ప్రధాని తల్లి అంత్యక్రియలు చడీ చప్పుడు లేకుండా జరిగాయా?

బీజేపీ ‘గణతంత్ర’ స్వభావం వల్లే ప్రధాని తల్లి అంత్యక్రియలు అలా  జరిగాయా?
స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) కుటుంబం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ. ఈ పార్టీ రెండో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మరణం, అంత్యక్రియల వార్త ఒకే రోజు పత్రికల్లో చదివాం. సాధారణంగా పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతల తల్లిదండ్రులు కన్నుమూస్తే రెండు మూడు రోజుల జాతర జరగడం మన అనుభవం. బ్రిటిష్‌ రాణి ఫ్యూనరల్‌ మాదిరి పంచరంగుల్లో దృశ్యం కనిపిస్తుందనుకున్నారు. అలాంటిది హీరా బెన్‌ మరణించిన ఆరు గంటల్లో ఆమె భౌతికకాయానికి చడీ చప్పుడు కాకుండా అంత్యక్రియలు జరగడం ఆధునిక భారత దేశంలో నిజంగా నమ్మశక్యంగాని విషయమే. మన పాలకుల్లో కొందరైనా గణతంత్ర ప్రజాస్వామ్య విలువలను కొన్ని సందర్భాల్లోనైనా పాటిస్తారని తేలింది. మూడు తరాలకు చెందిన ముగ్గురు ప్రధానులు ఉన్న నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పెద్ద నేత చనిపోతే దేశం యావత్తూ కన్నీళ్లు, ఏడుపుల్లో మునిగిపోయేది. పదవిలోని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కొడుకైనా కేవలం ఒక మామూలు పార్లమెంటు సభ్యుడు అయిన సంజయ్‌ గాంధీ మరణించినప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలు–‘‘జబ్‌ తక్‌ సూరజ్‌ చాంద్‌ రహేగా, సంజయ్‌! తేరా నామ్‌ రహేగా’ (సూర్యచంద్రులు ఉన్నంత వరకూ సంజయ్, నీ పేరు నిలిచిపోతుంది) అంటూ శోకాలు పెట్టిన దృశ్యాలు నాకింకా గుర్తున్నాయి.

(ఫైల్ ఫోటో )

డైనాస్టీ వర్సెస్‌ రిపబ్లికన్‌ విలువలు
………………….
నెహ్రూ–గాంధీ వంటి ఆధునిక ప్రజాస్వామిక రాజవంశం (డైనాస్టీ) సభ్యులకు ఉండే ప్రత్యేక అధికారాలు, సౌకర్యాలు లేని కుటుంబంలో పుట్టినవాడు కాబట్టే నరేంద్ర మోదీ తన తల్లి అంత్యక్రియలు ఇలా చేయించారా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఇది కూడా కారణం కావచ్చు. అయితే, మతం, కులం, సాంప్రదాయాలు, సామాజిక విప్లవాలు వంటి విషయాల్లో మార్పుకు పెద్దగా ఇష్టపడని బీజేపీకి చెందిన ఓబీసీ ప్రధాని ఇలా చేయడంలో విశేషమేమీ కాదు. ‘అభివృద్ధి నిరోధక, ఛాందసవాద’ పార్టీగా ముద్రపడిన బీజేపీ తన ప్రత్యర్థి పక్షం కాంగ్రెస్‌ పార్టీకి లేని ఒక గొప్ప గుణాన్ని సంతరించుకుంది. అదేమంటే–రిపబ్లికనిజం. కుటుంబం, వారసత్వం వల్ల ఈ పార్టీ పెద్ద నేతలకు ఉన్నత పదవులు, ప్రత్యేక సౌకర్యాలు, అధికారాలు రావు. తొలి బీజేపీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి హయాంలో పార్టీకి కోట్లాది రూపాయల నిధులు సమకూర్చడమే గాక, కాషాయపక్షంలో ‘ట్రబుల్‌ షూటర్‌’ గా, బీజేపీ ‘అహ్మద్‌ పటేల్‌’ గా పేరు సంపాదించిన మరాఠీ బ్రాహ్మణ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ కన్నుమూశాక ఆయన కూతురు పూనమ్‌ మహాజన్‌ రావు ఆయన మాదిరి ఎంపీ అయిందేగాని కేంద్ర మంత్రి కాలేదు. మరో దివంగత బ్రాహ్మణ మంత్రి అరుణ్‌ జైట్లీ కుటుంబసభ్యులెవరూ ఆయన స్థాయికి ఎదగలేదు. ప్రస్తుత కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మయి తండ్రి ఎస్సార్‌ బొమ్మయి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినా గాని జనతాదళ్‌ నేతగానే ఆ పదవిలోకి వచ్చారు. ఇలాంటి ఉదాహరణలు బీజేపీలో కోకొల్లలు. కమ్యూనిస్టు పార్టీలు సైతం ఈ ‘రిపబ్లికన్‌’ (కుటుంబ పరంగా లేదా వారసత్వం ద్వారా ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు లేని గణతంత్ర స్వరూపం) స్వభావం కలిగి ఉన్నాయి. బీజేపీ కూడా ఇదే దారిలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ తల్లి అంత్యక్రియలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిన తీరును చూస్తే–ఇక్కడ ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు. రిపబ్లికన్‌ విలువలు అన్ని రంగాల్లో ఇలా ‘పరిఢవిల్లితే’ బావుంటుందేమో మరి.

================

Nancharaiah merugumala,

senior Editor

You May Have Missed

Optimized by Optimole