SuryaPeta: ప్రభుత్వ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట మండలం ఇమాంపేట (KGVB) కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో తరగతి గదుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం,విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. విద్యార్దినిలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు, ఉపాధ్యాయులకు రమేష్ రెడ్డి వివరించారు.
విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ అభివృద్ధి బాటలో పయనింప చేస్తుందని రమేష్ రెడ్డి అన్నారు. ఇమాంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGVB), తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను దత్తత తీసుకొని కొద్ది రోజుల క్రితం రూ. 10 లక్షల విలువ చేసే పరుపులను పంపిణీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని సమాజం అభివృద్ధి చెందితే దేశం బాగుంటుందన్నారు.పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు.