Newsminute24

లోక్ సభ ఎన్నికల్లో ముస్లింలు ఏ పార్టీ వైపు?

Loksabha2024: భారతదేశ రాజ్యాంగంలో కీలకమైన లౌకికవాదం రాతలకు, మాటలకే పరిమితమవుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ కులం, మతం, ప్రాంతీయ అంశాల చుట్టే తిరుగుతున్నాయి. ఏయే వర్గాలతో ఎన్ని ఓట్లు పడతాయనే ధోరణితోనే పార్టీలున్నాయి. 2024 ఏప్రిల్‌లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. దేశంలో ప్రధానమైన ముస్లిం ఓటర్లకు సంబంధించి చరిత్రను పరిశీలిస్తే స్వాతంత్య్రానంతరం ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుత రాజకీయాలు సుమారు 14 శాతమున్న ముస్లిం మైనార్టీల చుట్టే తిరుగుతున్నాయి. ఒక పక్షం ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ  ఓట్లు పొందాలని చూస్తుంటే, మరో పక్షం ఏకపక్షంగా ముస్లిం ఓట్లు ఎలా పొందాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింల పాత్ర ఏమిటి..? వారెటువైపు ఉండబోతున్నారు..? ముస్లింలపై రాజకీయాలతో ఏ పక్షం అధిక ప్రయోజనాలు పొందబోతోంది..? వంటి ప్రశ్నలు ఉదయిస్తాయి.

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తామనే దీమాతో ఉంది. తొలుత పాజిటివ్‌ అంశాలతో ఎన్నికలకు వెళ్తామని చెప్పిన బీజేపీ ఎన్నికలు సమీపించేసరికి అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్‌ 370, త్రిబుల్‌ తలాక్‌, యూసీసీ వంటి భావోద్వేగ అంశాలను తెరమీదకు తెస్తోంది. 1980 నుండి పార్టీ ఎజెండాగా ఉన్న అయోధ్య రామ మందిరం, జమ్ము కాశ్మీర్‌ 370 ఆర్టికల్‌ రద్దు అంశాలు నాలుగు దశాబ్దాల అనంతరం ఒక కొలిక్కి రావడంతో ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని బీజేపీ ఆశిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలో దేశంలోని 28 పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడి ప్రధానంగా ముస్లిం ఓట్లు చీలకుండా బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ భావోద్వేగాలు పనిచేయడం లేదని బీజేపీ గుర్తిస్తే, ఆ పార్టీ తురుపుముక్కగా కాంగ్రెస్‌ కూటమి ముస్లింలను బుజ్జగిస్తుందనే అంశాన్ని తెరమీదకు తెచ్చే అవకాశాలున్నాయి.

దేశంలోని రాజకీయ పార్టీలకు ముస్లింలు ఒక ఓటు బ్యాంక్‌గా మారారు. స్వాతంత్య్రానంతరం నాలుగైదు దశాబ్దాలుగా వీరి ఓటు బ్యాంక్‌పై చర్చే ఉండేది కాదు. వీరు ఏకపక్షంగా కాంగ్రెస్‌ను ఆదరించారు. అయితే రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ముస్లిం ఓటర్లలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. మండల్‌ కమిషన్‌ అంశంతో దేశ రాజకీయాలలో పలు ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రాష్ట్రీయ జనతాదళ్‌, జనతాదళ్‌ యునైటెడ్‌, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ వంటి పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముస్లింలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలవైపు చూడడం మొదలుపెట్టారు. ఇందుకు ప్రధాన కారణం దశాబ్దాలుగా కాంగ్రెస్‌ వెంటే ఉన్న ఆ పార్టీ తమను ఒక రాజకీయ పావుగా వాడుకుందే తప్పా ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదనే అభిప్రాయం వారిలో నాటుకుపోవడమే.

ముస్లింలు కాంగ్రెస్‌ను కాదని ప్రాంతీయ పార్టీల వైపు చూస్తుండడంతో వారి ఓట్ల ప్రాముఖ్యతపై దేశంలో చర్చ మొదలైంది. ముస్లింలు ప్రాంతీయ పార్టీల వైపు మళ్లడంతో తీవ్ర నష్టం జరుగుతుందని కాంగ్రెస్‌ ఆలస్యంగా మేల్కొంది. 90వ దశకంలో దేశ రాజకీయాల్లో బీజేపీ రాణించడంతో ప్రత్యామ్నాయంగా ముస్లిం ఓట్లపై అన్ని పార్టీల దృష్టి మళ్లింది. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అని ప్రచారం చేస్తూ వారి ఓట్లతో రాజకీయ లబ్ది పొందాలని కాంగ్రెస్‌ చూస్తుంటే, కాంగ్రెస్‌ ముస్లింలకు అధిక ప్రాధాన్యతిస్తుందనే ప్రచారంతో హిందువుల ఓట్లను అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది.

దేశంలో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ ముస్లింలను ఒక రాజకీయ పావుగా వాడుకుంటున్నాయి. తామే హిందూ సమాజ పరిరక్షకులమని చెప్పుకుంటూ బీజేపీ ముస్లింలు వ్యతిరేకించే సున్నితమైన అంశాలతో లబ్ది పొందుతోంది. కాంగ్రెస్‌ కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ముస్లింలపై కాంగ్రెస్‌ పలు రాష్ట్రాల్లో వేర్వేరు ఎజెండాను రూపొందించుకుందంటేనే ఆ పార్టీ వారిని కేవలం ఒక ఓటు బ్యాంకుగానే చూస్తోందని చెప్పవచ్చు. గతంలో పార్టీ ఏర్పాటు చేసిన ఏకే అంథోని కమిటీ కాంగ్రెస్‌ ముస్లింలకు, క్రిస్టియన్లకు అధిక ప్రాధాన్యతిస్తుందనే భావన దేశ ప్రజల్లో ఏర్పడిందని, ఈ భావనను తొలగించడానికి సాఫ్ట్‌ హిందూత్వను అనుసరించాలని నివేదిక ఇచ్చింది.  ఈ నివేదికకు అనుగుణంగానే రాహుల్‌గాంధీ గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు ఆలయాలను దర్శించారు. నేనే నిజమైన హిందువు అని ప్రకటించుకోవడానికి పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాలను అనుసరిస్తూ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ముస్లింలు తొమ్మిది శాతంలోపే ఉండడంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాఫ్ట్‌ హిందూత్వ ఎజెండాను చేపట్టింది. అదే సమయంలో 14 శాతం ముస్లింలున్న తెలంగాణలో మాత్రం ముస్లింల కోసం ప్రత్యేక డిక్లరేషన్‌ ప్రకటించింది.

మరోవైపు ముస్లింలు అధికంగా ఉండే అస్సాం, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు ముస్లింల చుట్టే తిరుగుతాయి. ఈ రాష్ట్రాల్లో ముస్లింలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఓట్లు పోలరైజ్‌ అయ్యేలా చేసి రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయి. ఈ కారణంగానే అస్సాం, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యర్థులైన తృణముల్‌ కాంగ్రెస్‌, జేడీయూ కూటమి లబ్ది పొందాయి.

బీజేపీతో కాంగ్రెస్‌ ముఖాముఖిగా తలపడే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యాణా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు 75-77 శాతం ముస్లింల మద్దతు లభిస్తోంది. ఇక్కడ బీజేపీకి 18-20 శాతం ముస్లిం ఓట్లు వస్తున్నాయి. పై రాష్ట్రాల్లో ముస్లిం ఓటు బ్యాంకు 7-10 శాతమే ఉంది. ఇక్కడ బీజేపీకి సుమారుగా 20 శాతం ముస్లిం ఓట్లు రావడానికి ప్రధాన కారణం అభ్యర్థులు, అభివృద్ధిని బట్టి ఉంటుంది. బీజేపీని సైద్దాంతికంగా వ్యతిరేకించే ముస్లింలు త్రిపుల్‌ తలాక్‌ అంశంతో యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ వైపు మళ్లారా  అనే చర్చ జరిగింది. అయితే యూపీతో సహా దేశంలో ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీకి ఎన్నడూ అనుకూలంగా లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 1996 నుండి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే  ఎనిమిది శాతానికి మించకుండా 5 నుండి 7 శాతం ముస్లిం ఓట్లే బీజేపీకి పడ్డాయి.

దేశ రాజకీయాల్లో ముస్లిం ఓట్ల పాత్రను పరిశీలిస్తే 1971లో 70 శాతం ముస్లిం ఓట్లను పొందిన కాంగ్రెస్‌ 1971-1996 మధ్య 67 నుండి 68 శాతం ముస్లిం ఓట్లను సాధించింది. 1996-2019 మధ్య కాంగ్రెస్‌కు ముస్లింల మద్దుతు తగ్గుతూ వస్తోంది. 1996-98 మధ్య 40-35 శాతం ముస్లింల మద్దతు కాంగ్రెస్‌ ఉండగా, 2019లో 33-34 శాతం మద్దతే లభించింది. కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న ముస్లిం ఓట్ల పునాదులను ప్రాంతీయ పార్టీలు దెబ్బతీశాయి. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా టీఎంసీ, ఆప్‌, ఆర్జేడీ, జేడీయూ, బీఆర్‌ఎస్‌, ఎస్పీ, బీఎస్పీ, ఏఐయూడీఎఫ్‌ పార్టీలు ముస్లిం ఓట్లను పెద్ద ఎత్తున పొందుతున్నాయి.

1960 నుండి 1990 వరకు ముస్లింలు కాంగ్రెస్‌కు ఏకపక్షంగా మద్దతివ్వడంతో ఆ పార్టీ పాలనలో ముస్లింలకు ఏదో లబ్ధి జరిగిపోయిందనే ప్రచారం దేశవ్యాప్తంగా జరిగినా, ముస్లింల స్థితిగతులపై సచార్‌ కమిటీ ఇచ్చిన నివేదికలోని డేటాను పరిశీలిస్తే ముస్లింలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడే ఉన్నారని తేలడం ఇక్కడ గమనార్హం.

రాజకీయాల్లో ముస్లింలకు ప్రాధాన్యత తక్కువగా ఉందనే చర్చను పరిశీలిస్తే దేశంలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యత లభించడం లేదని చెప్పవచ్చు. దేశ జనాభాలో 48 శాతానికి పైగా ఉన్న మహిళలకు ఇప్పటివరకు ఎంత రాజకీయ ప్రాధాన్యత లభించిందనేది అందరికీ తెలిసిందే. ఇక ముస్లిం గురించి చెప్పనక్కర్లేదు. దేశ రాజకీయాల్లో ముస్లింల పాత్రపై ఆ సామాజికవర్గంలోని విద్యావంతులలో చర్చ మొదలైంది. ఏకపక్షంగా ఒకే పార్టీ పక్షాన ఉండే బదులు ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉన్న నియోజకవర్గాల్లో తమ సామాజిక అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోలేమనే ప్రశ్న వారిలో ప్రారంభమైంది. కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థినే గెలిపించుకునేందుకు వారు ప్రాధాన్యతిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో హిందువులు ఏకపక్షంగా బీజేపీకే ఓటు వేస్తుండడంతో ముస్లింలు తమకు మద్దతుగా ఉండే పార్టీల వైపే చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయంగా సమాజ్‌వాదీ పార్టీకి ముస్లింలు మద్దతిస్తూ 60 శాతంకు పైగా ఓటేశారు. కాంగ్రెస్‌కు కేవలం 10-12 శాతం ముస్లిం ఓట్లు లభించాయి. బీఎస్పీకి 18-20 శాతం ముస్లింలు ఓట్లు వేశారు. 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో ముస్లింలు మరింత ఏకపక్షంగా యూపీలో ఎస్పీ (ఇండియా కూటమి)కి మద్దతిచ్చే అవకాశాలున్నాయి.

ముస్లింలను కాంగ్రెస్‌ ఒక ఓటు బ్యాంకుగానే చూసిందని, వారి అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శిస్తూ ఇటీవల మోదీ ‘పస్మాండా ముస్లిం’ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ‘పస్మాండా’ అంటే పర్షియన్‌ భాషలో వెనుకబడిన అని అర్థం. ముస్లింలంటేనే వ్యతిరేక భావనతో ఉండే బీజేపీ లేవనెత్తిన ‘పస్మాండా ముస్లిం’ నినాదాన్ని ముస్లింలు నమ్మే అవకాశాలు తక్కువే. ఇందుకు ప్రధాన కారణం బీజేపీ ముస్లింల పట్ల వివక్ష చూపడమే. యూపీ, గుజరాత్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో బీజేపీ ముస్లింలకు టికెట్లే ఇవ్వలేదు. మోదీ కేబినెట్‌లో ఒక ముస్లిం మంత్రి కూడా లేకపోవడం వారిపట్ల వీరికున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనం. అంతేకాదు బీజేపీ నేతలు బహిరంగంగానే మేము ముస్లింలను ఓట్లు అడగమని పలు సందర్భాల్లో ప్రకటించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇలాంటి ప్రకటనే చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించే బీజేపీని ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే అవకాశాలే ఉండవు.

దేశంలో ముస్లింలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక రాజకీయ పావుగానే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నంత కాలం ఆ సామాజిక వర్గానికి ఆశించిన ఫలితాలు రావడం మృగ్యమే. వారిని ఒక ఓటు బ్యాంకుగా కాకుండా అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యతిస్తూ వారి వెనుకబాటును రూపుమాపేలా చర్యలు తీసుకునే పార్టీకి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఏకపక్షంగా మద్దతివ్వడం ఖాయం.

 

– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

 

Exit mobile version