Site icon Newsminute24

Jubileehills: సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌.. కట్టింగ్‌ మినిస్టర్‌ కాదు’: కేటీఆర్

Telangana:

హైదరాబాద్‌లో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే చర్చకు రావాలని సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అర్థమైయేటట్లు చెప్పే సత్తా తమకు ఉందని అన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి మమ్మల్ని తిట్టినా.. మేం మాత్రం గౌరవంగానే మాట్లాడుతామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో.. రెండేళ్లలో రేవంత్‌ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిన ఆయన.. దీంతో చెత్త ఎవరిది.. సత్తా ఎవరిదో తేలిపోతుందని అన్నారు.

హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన అంశాలను కేటీఆర్‌ ప్రస్తావించారు. హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు నిర్మించాం.. తమ హయాంలో స్టార్ట్‌ చేసినవాటికే కాంగ్రెస్‌ రిబ్బన్‌ కట్‌ చేసిందని వివరించారు. అవి కాకుండా.. కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు అయినా నిర్మించావా అని రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ ప్రశ్నించారు. కొత్త రోడ్ల సంగతి తర్వాత.. కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా అని నిలదీశారు. నగర ప్రజలకు మళ్లీ వాటర్‌ ట్యాంకర్‌లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

హైదరాబాద్‌లో శానిటేషన్‌ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ కూడా సీఎంగా ఒక ఏరియాను ఎంచుకొని అక్కడ శానిటేషన్‌ పనులు పర్యవేక్షించారని గుర్తు చేశారు. స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. వేలాది స్వచ్ఛ్‌ ఆటోలను ప్రవేశపెట్టామని అన్నారు. ఇప్పుడు కనీసం ఒక్క ఆటోనైనా ప్రవేశపెట్టారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతి రోజు 7.5 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరించామని వెల్లడించారు. స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌లో 34 అవార్డులు సాధించామని తెలిపారు. బెస్ట్‌ క్వాలిటీలో నెంబర్‌ వన్‌ సిటీగా హైదరాబాద్‌కు అవార్డు వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే SNDPని కూడా స్టార్ట్‌ చేసినట్లు తెలిపారు. పదేళ్లలో కేసీఆర్‌ హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా మారిస్తే.. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మురికికూపంగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక.. పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించిదని గుర్తు చేశారు కేటీఆర్‌. ఈ రెండేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టారా అని ప్రశ్నించారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని రేవంత్‌ రెడ్డికి చాలెంజ్‌ చేశారు కేటీఆర్‌. కాంగ్రెస్‌ సర్కార్‌ ఒక్క ఇల్లు కట్టకపోగా.. వేలాది ఇళ్లను హైడ్రా పేరుతో ఈ ప్రభుత్వం కూలగొట్టిందని ఫైరయ్యారు. మరోవైపు.. హైదరాబాద్‌ మెట్రోను పూర్తి చేసింది కూడా తమ ప్రభుత్వమేనని కేటీఆర్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం మెట్రో సీఎఫ్‌వో, ఎల్‌ అండ్‌ టీ సీఎఫ్‌వోలను బెదిరిస్తోందని ఫైరయ్యారు. కాంగ్రెస్‌ బాధ తట్టుకోలేక, వాళ్ల బెదిరింపులకు తాళలేక ఎంత మంది పారిశ్రామికవేత్తలు పారిపోయారో చర్చకు సిద్ధమా అని నిలదీశారు.

ఇక.. కరెంటు విషయంలోనూ కాంగ్రెస్‌ తీరును ఎండగట్టారు కేటీఆర్‌. కాంగ్రెస్‌ హయాంలో వారానికి రెండు, మూడు రోజులు పవర్‌ హాలిడేస్‌ ఉంటే.. తాము అధికారం చేపట్టిన తర్వాత 24 గంటలు కరెంటు ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్‌ఈడీ బల్బులతో తెలంగాణను దేదీప్యమానంగా చేశామని.. కానీ ఈ రెండేళ్లలో రేవంత్‌ సర్కార్‌ ఒక్క ఎల్‌ఈడీ అయినా పెట్టిందా అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో విద్యుత్‌ వెలుగులు కొనసాగాయో.. ఎవరి హయాంలో విద్యుత్‌ కోతలతో ఇబ్బంది పడ్డారో చర్చిద్దామా అని సవాల్‌ విసిరారు కేటీఆర్‌.

కాంక్రీట్‌ జంగిల్‌లో కొత్తగా లంగ్‌ స్పేస్‌లు ఏర్పాటు చేసిన ఘనత తమదే అన్నారు కేటీఆర్‌. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి.. 16వేల నర్సరీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మీ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క నర్సరీ కూడా పెట్టకపోగా.. ఉన్న చెట్లను నరికేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు.. రూ.10వేల కోట్లకు కక్కుర్తిపడి HCUలో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగాలను కూడా మూడు లక్షల నుంచి 9 లక్షలకు పెంచామని గుర్తు చేశారు.

శాంతిభద్రతల విషయంలోనూ కాంగ్రెస్‌ పనితీరు ఏంటో బయటపెట్టారు కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ హయాంలో సీసీ కెమెరాలు పెట్టి కేసీఆర్‌ హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పెంపొందిస్తే..
ఇప్పుడు సైబరాబాద్‌లో 41 శాతం, హైదరాబాద్‌లో 60 శాతం క్రైమ్‌ రేటు పెరిగిందని వెల్లడించారు. డే లైట్‌ మర్డర్లు పెరిగాయని అన్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు.. హైదరాబాద్‌లోని‌ చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా అని అన్నారు.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్‌ సూటిగా సవాల్ విసిరారు. దమ్ముంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్ల అడగాలని చాలెంజ్‌ విసిరారు. దీనిపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి తాము సిద్ధమని సవాల్‌ విసిరారు. చర్చించడానికి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్లేస్‌, టైమ్‌ వాళ్లు చెప్పినా సరే.. తమను చెప్పమన్నా సరే అని అన్నారు.. కమాండ్‌ కంట్రోల్‌ సెంటరైనా.. గాంధీభవన్‌ అయినా.. అసెంబ్లీలో చర్చ పెట్టినా తాము ఈ విషయాలపై చర్చించడానికి రెడీగా ఉన్నామని తేల్చిచెప్పారు.

మరోవైపు.. రేవంత్ రెడ్డి, మోదీ మధ్య మంచి ఫెవికాల్ బంధం ఉందన్నారు కేటీఆర్‌. తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ జాయింట్ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాహుల్ గాంధీ విమర్శిస్తే.. అదే సంస్థలను రేవంత్ నమ్ముతారని వెల్లడించారు. ఇక.. మైనార్టీలను అవమానించినందుకు గాను రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్‌. లేదంటే కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అటు.. ఫార్ములా ఈ కేసులోనూ గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినా, చార్జ్‌షీట్‌లో విషయం లేకపోవడం వల్ల దాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని తేల్చిచెప్పారు. తనపై చేసిన ఆరోపణల విషయంలో.. దమ్ముంటే ఈ ప్రభుత్వం తనను అరెస్ట్‌ చేయాలని చెప్పారు. అంతేకాకుండా.. తాను లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమే అని.. రేవంత్‌ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. దీంతో ఎవరు దొంగనో తేలిపోతుంది కదా అని చెప్పారు. ప్రతి విషయంలోనూ పచ్చి అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Exit mobile version