తొలి వెలుగు అంటే టక్కున గుర్తొచ్చే పేరు జర్నలిస్ట్ రఘు. తెలంగాణా ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేసిన రఘు.. ప్రజా గొంతుకగా మారి ప్రజల పక్షాన నిలిచాడు. రఘు అంటే తొలి వెలుగు.. తొలి వెలుగు అంటే రఘు అనేంతలా పరిస్థితి తయారైంది.ఇప్పుడు ఆ సంస్థను అధికార పార్టీ నేత టేక్ ఓవర్ చేయడంతో.. రఘు సంస్థ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో అతనికి సంస్థకు మధ్య యుద్ధం మొదలైంది. నిన్నటివరకు రఘుతో పనిచేసిన జర్నలిస్టులు..అతనిపై నిందలు మోపుతూ కథనాలు ప్రసారం చేస్తున్నారు. అసలు రఘుకు- తొలి వెలుగు సంస్థకు వార్ కి కారణాలు ఎంటి? ఈ ఇష్యుపై ఓ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ..
తొలివెలుగు యూట్యూబ్ చానల్ జర్నలిస్టు రఘు ఆ చానల్ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆ చానల్ యాజమాన్యం పై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అందులో ప్రధానమైన ఆరోపణ తొలి వెలుగు యాజమాన్యం మంత్రి కేటీఆర్ ఆధీనంలోకి వెళ్లిందని. దీంతో రఘు ఆరోపణలపై ప్రత్యారోపణలు చేసేందుకు గాను వెంటనే ఆ తొలి వెలుగు చానల్లో పని చేస్తున్న మరో ఇద్దరు జర్నలిస్టులు అయిన శ్రీనివాస్, సోము తొలి వెలుగు ద్వారా రంగంలోకి దిగారు. జర్నలిస్టు రఘు తొలి వెలుగు యాజమాన్యం ను రూ.5కోట్లు డిమాండ్ చేశారని, చివరకు రూ.2 కోట్లు అయినా ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడని, రఘు అడిగిన మొత్తం ఇవ్వనందుకు యాజమాన్యంపై ఇలా ఆరోపణలకు పాల్పడుతున్నాడని ప్రధానం గా ఆరోపించారు. అలాగే రఘుకు అనుకూలంగా, మంచి జర్నలిస్టుగా అభివర్ణిస్తూ క్యూ న్యూస్, కాళోజీ టీవీ తో పాటు మరికొన్ని యూట్యూబ్ చానల్స్ స్టోరీలను ప్రసారం చేశాయి. వాస్తవానికి తొలి వెలుగులో పనిచేస్తున్న క్రమంలో రఘు ప్రభుత్వం పై, ప్రభుత్వం లోని ప్రజాప్రతినిధులపై ఘాటుగా, పరుష పదజాలంతో, వ్యక్తిగత దూషణలు చేశారు. మొన్నటి వరకు తొలి వెలుగు యాజమాన్యం గుప్పిట్లో ఉన్న రఘు ఆ యాజమాన్యం చెప్పినట్లుగా తన భాషను వాడిండు. కానీ నిజానికి నిజ జీవితంలో రఘు భాష మర్యాద పూర్వకంగానే ఉంటుంది. అలాగే ఇవ్వాళ తొలివెలుగు గుప్పిట్లో ఉన్న జర్నలిస్టులు శ్రీనివాస్, సోము సహచర జర్నలిస్టు రఘు పై అనేక ఆరోపణలు చేశారు. ఈ ఎపిసోడ్ లో ఉన్న ముగ్గురు జర్నలిస్టులు కూడా నిన్నటి వరకు మంచి స్నేహితులు. ఈ ముగ్గురు పాలోళ్లు కాదు, వాళ్ళ మధ్య పగలు, ప్రతీకారాలు కూడా లేవు. కానీ మొన్నటి వరకు రఘుని ఆడించిన తొలి వెలుగు యాజమాన్యం నిన్నటి ఉదయం నుండి శ్రీనివాస్, సోమును అడిస్తుంది. ఇక్కడ ఒక జర్నలిస్టుపై మరో జర్నలిస్టు నిందలు మోపుతున్నాడు కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో తొలి వెలుగు యాజమాన్యం ఎక్కడా కూడా కనిపించలేదు. కారణం ఒక్కటే… జర్నలిస్టుల ను బలిపశువును చేయడం ఆ యాజమాన్యాలకు కొత్త కాదు.
భవిష్యత్తులో కూడా శ్రీనివాస్, సోము అనే జర్నలిస్టులు మీడియా యాజమాన్యం చేతిలో కీలుబోమ్మలు గా మారి బలిపశువులు అవుతారు. కానీ యాజమాన్యం మాత్రం ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా బలిపశువు కాదు. యాజమాన్యం రాజ్యాంగాన్ని కాదని రాజ్యానికి గులాం గా ఉంటాది. అందుకే మీడియా యాజమాన్యాలు ఎంత ఆడించినా జర్నలిస్టుకు స్వీయ నియంత్రణ ఉండాలి. ప్రజల అవస్థలు, అవసరాలు ఎజెండాగా ఉండాలి. గాని ఫోర్త్ ఎస్టేట్ గా గర్వంగా పిలుచుకునే మీడియాను ఓ బూతు గా మార్చవద్దు. యాజమాన్యం స్వేచ్చను ఇచ్చిందని నీచమైన పదజాలం తో వ్యక్తిగత దూషణలు చేయకూడదు. రాజ్యాంగం లోని వాక్ స్వాతంత్రంను విస్తరించుకొని మనమే ప్రకటించుకున్న మీడియా స్వేచ్చకు లోబడి అన్ని ఆధారాలతో కూడిన అర్థవంతమైన చర్చ ఉంటే ఒక్క కేసు కూడా కాదు. అందుకు నేనే ఉదాహరణ. నేను రాసిన ఇన్వెస్టిగేషన్ కథనాలతో ఇప్పటి వరకు వివిధ హోదాలలో పని చేస్తున్న 198 మంది ప్రభుత్వ అధికారులు సస్పెండ్ అయ్యారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములు సంరక్షించబడ్డాయి. కానీ నేను రాసిన కథనాలపై ఒక్క లీగల్ నోటీస్ కూడా రాలేదు. అలాగే మియాపూర్ భూ కుంభకోణం ను నేను వెలుగులోకి తీసుకోచ్చినప్పుడు, ఈటల రాజేందర్ వ్యవహారం తో పాటు ఒవైసీ, ఇతర నాయకుల భూ అక్రమనలు, కబ్జాల పై నేను రాసిన కథనాలపై నాకు అనేక బెదిరింపులు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితి పై, సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారం పై ఈ రాష్ట్రంలో అందరికంటే ముందుగా రాసింది నేను. నేను రాసిన కథనాలను తొలి వెలుగులో రఘు కూడా చదివారు. అనేక కథనాలను నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి పత్రికలలో, విధాత వెబ్సైట్ లో రాసిన. అలాగే వట్టినాగులపల్లి భూ కుంభకోణంపై ప్రాణాలకు తెగించి సుమారు ఆరు నెలలు కష్టపడి ఇదే తొలి వెలుగు చానల్ లో మిత్రుడు రఘు ద్వారా రవి ప్రకాష్ తో మాట్లాడి రూ.10వేల కోట్ల భూ కుంభకోణం పై వరుస కథనాలు రాసిన. కానీ కొన్ని మాత్రమే ప్రసారం చేసి మిగతావి నాకు చెప్పకుండానే ఆపారు. ఆ సమయంలో నేను నమ్మిన వాళ్ళుకూడా నా ఫోన్ కు రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ నేను అన్ని ఆధారాలు, మీడియా నిబంధనలకి లోబడి రాయడం వలన ఏ ఒక్కరు కూడా నాపై కేసులు పెట్టలేదు, ఒక్క నింద కూడా మోపలేదు.
అందుకే యాజమాన్యం చెప్పిందని మనం దిగజారవద్దు, నిబంధనలను నీరు గార్చవద్దు. అలాగే యాజమాన్యం మోసం చేసిందని గగ్గోలు పెట్టవద్దు. యాజమాన్యాలు నిజాయితీ గా ఉండే జర్నలిస్టులను కీలుబోమ్మలు గా మార్చి అవసరం తీరగానే నిన్న రవి ప్రకాష్, నేడు రఘు లాగనే రేపు ఇంకొక్కరు బలిపశువు అవుతారు. మీడియా యాజమాన్యం అల్వేస్ సేఫ్. జర్నలిస్టులమే జగరుకథతో ఉండాలి.
__________________
బూడిద సుధాకర్
సీనియర్ జర్నలిస్టు
– 7680992342.