Karnataka: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వేలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడైంది. తొలి 24 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదరణ తగ్గుతున్న దశలో రానున్న 36 నెలలు కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత కీలకం కానున్నది. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా మొదటి దశలో ఉన్న ఆదరణ రెండో దశలో తగ్గుతుంటుంది. మొదటి రెండు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణ కోల్పోతూ ఉంటే రానున్న 3 సంవత్సరాల కాలంలో తమ ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకుంటుందో అన్నది వేచి చూడాలి.
కర్ణాటకలో ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిపోయిందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వేలో వెల్లడైంది. కర్ణాటకలో 1985 నుండి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తదుపరి ఎన్నికల్లో సొంతంగా సంపూర్ణ మెజార్టీ సాధించలేదనే అంశం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదే ట్రెండ్ ఈ సారి కూడా కొనసాగే అవకాశాలున్నట్లు స్పష్టమౌతోంది. పీపుల్స్పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10,481 శాంపిల్స్తో 17 ఏప్రిల్ నుండి 18 మే వరకు, నెల రోజులపాటు ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ ట్రాకర్ పోల్ నిర్వహించింది.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలుండగా, మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 51 శాతం ఓట్లతో 136-159 స్థానాలు, కాంగ్రెస్ 40.3 శాతం ఓట్లతో 62-82 స్థానాలు, జేడీ(ఎస్) 5 శాతం ఓట్లతో 3-6 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని వెల్లడైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 10.7 ఓట్ల శాతం స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది.
పహల్గాం ఘటన, అనంతరం ఆపరేషన్ సిందూర్ కూడా బీజేపీకి అనుకూలంగా మారాయి. పాకిస్తాన్తో కాల్పుల విరమణ తర్వాత, అంటే మే 10వ తేదీ తర్వాత బీజేపీకి 1 -1.5 శాతం ఓటర్ల మద్దతు పెరిగినట్టు సర్వేలో స్పష్టమైంది.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42.88 శాతం ఓట్లతో 135 స్థానాలు, బీజేపీ 36 శాతం ఓట్లతో 66 స్థానాలు, జేడీ(ఎస్) 13.29 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలుపొందగా, ఈ రెండేళ్ల వ్యవధిలో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రశ్నించినప్పుడు 55 శాతం మంది బీజేపీ, 39.1 శాతం మంది కాంగ్రెస్ అని, 3.6 శాతం మంది జెడి(ఎస్) అని, 2.3 శాతం మంది ఇతరులు అని పీపుల్స్పల్స్ -కొడెమో సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
మహిళా ఓటర్లలో బీజేపీకి 48.4 శాతం, కాంగ్రెస్కు 44.6 శాతం మద్దతు లభిస్తుండడంతో కాంగ్రెస్ పై బీజేపీ మహిళా ఓటర్లలో 3.8 శాతం ఆధిపత్యం కనబరుస్తోంది. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆశించిన ఆదరణ పాలకపక్షానికి లభించడం లేదు. పురుష ఓటర్లలో బీజేపీ 51.9 శాతం, కాంగ్రెస్ 38.9 శాతం ఓట్లు సాధిస్తుండడంతో, బీజేపీ కాంగ్రెస్పై 13 శాతం భారీ ఆధిక్యత చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.
18 – 25 సంవత్సరాల ఓటర్లలో బీజేపీ 24 శాతం ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీపై కొనసాగిస్తోంది. ఇతర వయసు ఓటర్లలో బీజేపీకి 48 శాతం నుండి 51 శాతం ఓట్లు లభిస్తుండగా, కాంగ్రెస్ కు 42 శాతం నుండి 44 శాతం ఓట్లు లభించవచ్చని పీపుల్స్ పల్స్ సర్వే సంకేతాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. గ్రామీణ ప్రాంతంలో 13.5 శాతం, పట్టణాల్లో 6.6 శాతం కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆధిక్యతలో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో జేడీ(ఎస్) 5.7 శాతం ఓట్లు సాధించవచ్చని సర్వేలో వెల్లడైంది. రైతుల్లో బీజేపీకి 53.9 శాతం, కాంగ్రెస్ కు 37.4 శాతం ఓట్లు లభించవచ్చు. 2023 ఎన్నికల్లో రైతు సంబంధిత అంశాలను కీలకంగా ప్రచారం చేసి, సానుకూల ఫలితాలు సాధించిన కాంగ్రెస్ కు ప్రస్తుతం రైతుల్లో కూడా ఆదరణ తగ్గడం గమనించాల్సిన విషయం.
కర్ణాటకలో మత, కుల రాజకీయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ సామాజికవర్గంలో బీజేపీకి 58.5 శాతం ఆదరణ లభిస్తుండగా, కాంగ్రెస్ కు లభిస్తున్న ఆదరణ కేవలం 32 శాతానికే పరిమితమైంది. ముస్లిం సామాజికవర్గంలో 85.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ పటిష్టంగా ఉండగా, బీజేపీ కేవలం 9.3 శాతం ఓట్లే పొందే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.రాష్ట్రంలోని జనరల్ కేటగిరీ ఓటర్లలో 15.1 శాతం, ఓబీసీల్లో 14 శాతం, ఎస్టీల్లో 22 శాతం ఆధిక్యత బీజేపీ కనబరుస్తోంది. రాష్ట్రంలో కీలకమైన లింగాయత్ సామాజికవర్గంలో బీజేపీకి 78.9 శాతం ఆదరణ లభిస్తుండగా, కాంగ్రెస్కు కురుబా సామాజికవర్గంలో 54.6 శాతం ఆదరణ కనిపిస్తోంది. మరోవైపు ఒక్కలింగాల సామాజికవర్గంలో బీజేపీకి 47.8 శాతం, జేడీ(ఎస్)కు 24.6 శాతం, కాంగ్రెస్ కు 22.9 శాతం ఆదరణ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ కురుబ, ఆదికర్ణాటక, మాదిగ, మాదర్ సామాజికవర్గాల్లో బీజేపీపై ఆధిక్యత కనబరుస్తుండగా, లింగాయత్(వీరశైవాస్), ఒక్కలింగాస్ నాయక్/ నాయక్ వాల్మీకి, మరాఠాస్, విశ్వకర్మ సామాజికవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
ఎస్సీలో కాంగ్రెస్ పార్టీ 51.5 శాతం ఓట్లు పొందుతుండగా, బీజేపీకి 41.7 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఎస్సీ సామాజికవర్గంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీకి 9.8 శాతం ఓట్ల ఆధిక్యత లభించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని ఈ సర్వేలో మరోసారి స్పష్టమైంది. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు 29.2 శాతం మద్దతు ఇస్తుండగా, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కు 10.7 శాతం, జేడీ(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామికి 7.6 శాతం, బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియురప్పకు 5.5 శాతం, కర్ణాటక బీజేపీ అధ్యక్షులు బీ.వై. విజయేంద్రకు 5.2 శాతం ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
కర్ణాటక రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజాభిప్రాయం సేకరించగా ప్రభుత్వం పనితీరు బాగుందని లేదా చాలా బాగుందని 48.4 శాతం మంది, 32 శాతం మంది బాగోలేదు లేదా ఏమాత్రం బాగోలేదని చెప్పగా, ప్రతి ఐదుగురు ఓటర్లలో దాదాపు ఒకరు ప్రభుత్వ పనితీరు యావరేజీగా (పర్వాలేదు) ఉందని చెప్పారు. మరో అత్యంత కీలకాంశం ఏమిటంటే, గత బీజేపీ ప్రభుత్వం కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే నయమని 48 శాతం మంది భావించగా, దీన్ని 55.2 శాతం బీజేపీ ఓటర్లు, 54.7 శాతం జేడీ(ఎస్) ఓటర్లు అంగీకరించలేదు.
వచ్చే లోక్సభ ఎన్నికల తరువాత దేశానికి ఎవరు ప్రధాన మంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించగా నరేంద్ర మోదీకి 59.1 శాతం, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి 17.3 శాతం, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు 2.3 శాతం మద్దతు లభించింది. మరోవైపు 10.9 శాతం మంది బీజేపీ నేత, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రధాన మంత్రి పదవి కోసం మద్దతు పలికారు. స్థూలంగా కాంగ్రెస్ ఓటర్లలో రాహుల్ గాంధీకి 40.6 శాతం మద్దతు పలుకుతుండగా, 37 శాతం మోదీకి అనుకూలంగా ఉన్నారు. బీజేపీ, జేడీ(ఎస్) ఓటర్లలో 73 శాతం మంది మోదీ వెంటే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఓటర్లను ప్రశ్నించగా 66.3 శాతం అనుకూలంగా ఉన్నారు. ఆశ్చర్యకరంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ఓటర్లలో 59.3 శాతం మంది కేంద్ర ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని లేదా బాగుందని అభిప్రాయపడడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికపై ప్రజాభిప్రాయం సేకరించినప్పుడు 26.3 శాతం ఓటర్లు ఈ నివేదికను విశ్వసిస్తున్నామని చెప్పగా, 16 శాతం మంది కొంత వరకు విశ్వసిస్తున్నామన్నారు. 35 శాతం మంది ఈ నివేదికను విశ్వసించడం లేదని తమ అభిప్రాయాన్ని తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన ఓటర్లలో ఈ నివేదికపై 34.6 శాతం మంది పూర్తిగా విశ్వసిస్తున్నామని చెప్పగా 21.7 శాతం ఈ నివేదికను విశ్వసించడం లేదని, 16.4 శాతం మంది కొంత మేర విశ్వసిస్తున్నామని తెలిపారు. బీజేపీ ఓటర్లలో 43.3 శాతం, జేడీ(ఎస్) ఓటర్లలో 50 శాతం మంది నివేదికపై నమ్మకం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కులగణనపై సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే లింగాయత్, ఒక్కలింగాల ఓటర్లలో 50 శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికను విశ్వసించడం లేదని సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో 37 మంది ఎమ్మెల్యేలున్న లింగాయత్లు, 23 మంది ఎమ్మెల్యేలున్న ఒక్కలింగాలు కులగణనను అశాస్త్రీయంగా ఉందని పేర్కొనడం విశేషం. కురుబ (33 శాతం), మాదిగలు (45.1 శాతం) కులగణన నివేదికను విశ్వసిస్తున్నారు.
2023లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి అధికారంలో వచ్చిన తరువాత ఈ 5 గ్యారంటీలను అమలు చేయడం ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో అమలు చేస్తున్న 5 గ్యారంటీలపై ప్రజాభిప్రాయం సేకరించగా 45.4 శాతం ‘గృహ లక్ష్మి’ పథకానికి జై కొట్టగా, ‘యువనిధి’ పథకానికి కేవలం 2 శాతం మంది మాత్రమే బాగుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు గ్యారెంటీలపై కేవలం 3 శాతం ఓటర్లకు మాత్రమే అవగాహన లేదని సర్వేలో వెల్లడి కావడాన్ని బట్టి సదరు పథకాలపై ప్రజల్లో పూర్తి అవగాహన ఉందని స్పష్టమౌతోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీల అమలుకు 2025 -26 బడ్జెట్లో రూ.51,034 కోట్లు కేటాయించింది. ఇందులో ‘గృహలక్ష్మి’ పథకం కింద 1.22 కోట్ల మంది మహిళా లబ్దిదారులకు నెలకు రూ.2000 పంపిణీ కోసం రూ.28,608 కోట్లు, ‘గృహజ్యోతి’ పథకం కింద 1.62 కోట్ల వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం రూ.10,100 కోట్లు, ‘శక్తి’ పథకంలో భాగంగా ప్రతి నెల 50 లక్షలకుపైగా బస్సు ప్రయాణం చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణానికి రూ.5,300 కోట్లు, ‘యువనిధి’ పథకం కింద నమోదు చేసుకున్న 2.58 కోట్ల యువత కోసం నిరుద్యోగ భృతికి రూ.286 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ‘అన్న భాగ్య’ పథకం కింద 4.21 కోట్ల లబ్దిదారులకు అదనంగా ఐదు కిలోల ఉచిత బియ్యం బదులు నగదు అందిస్తున్నారు.
విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం నిధులను కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల కోసం రూ.8000 కోట్లు, ఓబీసీ మైనార్టీల నూతన స్కాలర్షిప్స్ కోసం రూ.500 కోట్లు కేటాయించారు. కోటి మందికి ప్రయోజనం కలిగేలా ఆర్యోగ బీమా అమలు చేయడంతోపాటు 200 పీహెచ్సీల అభివృద్ధి చేశారు. గ్రామీణ కుటుంబాలకు లక్ష పట్టాలను అందించి వారికి యాజమాన్య హక్కులు కల్పించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై భారీగా ప్రచారం చేస్తున్నా వాటి అమలులో ఎదురువుతున్న అనేక ఇబ్బందులతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. లబ్దిదారులను ఎంపిక చేయడంలోనే లోపాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు రుణమాఫీ పాక్షికంగానే అమలైనట్టు విమర్శలున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాదరణ తగ్గుదలకు కారణమవుతున్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.
నిత్యావసర ధరలు పెరుగుదల, సర్వీసు చార్జీలపై మధ్య తరగతి, పట్టణ ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్టు సర్వేలో కనిపించింది. ఒకవంక ఉచిత పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరోపక్క పాలు, నీరు, విద్యుత్, చమురు, ప్రజా రవాణా చార్జీలను పెంచడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కనిపిస్తోంది.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై పలు అవినీతి ఆరోపణల కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట ప్రజల్లో దెబ్బతిన్నదని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీలో 2023 ఎన్నికల్లో ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండడం కాంగ్రెస్కు ప్రతికూలంగా మారుతోంది. బీజేపీ కూడా గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. ఈ కారణంగానే ఇప్పటికి కూడా రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు తప్ప బీజేపీ వారెవరికీ ఆ స్థానాలు దక్కలేదు.
అధిక సామాజికవర్గాల్లో, గ్రామీణ, పట్టణాల్లో, మహిళల్లో, పురుషుల్లో, రైతుల్లో, యువతలో ఇలా అన్ని వర్గాల్లోనూ బీజేపీ ఆధిపత్యం కనబరుస్తున్నా సర్వేలో ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీకి సరైన నాయకుడిని ఓటర్లు ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం బీజేపీలో నాయకత్వ లోపమే. మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా సీఎం సిద్దరామయ్యకి ఆదరణ తగ్గకపోవడం కాంగ్రెస్కు అదనపు బలాన్ని కలిగిస్తోంది.
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ విస్తృతంగా నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో సిద్దరామయ్య సర్కార్పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని స్పష్టమవుతోంది. ఏదేనీ ప్రభుత్వం విజయవంతం కావాలంటే ఆ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలి, అధికారంలో ఉన్న పార్టీలో ఐక్యత ఉండాలి, అన్ని సామాజిక వర్గాలతో ఆ పార్టీ సామరస్యంగా ఉండాలి. ఈ మూడు సూత్రాలను అనుసరిస్తే ఆ ప్రభుత్వానికి ప్రజాదరణలో ఎదురుండదు. రానున్న మూడేళ్లలో ఈ మూడు సూత్రాలను పాటించడంలో సిద్దరామయ్య ప్రభుత్వం విజయవంతమైతే ప్రజలకు చేరువ కావచ్చు. లేకపోతే మరింత ప్రజాదరణ కోల్పోయే అవకాశాలుంటాయి.