Janasena: ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపరంగా దూరం చేసి, అన్ని రకాలుగా వెనక్కు తీసుకువెళ్లిన వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు
ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. దీని కోసం కచ్చితంగా వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్నదే జనసేన అభిమతమన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భేటీ జరిగింద’ని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం విశాఖపట్నంలో మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ “వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అత్యుత్తమ ప్రత్యామ్నాయం కోసం జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలకు మేలు జరిగే పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లలో అందించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు. గతంలో పవన్ కళ్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయబోమని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని చెప్పారన్నారు. దానిలో భాగంగానే రాజకీయ భేటీలు ఉంటాయని తేల్చిచెప్పారు. ఇవి భవిష్యత్తులోనూ జరుగుతాయన్నారు. ఒక ప్రణాళిక, వ్యూహంతో అభివృద్ధి పంథాలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేలా మా అడుగులు ఉంటాయని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షమని.. కచ్చితంగా రాజకీయంగా దానిని పాటిస్తూ ముందుకు వెళ్తామని మనోహర్ కుండ బద్దలు కొట్టారు.
ఉత్తరాంధ్ర వనరులు, భూములు కొల్లగొడుతున్నారు.
ఉత్తరాంధ్రలో అపారమైన మానవ వనరులు, సహజ వనరులు ఉన్నాయన్నారు మనోహర్. ఇప్పటి వరకు పాలకులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందన్నారు. వలసలు పెరిగిపోయాయని… అద్భుతమైన సహజ వనరులను అడ్డగోలుగా దోపిడీ చేశారని.. వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంపై చూపుతున్న ప్రేమ కేవలం కపట నాటకం మాత్రమేనని అయన మండిపడ్డారు. ఇక్కడ భూములపై కన్నేసిన వైసీపీ నాయకులు వాటిని దోచుకోవడం కోసమే కొత్త నాటకాలకు తెర తీశారన్నారు. నిషేధిత భూముల్లో అక్రమ కట్టడాలు, కనిపించిన ప్రతి జాగా ఆక్రమించుకోవడం ఇప్పటికే పెరిగిపోయిందని.. ఈ భూముల దోపిడీని అధికారికం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం తాపత్రయపడుతోందని మనోహర్ పేర్కొన్నారు.