బండ్ల గణేష్ తో రేవంత్ భేటి వెనక అంతర్యం..?

సినీ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా ? పీసీసీ అధ్యక్షుుడు రేవంత్ రెడ్డితో భేటి అవడానికి కారణం ఏంటి? బండ్ల కాంగ్రెస్లో చేరితే ఎక్కడ నుంచి పోటి చేస్తారు? రేవంత్ రెడ్డితో బండ్ల భేటి తర్వాత ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు! వీటన్నింటికి త్వరలో సమాధానం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సినీ నిర్మాత బండ్ల గణేశ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో భేటి కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం బండ్ల గణేష్ నివాసంలో ఇరువురు దాదాపు 2 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే భేటి తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బండ్ల గణేష్ కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బండ్ల యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. దీంతో అతనిని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాలని రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు బండ్ల గణేష్. అయితే ఆయనకు పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టికెట్ వస్తుందని ఆశించి భంగపడినట్లు సన్నిహితుల దగ్గర వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అత్యుత్సాహంతో ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఫలితాలు అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటినుంచి గణేష్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించినా దాఖలాలేవు.

అటు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాకా.. పార్టీతో అంటిముట్టనంటుగా వ్యవహరిస్తున్న నేతలందిరిని కలుస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే ఆయనతో రేవంత్ భేటి అయినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో బండ్ల ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ అధిష్టానం పార్టీ టికెట్ ఇస్తుందో లేదో వేచిచూద్దాం!

Optimized by Optimole