Telanganacongress:
దేశంలో స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థలన్నీ పదకొండేళ్ల నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనలో గాడి తప్పుతున్నాయి. బీజేపీ అడ్డదారులను ఆసరాగా చేసుకొని అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే భ్రమల్లో ఉంది. ప్రజాగ్రహానికి మహారాజ్యాలే కుప్పకూలాయనే వాస్తవాలను గ్రహించలేని బీజేపీ నయానా భయానా వ్యవస్తలన్నింటినీ కబంధహస్తాల్లో బంధించి ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతోంది. ఈసీ,ఈడీ, సీబీఐ ఇలా ప్రభుత్వ ఏజెన్సీలన్నింటినీ దుర్వినియోగపరుస్తూ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతోంది. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బీజేపీ నియంతృత్వ పోకడలకు ముకుతాడు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో బీజేపీ, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్న విధానాన్ని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక బాధ్యతాయుతమైన నేతగా కళ్లకు కట్టినట్టు ఆధారాలతో నిరూపించడంతో యావత్ దేశం విస్మయానికి గురైంది.
ప్రజావ్యతిరేక ఎదుర్కొంటున్న నరేంద్ర మోదీ ప్రజాక్షేత్రంలోని అంచనాలకు విరుద్ధంగా గెలుస్తుండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. దేశంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ విజయాలను విమర్శించడం రాజకీయాలలో భాగమనుకోవచ్చు. అయితే ప్రముఖ మీడియా సంస్థలు, ఏజెన్సీలు నిర్వహించిన సర్వే అంచనాలు పలుమార్లు తలకిందులయ్యాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనంతరం హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దేశంలోని ప్రజాస్వామ్యవాదులలో పలు అనుమానాలు రేకెత్తించాయి. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాలో భారీగా నష్టపోయిన బీజేపీ ఆరు నెలల వ్యవధిలోనే జరిగిన ఆ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అందలమెక్కడం పలు అనుమానాలకు తావిచ్చింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలప్పుడే వీటిపై ఆధారాలతో సహా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించినా బీజేపీ ఒత్తిడికి లొంగిన ఎన్నికల సంఘం పెడచెవిన పెట్టింది. మహారాష్ట్ర ఎన్నికల్లో సమయం ముగిసాక సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 మధ్య 65 లక్షల మంది ఓట్లు వేసినట్లు ఎన్నికల సంఘం గణాంకాల్లో తేలింది. రెండు గంటల వ్యవధిలో ఇంత మంది ఓటు వేయడం అసాధ్యమని తెలిసినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. దీనిపై అప్పుడే రాహుల్ గాంధీ పలు ఆధారాలతో గొంతెత్తినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. బీజేపీ, ఎన్నికల సంఘం కూడబలుకొని దేశంలోని ఎన్నికల వ్యవస్థను నాశనం చేస్తున్నాయని గుర్తించిన రాహుల్ గాంధీ వీటిని బట్టబయలు చేయాలనే సంకల్పంతో శాస్త్రీయబద్దంగా అధ్యయనం చేసి ఢిల్లీలో ప్రజంటేషన్ నిర్వహించి ఎలక్షన్ కమిషన్లోని లొసుగులను ఎత్తిచూపారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేశంలో కొంత కాలంగా జరుగుతున్న అవకతవకలపై ప్రజా క్షేత్రంలోనే తాడోపేడో తేల్చుకోవాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ పలు కీలక ఆధారాలను బహిర్గతం చేశారు. పలు ఎన్నికల్లో అడ్డదారులతో అధికారానికి రావడమే బీజేపీ విజయ రహస్యమని గమనించిన కాంగ్రెస్ వాటిని బయటపెడుతూ పలు ఉదాహరణలు చూపించడంతో ఆ పార్టీతో పాటు ఎన్నికల సంఘం కూడా షాక్కు గురైంది. ఈ అవకతవకలకు ఉదాహరణగా కర్ణాటకలోని బెంగళూర్ సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మహాదేవపురం అసెంబ్లీ సెగ్మంట్లో లోపాలను రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. బెంగుళూర్ సెంట్రల్ ఎంపీ స్థానాన్ని, మహాదేవపురం అసెంబ్లీ సీటును వరుసగా గెలవడానికి ఈ ప్రాంతంలో ఓట్ల రిజిస్ట్రేషన్ మొదలు ఓటింగ్ ప్రక్రియ వరకు పలు దశలలో బీజేపీ అక్రమాలు చేస్తుంది.
మహాదేవపురంలో బీజేపీ ఐదు రకాలుగా ఓట్ల చోరీ చేస్తుందని రాహుల్ గాంధీ గణాంకాలతో సహా నిరూపించారు. ఇక్కడ తక్కువ సమయంలోనే లక్షాలాది మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ సెగ్మంట్లో ఆరున్నర లక్షలకుపైగా ఓటర్లుండగా, అందులో లక్షకుపైగా దొంగ ఓట్లే. ఇక్కడ 11 వేలకుపైగా డుప్లికేట్ ఓట్లున్నాయి. తప్పుడు చిరునామాలతో 40 వేలకు పైగా ఓట్లున్నాయి. ఒకే అడ్రస్పై బల్క్ ఓట్లు నమోదయ్యాయి. 4 వేలకుపైగా ఓటర్ల ఫోటోలు తప్పుగా ఉన్నాయి. ఓటర్లను చేర్చేందకు, తొలగించేందుకు నినియోగించే ఫారం 6 దరఖాస్తులు సుమారు 33 వేలకుపైగా దుర్వినియోగమయ్యాయి. ఈ ఐదు రకాల తప్పుడు విధానాలతో మహాదేవపురంలో బీజేపీ లక్షకుపైగా మెజార్టీ సాధించడంతో 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ బెంగుళూర్ సెంట్రల్ లోక్ సభ స్థానాన్ని 32 వేలకుపైగా మెజార్టీతో గెలిచింది. బీజేపీ అక్రమాలు ఒక్క బెంగుళూరు సెంట్రల్కే పరిమితం కాలేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25కు పైగా ఎంపీ సీట్లను 33 వేల కంటే తక్కువ మెజార్టీతోనే గెలవడం ఆ పార్టీ చేస్తున్న ఓట్ల చోరీకి నిదర్శనం. దేశంలో పలు చోట్ల అకస్మాత్తుగా భారీగా ఓట్ల నమోదు కావడమే పలు చోట్ల బీజేపీ గెలుపుకు దోహద పడ్డాయి.
ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ ఒక మహాదేవపురం ఆధారాలనే కాక ఇతర చోట్ల లోపాలను కూడా పసిగట్టి నిరూపించారు. దేశంలో చిరునామా లేని ఓటింగ్ కార్డులు వేల సంఖ్యలో ఉండడం, ఒకే ఇంట్లో వందకుపైగా ఓటర్లుండడం, ఒక వ్యక్తి ఒకటికి మించి ఇతర చోట్ల ఓటు కలిగుండడం వంటి లోపాలను కాంగ్రెస్ ఆధారాలతో సహా నిరూపించింది. ఒక ఓటరు ఒకే ఎపిక్ నెంబరుతో వేర్వేరు రాష్ట్రాల్లోనూ నమోదయ్యి, పలు చోట్ల ఓటింగ్ వేయడం ఎన్నికల్లో లోపాలకు పరాకాష్ట. మరోవైపు బీజేపీ కార్యకర్తలు బూత్ స్లిప్పులు చూసి, ఒకే వ్యక్తి పేరుతో ఒకే ఎన్నికల కేంద్రంలో చాలా ఓట్లు వేయించి ‘ఒక వ్యక్తి`ఒక ఓటు’ అనే సూత్రానికి తిలోదకాలు ఇచ్చారు. ఎన్నికల అవకతవకలపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ సంప్రదించినా స్పందన కరువైంది. పలు వివరాలు కావాలని ఈసీని కోరితే మొక్కుబడిగా కొన్ని ఓటర్ల జాబితాను అందించారు. ఆ కొంత సమాచారంతోనే రాహుల్ గాంధీ బీజేపీ, ఎన్నికల కమిషన్పై అణుబాంబు పేల్చారు. కాంగ్రెస్ కోరినట్టు ఈసీ డిజిటల్ రూపంలో మరిన్ని వివరాలు ఇచ్చుంటే మరింత సమగ్రంగా అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్నికల కుతంత్రాలను రాహుల్ గాంధీ బహిర్గతం చేసేవారు.
రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై పలు ఆధారాలతో లోపాలను ఎత్తిచూపితే, వాటికి బాధ్యతాయుతంగా స్పందించాల్సిన ఎన్నికల సంఘం దాటవేత వైఖరి ప్రదర్శిస్తుంది. రాహుల్ ఆరోపణలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ ఎన్నికల సంఘం వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యం. ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ ఆయన వాదన నిజమని నమ్మితే, అఫిడవిట్తో ఫిర్యాదు చేయాలని ఎన్నికల సంఘం చెప్పింది. రాహుల్ గాంధీ తాను నమ్మింది నిజమనే భావనతోనే ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్లీ అవన్నీ నిజమని నమ్మితే అఫిడవిట్ ఇవ్వమని ఈసీ చెప్పడం హాస్యాస్పదం. ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పదేపదే కోరగా ఇచ్చిన ఆధారాలతో ఈ లోపాలను పార్టీ ఎత్తి చూపించింది.
లోక్ సభ ఎన్నికల సమయంలోనే బీజేపీతో పాటు ఎన్నికల సంఘంపై పలు అనుమాలను వ్యక్తమయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారాలను ఇవ్వకపోవడం, వీవీ ప్యాట్లను లెక్కించడంపై ఈసీ వెనకడుగు వేసింది. ఈవీఎమ్లలో వీవీపాట్స్లో కొన్నింటినే శాంపిలుగా తీసుకొని లెక్కించడంతో ఓటింగ్ సంఖ్యపై అనుమానాలున్నాయి. ఈవీఎమ్ సాఫ్ట్వేర్, భద్రతా ప్రక్రియలకు సంబంధించి స్వతంత్ర నిపుణుల ద్వారా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ముందుకు రావడం లేదు. పోలింగ్ శాతం వివరాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం ఆలస్యం చేస్తుండడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ఇందుకు మహారాష్ట్ర ఎన్నికలే నిదర్శనం. అడ్డదారులతో అదంలం ఎక్కిన బీజేపీ నియంతృత్వ పోకడలతో వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే గతంలో ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ అంటూ జమిలి ఎన్నికల ప్రకటన, ఇప్పుడు బీహార్లో 65 లక్షలకుపైగా ఓట్ల తొలగింపు వంటి అప్రజాస్వామ్య పద్దతులను అనుసరిస్తుంది బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న సమయంలో ఓటర్ల జాబితా పరిశీలన పేరుతో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఓట్లను తొలగిస్తున్నారు.
దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామాన్ని పరిరక్షించాలని పోరాడుతున్న కాంగ్రెస్ దేశంలో ఓట్ల దొంగతనం, బీహార్లో ఓట్ల తొలగింపుపై ప్రజల వద్దకు వెళ్తుంది. పార్లమెంట్ వేదికగా వీటిపై చర్చ జరగాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి పార్టీలు కోరుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ లొసుగులు భయటపడుతాయనే జంకుతో చర్చించకుండా పారిపోతున్నాయి. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందామనే లక్ష్యంతో ఎన్నికల సంఘానికి శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడం కోసం ర్యాలీగా వెళ్తే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో సహా పలువురు ‘ఇండియా’ కూటమి నేతలను అరెస్టు చేయడంతోనే బీజేపీ హయాంలో ఓట్ల దొంగతనం అయ్యిందని నిరూపితమవుతోంది. అధికార బలంతో ఓట్ చోర్పై గొంతు నొక్కాలని రాహుల్ గాంధీని అరెస్టు చేస్తే యావత్ దేశం ఆయనకు మద్దతుగా నిలబడి ఓటు దొంగలకు బుద్ది చెప్పడం ఖాయం.