తెనాలి రాజకీయ రసకందకాయంగా మారింది. అధికార , ప్రతిపక్ష నేతలు నువ్వానేనా తరహాలో తలపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బత్తిని శివకుమార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో..ఓ ముఖ్యనేత ఇక్కడి నుంచి పోటిచేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఈనియెజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు ప్రజలు చెబుతున్నారు.ఇంతకు ఆనేత ఎవరూ? ఇప్పుడు ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు?
తెనాలి నియెజకవర్గంలో 40 వేల కాపు..20 వేల కమ్మ సామాజిక ఓట్లర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బత్తిని శివకుమార్ స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఓట్ల సరళి ఆధారంగా పరిశీలిస్తే.. చావు తప్పి కన్ను లొట్టపోయింది మాదిరి ఆయన గెలిచాడన్నది నిష్టూర సత్యం. తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. ఈనియెజకవర్గంలో అధికార వైసీపీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ..ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరు పోటిచేసిన గెలుపు నల్లేరుపై నడకనే భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో టీడీపీ జనసేన పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశముంది. తెనాలి నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా ఈసీటు జనసేనకు కేటాయిస్తే.. ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటిచేస్తారన్న ప్రచారం జరుగుతుంది. గతంలో ఆయన ఇక్కడి నుంచి రెండుసార్లు (2004,2009 ) ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన బరిలో దిగితే గెలుపు తమదేనని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెనాలి సీటుపై టీడీపీ నేత ఆలపాటి రాజ..కొద్ది రోజుల ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవి వ్యామోహం లేదని..ఇప్పటికే ఎన్నో పదవులు అనుభవించానని.. తెనాలి సీటు తనకు రాసిపెట్టలేదని ఆయన చెప్పకనే చెప్పారు.దీంతో ఈసీటులో జనసేన పోటిచేస్తుందని టీడీపీ కార్యకర్తలు ఓ నిర్థారణకు వచ్చారు. అయితే ఆలపాటిని పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ లేదా గుంటూరు ఎంపీగా పోటిచేయించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది.