Newsminute24

పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం?: నాదెండ్ల మనోహర్

Janasena:

• వసతి దీవెన, విద్యా దీవెన బటన్లు నొక్కినా నిధులు ఇవ్వలేదు

• విద్యార్థుల సరిఫికెట్లు నిలిపివేస్తున్నా పట్టని వైసీపీ సర్కార్

• వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం

సంక్షేమ పథకాలు అందిస్తున్నాం… బటన్లు నొక్కి డబ్బులు వేస్తున్నాం అని ప్రజలను మోసం చేయడంలో వైసీపీ పాలకులు సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు జనసేన నాదెండ్ల మనోహర్. వైసీపీ తప్పుడు ప్రకటనలు, విధానాల వల్ల ప్రజలు..  ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ఖజానాను దివాళా తీయించిన ఘనత సీఎం జగన్ రెడ్డిదేనని ఆరోపించారు. పథకాలకు సొమ్ములు లేవని తెలిసీ బటన్లు నొక్కడం జనాన్ని మభ్యపెట్టడమేనని.. పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం.. పాలకుడు దివాళాకోరుతనం మూలంగా- విద్య, వసతి దీవెనలు వచ్చేశాయనుకొన్న విద్యార్థులు ఇప్పుడు అగచాట్లుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో అసలు విషయం బయటపడిందన్నారు. ట్రిపుల్ ఐటీలకు చెందిన 4 వేల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయాయని… బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని అన్నారు.  ట్రిపుల్ ఐటీలతోపాటు ఇతర ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు సైతం ఇలాంటి ఇక్కట్లే పడుతున్నారన్నారు. ఉద్యోగాల్లో చేరాల్సిన వాళ్ళు, తదుపరి చదువులకు వెళ్లాల్సిన వాళ్ళు తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని బాధపడుతున్నారని వాపోయారు. ఈ వాస్తవాలు తెలిసి కూడా వైసీపీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. జగన్ రెడ్డి తక్షణమే పని చేసే బటన్లు నొక్కి బకాయిలు చెల్లించి విద్యార్థులు రోడ్డున పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ విద్యార్థుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడుతుందని మనోహర్ తేల్చిచెప్పారు.

Exit mobile version