Janasena : తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆరు నూరైనా సీటూ, గెలుపూ మనదేనని స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి సమర్థ నాయకుడినీ, ఎన్నుకున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధినీ తెనాలి ప్రజలు ఎప్పటికీ మరచిపోరని చెప్పుకొచ్చారు.
వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం
ఆంధ్రప్రదేశ్ కు స్థిరత్వం ఇవ్వాలని బలమైన కాంక్షతోనే జనసేన పార్టీ పనిచేస్తుందన్నారు పవన్. రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి అనేదే ప్రాథమిక ఎజెండాగా ఎలా ఎదగాలన్నది నాయకులు పట్టించుకోలేదాని.. కేవలం వ్యక్తిగత ఎదుగుదల తప్ప, ప్రజా క్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం మీద నిబద్ధతతో నిలబడి ఉందని ఆయన స్పష్టం చేశారు . తాము చెప్పే ప్రతి మాట రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని చెబుతున్నదేనని.. అర్ధశాస్త్రంలో పన్నులను ఎలా విధించాలనే అంశంపై నిపుణులు చెబుతూ ‘పూల మీద మకరందం తీసుకునే సీతాకోకచిలుకలా ప్రభుత్వం పన్నుల విషయంలో వ్యవహరించాల’ని పవన్ చెప్పుకొచ్చారు.