అజ్ఞానుల చేత …అవినీతి పరులతో..!!

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా:

యువకులను తన మాటలతో, తెలివితో రెచ్చగొడుతున్నాడని రాజ ద్రోహానికి/ రాజ్య ద్రోహానికి పాల్పడుతున్నాడని ప్రఖ్యాత తత్వవేత్త సోక్రటీస్పై నిందలు మోపారు. దీనికి శిక్ష ఏమిటని ప్రజలందరినీ సమావేశపరిచారు ఆనాటి రాజ్యపాలకులు. సోక్రటీస్ కు మరణశిక్ష విధించాలని 280 మంది ప్రజలు ఓటేయగా 220 మంది ఆ తత్వవేత్తకు మరణశిక్ష విధించడాన్ని తిరస్కరించారు. మొత్తం మీద సోక్రటీస్కు మరణశిక్ష ఖరారైంది. ఆయనకు ఆయనే విషం తాగమని శిక్ష విధించారు. తాత్విక లోకానికి మార్గదర్శన ఒక గొప్ప తత్వవేత్త మరణించారు.

 నిజానికి సోక్రటీస్ ఆనాటి లోప భూయిష్టమైన, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని( ఏథెన్స్) ను వ్యతిరేకించాడు. అవినీతిపరుల, అజ్ఞానుల వ్యవస్థ ప్రజాస్వామ్యమని గట్టిగా వాదించాడు. 2300 ఏళ్ల క్రితం ప్రజాస్వామ్యం గురించి ఏవైతే ఆయన అభిప్రాయపడ్డా డో, ఈనాటి కీ నేటి ప్రజాస్వామ్యంలో అవే అవ లక్షణాలు ఉండటం గమనార్హం.

ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, కుల, మత, ప్రాంతీయ తత్వాల జోక్యాన్ని ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. హత్య ఆరోపణలు, అత్యాచార ఆరోపణలు దొంగతనాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలామంది. మంత్రులు, ముఖ్యమంత్రులు కావడం ఈ ప్రజాస్వామ్యానికి చెల్లింది.

 ప్రజాస్వామ్యం, ప్రజల ప్రభుత్వం, స్వేచ్ఛ, స్వాతంత్రం వాక్ స్వేచ్ఛ అనే మాట్లాడే నాయకులు పార్టీలు ఆ ప్రజాస్వామ్యం మాటను చేసే అరాచకాలు అందరికీ తెలిసిన విషయమే.

 ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రభుత్వమని లింకన్ అన్నారు. కానీ ఎవరు ఎవరిని ఎన్నుకుంటున్నారు? ఎవరికోసం ఎవరిని ఎన్నుకుంటున్నారు? ఎందుకోసం ఎన్నుకుంటున్నారు? కనీస స్పృహ ఉందా? ఈ ప్రజలకి? డబ్బు తీసుకొని ఓటేసే వాళ్ళు విచక్షణతో ఎలా ఆలోచించగలరు? నీతివంతమైన వ్యవస్థను ఎలా స్థాపించగలరు? ఎమ్మెల్యే కావడానికి వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి లోక్సభ ఎంపీకి 25, రాజ్యసభ పోటీ చేయడానికి 30, దేశ అధ్యక్షునిగా నిలబడడానికి 35 ఏళ్లు వయసు ఉండాలి. వారిని ఎన్నుకోవడానికి 18 ఏళ్ల వయసు నిండిన వ్యక్తి అయితే చాలు. అంటే ఎక్కువ వయసు ఉన్న వారి అనుభవాన్ని ఆలోచనలను తెలివిని కనీస జీవితానుభవం, పూర్తి పరిపక్వమైన ఆలోచనలు లేని వ్యక్తులు ఎలా నిర్ణయిస్తారు?

దేశ పరిపాలన అదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నడిపే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎన్నో కఠిన పరీక్షలను ఇంటర్వ్యూలను తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. దేశాన్ని నడపడానికి ఒక బలమైన అడ్మినిస్ట్రేషన్ కావాలి అలాంటి వారిని ఎంపిక చేసేటప్పుడు కఠిన పరీక్షలు పెట్టడం ఇంటర్వ్యూలు నిర్వహించడం పరిపాటి. అలా చేయకపోతే దేశ ప్రభుత్వ పాలనే కుప్పకూలిపోతుంది. వారికి ఆదేశాలు జారీ చేసేది మాత్రం కనీస పరిజ్ఞానం లేని ఒక విద్యార్హత కూడా అవసరం లేని రాజకీయ నాయకులు. రాజ్యాంగం గురించి రాజ్య వ్యవస్థ గురించి అంతగా తెలియని రాజకీయ నాయకులు ఇలాంటి మేధావుల్ని శాసించడం ఎంతవరకు కరెక్టు? 

 ప్రజాస్వామ్యమే మంచి వ్యవస్థ అయితే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఎన్నికల ద్వారా వ్యక్తులను ఎన్నుకొని పరిపాలించమని అడగొచ్చు కదా!  ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే  ఎన్నికలు,ఎందుకు కలెక్టర్లకు, ఇంకా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా డెమోక్రసీ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి వారిని ఎన్నుకోవచ్చు కదా అలా ఎందుకు చేయడం లేదు?

ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న విపరీతమైన లక్ష్యం జరుగుతుంది. చాలా సమయం తీసుకున్నాక ఆ నిర్ణయం సరే అవుతుందా అంటే చెప్పలేము. ఎంపీలు ఎమ్మెల్యేల మనసు మారితే కతం విధానాలు అటకెక్కుతాయి.

 ప్రజాస్వామ్యంలో ఇవే లోపాలంటే దేశ సమగ్రతకు ఐక్యతకు ఈ డెమోక్రసీ చాలా ప్రమాదం. ఇలాంటి 1962లో చైనా మన దేశంపై యుద్ధం చేసినప్పుడు ఇక్కడి కమ్యూనిస్టు పార్టీలు చైనాకు వంత పాడాయి మన దేశమే చేనాని ఆక్రమించిందని విపరీత ప్రచారం చేసి దేశాన్ని బధనం చేశాయి. శత్రుదేశాలని పొగడడం ప్రేమించడం బహుశా ప్రజాస్వామ్య దేశాల్లోనే ఉంటుందేమో?

 ప్రజాస్వామ్యం ఎలాంటిదంటే చాక్లెట్ దుకాణానికి వెళ్లిన చిన్న పిల్లవాడు ఏది కొనుక్కుందామా అని తెగ ఆరాటపడే లాగా ఈ ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి నీతి నియమాలు కలిగిన విజ్ఞానవంతులు తత్వవేత్తలతో కూడిన రాజ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం కంటే ఎన్నో రెట్లు మెరుగైనది, వారే ప్రభుత్వ పాలన చేయడానికి సరి అయిన అయినవారు.

______________

ప్రత్యేక వ్యాసం:

కిరణ్ కుమార్ (జర్నలిస్టు)

 

Related Articles

Latest Articles

Optimized by Optimole