Newsminute24

ఏపీలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా ప్రకటించడంపై కేంద్రంకు ఫిర్యాదు!

Nancharaiah merugumala ( political analyst): ఆంధ్రాలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌ ప్రకటించడంపై కేంద్ర సర్కారుకు ఫిర్యాదు!

======================

ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ బోర్డ్‌ రాష్ట్రంలోని అతి చిన్న ముస్లిం మైనారిటీ వర్గం అహ్మదియాలను కాఫిర్లుగా (ముస్లిమేతరులుగా) ప్రకటిస్తూ ఫిబ్రవరి మాసంలో తీర్మానం చేసింది. తమను తాము ఆచరించే ఇస్లాం నుంచి బహిష్కరించారని, ఈ విషయంలో జోక్యం చే సుకుని తమను కాపాడాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అహ్మదియాలు విన్నవించుకున్నారు కిందటి వారం. భారత రాజ్యాంగం ప్రకారం ఇండియాలో అహ్మదియాలకు అన్ని హక్కులు ఉన్నాయి. అయితే, తాము నివసించే ప్రదేశాల్లో ఇతర ముస్లింల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్‌ కుళాయిలను ఈ మైనారిటీ ముస్లింలను వాడుకోనీయడం లేదు. దుకాణాల్లో సైతం అహ్మదియాలను షాపింగ్‌ చేసుకోనివ్వడం లేదు. ఇలాంటి సామాజిక వెలి ద్వారా, ఏపీ వక్ఫ్‌ బోర్డు అహ్మదియాలను కాఫిర్లు అని ప్రకటించడం ద్వారా ఇస్లాంలోని అత్యంత అల్పసంఖ్యాకవర్గానికి చెందిన ప్రజల హక్కులు హరిస్తున్నారు. పాకిస్తాన్‌ లో గట్టి మూలాలున్న అహ్మదియాలను తెలుగు రాష్ట్రాల్లో ఇలా వేధించడం ఇదే మొదటిసారి కాదు. 11 ఏళ్ల క్రితమే 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా ఇలాంటి తీర్మానం చేశారు. అహ్మదియాలను ఇలా ఇస్లాం నుంచి వేరు చేసి చూపించే ఈ నిర్ణయం ఇంకా కోర్టు విచారణలో ఉంది.

ఇండియాలో అహ్మదియాలు క్షేమం?

పాకిస్తాన్‌ తో పోల్చితే భారతదేశంలో అహ్మదియాలను ఇతర ముస్లింల మాదిరిగానే సమానంగా చూస్తున్నారు. భారత చట్టాల ప్రకారం వారికి తమను తాము ముస్లింలుగా పరిగణించే హక్కు ఉంది. పాకిస్తాన్‌ అహ్మదియా ముస్లిం వర్గానికి చెందిన డాక్టర్‌ అబ్దుస్‌ సలాంకు 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. 1926లో బ్రిటిష్‌ ఇండియాలోని అవిభక్త పంజాబ్‌ లో జన్మించారు డా.సలాం. పాకిస్తాన్‌ అణుశక్తి కమిషన్‌ (ఏఈసీ), స్పేస్‌ అండ్‌ అపర్‌ అట్మాస్ఫియర్‌ రీసెర్స్‌ కమిషన్, కరాచీ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ స్థాపనలో డా.సలాం గొప్ప పాత్ర పోషించారు. అయినా, ఆయన అహ్మదియా కుటుంబంలో పుట్టారనే కారణంతో ఆయన సమాధి శిలాఫలకంపై మొదట రాసి ఉన్న మాటల్లోని (తొలి ముస్లిం నోబెల్‌ బహుమతి గ్రహీత అని) ‘ముస్లిం’ అనే అక్షరాలను తెల్ల రంగుతో ‘చెరిపేశారు’.

పై వాక్యాల్లో ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ బోర్డు తీర్మానం, రాష్ట్రంలో అహ్మదియాలను సామాజికంగా వెలివేయడానికి– సంబంధించిన విషయాలు ‘న్యూజ్‌ 18’ వెబ్‌సైట్‌లో ఈ నెల 24న ప్రచురించిన వ్యాసంలో మాత్రమే రాశారు. ఈ వ్యాసం చదివే వరకూ  పై విషయాలు మీడియాలో ఎక్కడా చదివినట్టు గుర్తులేదు.  అవిభక్త పంజాబ్‌ లో పుట్టిన అహ్మదియా ముస్లిం వర్గం అన్ని చోట్లా మెజారిటీ ‘ప్రధాన స్రవంతి’ మహ్మదీయుల చేతుల్లో ఎదుర్కొంటున్న వేధింపులపై మోనికా వర్మ ఈ వ్యాసం రాశారు. ఆమె సార్క్‌ దేశాలు దిల్లీలో ఏర్పాటు చేసిన సౌత్‌ ఏషియన్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ సంబంధాల శాఖలో పీహెచ్డీ చేశారు.

పార్లమెంటు చట్టం ద్వారా ముస్లిమేతరుగా మారిన పాక్‌ అహ్మదియాలు..

పాకిస్తాన్‌ అవతరించాక అనేక మంది అహ్మదియా ప్రముఖులు అక్కడి కేంద్ర ప్రభుత్వంలో, సైన్యంలో కీలక పదవుల్లో ఉండేవారు. తర్వాత కొన్నేళ్లకే దేశంలో అహ్మదియాలపై దాడులు జరిగాయి. అహ్మదియాలు అధిక సంఖ్యలో ఉన్నచోట్ల రెండు ఇస్లామిక్‌ వర్గాల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. పాక్‌ ఆర్మీ జోక్యంతో ఈ కొట్లాటలు అప్పట్లో ఆగిపోయాయి. మాజీ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్లో అధికారంలో ఉండగా 1974లో పాకిస్తాన్‌ పార్లమెంటులో ఒక చట్టం చేసి దేశంలోని అహ్మదియాలను ముస్లిమేతరులుగా (కాఫిర్లు) ప్రకటించారు. ప్రపంచంలో ఒక పార్లమెంటు చట్టం ద్వారా ఒక మతం ఆచరించేవారిని ఆ మతానికి చెందనివారిగా ప్రకటించడం ఇదే మొదటిసారి, చివరిసారి అంటారు. ఈమధ్య కాలంలో పాకిస్తాన్‌లోని అనేక చోట్ల అక్కడి స్మశాన వాటికల్లో శవాల ఖననానకి కూడా అహ్మదియాలను అనుమతించడం లేదని తరచు వార్తలు వస్తూనే ఉన్నాయి. 1953లో లాహోర్‌ నగరంలో జరిగిన దాడుల్లో అహ్మదియాలు పెద్ద సంఖ్యలో మరణించారు. 1974 పాక్‌ అల్లర్లలో కూడా ఈ మైనారిటీ వర్గానికి విపరీత ప్రాణనష్టం జరిగింది. ఇస్లాంలో అహ్మదియా ఉద్యమ స్థాపకుడు మీర్జా గులాం అహ్మద్‌ (1835–1908. ఆయన జన్మించిన పట్టణం కాదియాన్‌ భారత పంజాబ్‌ లోని గురుదాస్‌ పుర్‌ జిల్లాలో ఉంది. అందుకే, పాకిస్తాన్‌ లో అహ్మదియాలను కించపరిచే రీతిలో ‘కాదియానీలు’ అని పిలుస్తారు ఇతర ముస్లింలు.

( ఫోటో డా. సలాం సమాధి శిలా ఫలకంపై ముస్లిం అనే అక్షరాలను తెల్ల రంగుతో చెరిపిన తీరుఆంధ్రాలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌ ప్రకటించడంపై కేంద్ర సర్కారుకు ఫిర్యాదు!)

Exit mobile version