జీహెచ్ఎంసీ పరిధిలోని ముషీరాబాద్ నియోజకవర్గం మోస్ట్ క్రేజీఎస్ట్ స్థానంగా మారింది. ఇక్కడ పోటిచేయాలని ప్రధాన పార్టీల నేతలు.. సీనియర్ నేతల కుమారులు.. పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటు అధికార పార్టీ నుంచి మరోసారి పోటిచేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పట్టుదలతో కనిపిస్తుంటే.. అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు.ఈరెండు పార్టీలకంటే బీజేపీలో ఆశావాహులు అధిక సంఖ్యలో ఉండటంతో ఈసీటు కాకరేపుతోంది.
ముషీరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముఠాగోపాల్ కొనసాగుతున్నారు. మరోసారి ఎమ్మెల్యేగా పోటిచేయాలని భావిస్తున్నారు. అయితే ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరుడు ఎమ్మెన్ శ్రీనివాస్ టికెట్ .. ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు ఓ పారిశ్రామిక వేత్త ఇక్కడి నుంచి పోటిచేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది.
బీజేపీలో వారసులు…
ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటిచేసిన డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో పార్టీ కొత్త అభ్యర్థిని బరిలో దింపనుంది. ఇక్కడి నుంచి పోటిచేయాలని బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ గట్టి పట్టుదలతో ఉన్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. సభలు..సమావేశాల పేరిట ప్రజలతో మమేక అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.వీరితో పాటు ఓపారిశ్రామిక వేత్త, ఇద్దరు కార్పొరేటర్లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే బీజేపీ గవర్నర్ ,సీనియర్ నేత బండారు దత్తాత్రేయ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ఆర్. ప్రదీప్ కుమార్ సైతం సీటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా ఇంచార్జ్ పనిచేస్తున్న ఆయన.. పార్టీ కార్యవర్గ సభ్యుడుగా కొనసాగుతున్నారు. దత్తన్నకు శిష్యుడిగా, లక్ష్మణ్ సన్నిహితుడిగా ఉన్న తనకే టికెట్ వస్తుందని ఆయన ధీమాగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటిచేసిన ఓడిపోయిన మాజీ ఎంపీఅంజన్ కుమార్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ పోటిచేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో పార్టీ పేరిట కార్యక్రమాలు చేపడుతుండటం.. యువతలో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆయనకే టికెట్ వస్తుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. మరోనేత సంగిశెట్టి జగదీష్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మొత్తంగా సీటు నిలుపుకోవాలని బిఆర్ఎస్ భావిస్తుంటే.. అందివచ్చిన అవకాశాన్ని నిలుపుకోవాలని బీజేపీ.. పట్టునిలుపుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో కనిపిస్తున్నాయి.