ నేతల వ్యవహార శైలి పార్టీకి మైనస్ గా మారింది. దీనికి తోడు వరంగల్ కాంగ్రెస్ రైతుల డిక్లరేషన్ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం  ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. కారు పార్టీ వలే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓవర్ లోడ్ తో నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కి ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో టికెట్ల కేటాయింపు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్ నేతల వర్గంగా పార్టీ నేతలు విడిపోయి ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టిపిసిసి చీఫ్ అభ్యర్థులను ప్రకటించడంతో సీనియర్ నేతలకు చెందిన వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి హస్తం అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.

తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే భావించవచ్చు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో పాటు జిహెచ్ఎంసి ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలవడంతో బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు కమలనాథులు.తీరా ఎన్నికల టైం వచ్చేసరికి కమలం నేతలు చేతులెత్తేశారు అన్న భావన ప్రజల్లో ఉంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు, నేతలు ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం  వంటి అంశాలు ప్రజల్లో నమ్మకం సడలడానికి కారణంగా కనిపిస్తోంది.ఇప్పటికేనా తప్పులను సరిదిద్దికొని ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకొని నేతలంతా ఐక్యమత్యంతో పనిచేస్తే రానున్న ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాబట్టేందుకు ఆస్కారం ఉందని కాషాయం  పార్టీ సానుభూతి పరులతో పాటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్ పార్టీ.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డపై జెండా ఎగరేయాల్ని ప్రతి పక్ష కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల సమరానికి తగ్గేదెలా అంటూ సై అంటున్నాయి.

 

Exit mobile version