Sambashiva Rao :
==========
Munugode Bypoll: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు ఓటూ వేసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు 90 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 2లక్షల 40,855 మంది ఓటర్లకు ఉండగా.. గడువు ముగిసే సమయానికి 2లక్షలకు పైగా ఓట్లుపోలైయ్యాయి. నవంబరు 6న ఉప ఎన్నిక ఫలితం వెల్లడికానుంది.
ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. మధ్యాహ్నాం నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మధ్యాహ్నం 3గంటల నుంచి 5గంటల మధ్య ఏకంగా 20శాతం ఓటింగ్ పెరగడం గమనార్హం. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూలైన్ లో ఉండటంతో అధికారులు వారికి అవకాశం కల్పించారు. దాంతో చాలా గ్రామాల్లో రాత్రి 8గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. వృద్ధులు, మహిళలు , యువత పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
మొరాయించిన ఈవీఎంలు..
కొన్నిచోట్ల ఈవిఎంలు, వివి ప్యాట్ లు సాంకేతిక లోపంతో మొరాయించాయి. కొండాపురం, కొంపల్లి, నారాయణపూర్, అల్లం దేవి చెరువు, చిన్న కొండూరుతో సాంకేతిక లోపంతో ఈవిఎంలు మొరాయించడంతో ఓటింగ్ కు అంతరాయం ఏర్పడింది.
మొత్తం మునుగోడు ఉప ఎన్నిక రణరంగాన్ని తలపించింది. ఈహోరాహోరి పోరులో విజయం ఏవరిని వరిస్తుందన్నది ఆరోతేది తేలిపోనుంది.