మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు లేఖ ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాల రాస్తున్న విధానాన్ని ఎండగట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలను కేసిఆర్ విస్మరిస్తున్న తీరుపై లేఖలో సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం 73, 74 అధికరణల ద్వారా స్థానిక సంస్థల ప్రతినిధులు పొందిన హక్కులను గురించి ప్రస్తావించారు. మహాత్మా గాంధి కలలు కన్న స్వరాజ్యా స్వప్నాన్ని సాకారం చేసే సైనికులు అయినటువంటి ప్రజా ప్రతినిధుల అధికారాలను నిర్వీర్యం చేస్తూన్న సీఎం కేసిఆర్ కు గుణపాఠం చెప్పాలని సంజయ్ లేఖలో పిలుపునిచ్చారు.
కాగా గ్రామాల అభివృద్ధిలో కేంద్రం పాత్రను సంజయ్ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్ర నిధులతో గ్రామాల అభివృద్ధి జరుగుతుంటే.. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది మాదిరి.. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటూ డప్పుకొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్ల పాలలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలకు అతీగతీ లేకుండా పోయిందన్నారు. కేజీ టు పీజీ విద్య అమలవుతుందా ? గ్రామంలో మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని..ఉచిత ఎరువులు పంపిణీ చేస్తామని మోసం చేశారని.. కేసీఆర్ రుణ మాఫీ చేయకపోవడం వల్లే. రాష్ట్రంలోని ప్రతి రైతు నెత్తిమీద లక్ష రూపాయలు అప్పు పడ్డదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఉప ఎన్నిక వస్తేనే సీఎం కేసిఆర్ కి దళిత బంధు.. గిరిజన బంధు వంటి పథకాలు గుర్తొస్తాయని లేఖలో సంజయ్ పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు.. నిరుద్యోగ భృతి హామీలన్నీ నీటిమీద రాతలే అయ్యాయని అన్నారు. 8 ఎండ్ల నుంచి బిసి సంక్షేమానికి బడ్జెట్ లో కేటాయిస్తున్న నిధులు నామమాత్రమేనని స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి స్వయం ఉపాధి లోన్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ వృత్తులనూ కోలుకోలేని దెబ్బ తీసిందని సంజయ్ గుర్తు చేశారు. 2018 ఎన్నికల్లో లక్షా 75 వేల ఎకరాలకు..డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి’నీళ్ళు ఇచ్చి.. ఆకుపచ్చ మునుగోడు చేస్తానని కేసిఆర్ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని సంజయ్ మండిపడ్డారు.
మొత్తం మీద ఉప ఎన్నిక తేదీ ఖరారు నేపథ్యంలో బండి సంజయ్ లేఖ అధికార పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. అటు అభ్యర్థి ఎంపిక .. ఇటు కమలం నేతల దూకుడుతో కారు పార్టీ డైలమాలో పడింది.