NDA: గత అయిదేళ్లలో శాసన సభ్యులంటే బెదిరింపులు, బూతులు అనే ధోరణిని చూశారు… ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి శాసన సభ్యుల్లో ఓ సుహృద్భావ వాతావరణం, సోదరభావం పెంపొందించేందుకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం శుభ సంప్రదాయం’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఐక్యతతో, పోరాట పటిమతో, సమష్టిగా ముందుకు సాగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
కాగా రెండు రోజులుగా సాగిన క్రీడా పోటీలు, గురువారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శాసనసభ్యుల పెర్ఫామెన్స్ చూసిన తర్వాత జస్ట్ వావ్… అనిపించిందని చెప్పారు. శాసన సభ, శాసనమండలి బడ్జెట్ సెషన్ ముగింపు వేళ శాసన సభ్యులకు, శాసనమండలి సభ్యులకు రెండు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని క్రీడా పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల వేషాలు, ఏకపాత్రాభినయాలు, స్కిట్లతో అలరించారు. కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ఆసాంతం ఎంజాయ్ చేశారు. చప్పట్లతో తోటి శాసనసభ్యులను, మండలి సభ్యులను ప్రొత్సహించారు.