కరీనంగర్ మాజీ ఎంపీ కన్ను హుస్నాబాద్ నియోజవకర్గంపై పడిందా? గతంలో హస్తం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన అతను ఈనియోజకవర్గం ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకవేళ అతను అక్కడి నుంచి పోటిచేస్తే స్థానిక నేతలు మద్దతు ఇస్తారా? ఇప్పటికే సీటు నాదేనని భావిస్తున్న స్థానిక నేత పరిస్థితి ఏంటి? మాజీ ఎంపీ ప్రతిపాదనకు ఢిల్లీ అధిష్టానం పచ్చజెండా ఊపుతుందా?
కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ గెలుపొందారు. రాష్ట్రం ఏర్పాడ్డాక జరిగిన 2014,19 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటిచేసి ఆయన ఓడిపోయారు. అయితే రానున్న ఎన్నికల్లో పొన్నం ఎమ్మెల్యేగా పోటిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ సైతం స్టార్ట్ చేసినట్లు.. త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది.
హుస్నాబాద్ మాత్రమే ఎందుకు?
హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. 2009లో నియోజకవర్గ ఎంపీగా పనిచేసిన పొన్నంకి అనుభవానికి తోడు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో తన సామాజిక వర్గ ఓటర్లు ఉండడం.. దీనికి తోడు గతంలో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన చిన్నమల్లయ్యగౌడ్ తన సామాజకివర్గం కావడం..వంటి విషయాలను భేరిజు వేసుకుని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటిచేయాలని పొన్నం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే నుంచి పోటి..!
ఎమ్మెల్యే పోటిచేయాలని భావిస్తున్న మాజీ ఎంపీ పొన్నంకి సొంత పార్టీ నేత నుంచే పెద్ద సవాల్ ఎదురవుతుంది. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రవీన్ రెడ్డి.. కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి అధికార బిఆర్ఎస్ లో చేరారు. కారు పార్టీలో ఇమడలేక మళ్లీ హస్తం గూటికి చేరారు. ఈసారి హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటిచేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఉద్యమనాయకునిగా, ఎంపీగా పనిచేసిన పొన్నంకి ఢిల్లీ పెద్దల ఆశీస్సులున్నాయి. దీంతో ఎమ్మెల్యేగా పొన్నం పోటిచేయాలని భావిస్తే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమన్నది మాజీ ఎంపీ అనుచరుల మాటగా తెలిసింది. ఈనేపథ్యంలో పొన్నం ఎమ్మెల్యేగా పోటిచేస్తే ప్రవీణ్ రెడ్డి సపోర్ట్ చేస్తారా లేదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.