రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) బి కి పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. 1972లో ముంబై పోలీస్ కమిషనర్ ఇటువంటి జీవో జారీ చేయగా.. హిమ్మత్ లాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే జీవోను కొట్టివేసిందని గుర్తు చేశారు. సాధారణంగా ఇటువంటి జీవోలు పోలీసులు జారీ చేస్తారు.. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఏపీలో ప్రభుత్వమే జారీ చేయడం విస్మయాన్ని కలిగించిందన్నారు.
ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశులను చూసి వైసీపీ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టి..ఈ తరహా జీవో జారీ చేసిందని రఘురామ ఎద్దేవా చేశారు. దరిద్రపు ఆంక్షలు నుంచి బయటపడాలంటే.. రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించాలని ఆయన సూచించారు. సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా ఉంటుంది కాబట్టే.. హైకోర్టు ఈ జీవోను కొట్టివేసే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
రోడ్డు ప్రమాదాలన్నీ ముఖ్యమంత్రి చేసే హత్యలా?
ఏపీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే హత్యలా? అని రఘురామ ప్రశ్నించారు. బోటు ప్రమాదాలు.. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి మృత్యువాత పడిన వారందరినీ ముఖ్యమంత్రి హత్య చేసినట్లేనని?.. టీడీపి నిర్వహించిన సభలో ప్రమాదవశాత్తు సభకు హాజరైన వారు చనిపోతే.. వారే హత్య చేసినట్లు అవుతుందాని? రెండు చోట్ల జరిగిన సంఘటనలను బూచి గా చూపెట్టి .. ప్రభుత్వం ఈ తరహా జీవో జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో రోడ్లు అద్వానంగా మారడంతో.. గుంతలలో పడి ఎంతో మంది వాహనదారులు క్షతగాత్రులు అవుతున్నారని.. వాళ్ల సంగతి ఏమిటని?. రైలు, విమాన ప్రమాదాలు జరిగితే..రెండిటినీ నిషేధిస్తారాని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని సకల శాఖ మంత్రి సజ్జల పేర్కొనడం విడ్డూరంగా ఉందని రఘురామ ఆగ్రహాం వ్యక్తం చేశారు.