DokkaSeethammascheme: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై పీపుల్స్ పల్స్ అధ్యయన సమగ్ర నివేదిక..
ఇంటర్ విద్యార్థులకు:
జీవితంలో ఎవరి కెరీర్ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్ పాయింట్. ఇంటర్ లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఇంటర్ నుంచి బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం అందినప్పుడే విద్యార్థులు చదువు మీద పూర్తి దృష్టి పెట్టగలుగుతారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గడాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… దానికి కారణం పేదరికం, ఆకలేనని ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ ప్రారంభించింది. రాజకీయ నాయకుల పేరు కాకుండా స్వాతంత్ర సమరయోధురాలు, నిత్య అన్నదాతగా ప్రసిద్థిగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరును ఈ పథకానికి పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ముఖ్య ఉద్ధేశ్యాలు:
1. హాజరు శాతం పెంచి, డ్రాపౌట్స్ లేకుండా చేయడం.
2. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి కలిగించడంతో పాటు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.
3. ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయడం.
4. పేద విద్యార్థుల ఆకలి తీర్చడం.
5. విద్యార్థులలో సామాజిక సమానత్వం కల్పించడం.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతున్నాయా? ఈ పథకం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోవడానికి పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పలు కాలేజీలను సందర్శించి, లోతుగా అధ్యయనం చేసింది.
ఈ పథకం కింద అందిస్తున్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులతో పాటు ఈ పథకంపై విద్యార్థి, విద్యార్థినుల అభిప్రాయం తెలుసుకోవడానికి రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు… వివిధ మండలాల్లో ఉన్న 48 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్లు సందర్శించారు. ఇందులో భాగంగా ప్రతి కాలేజీలో 25 శాంపిల్స్ చొప్పున మొత్తం 1200 శాంపిల్స్ తీసుకుని… ఈ పథకంలో ఉన్న లోటుపాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ రీసెర్చ్‌లో భాగంగా కాలేజీ వద్ద రీసెర్చర్లు కనీసం నాలుగు గంటల సమయాన్ని వెచ్చించి, పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, వంట సిబ్బంది, తల్లిదండ్రులతో కూడా ముఖాముఖిగా కలుసుకొని వారితో మాట్లాడి సమగ్ర సమచారాన్ని సేకరించారు.
15 ఫిబ్రవరి నుండి 7 మార్చ్ 2025 వరకు క్షేత్రస్థాయిలో ఈ అధ్యయనం కొనసాగింది. పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్.దిలీప్ రెడ్డి నేతృత్వంలో సంస్థ రీసెర్చర్లు జగదీష్, శ్రీధర్, నూతలపాటి రవికాంత్ క్షేత్రస్థాయిలో ఈ సర్వేను పర్యవేక్షించగా గణేష్ తండా, లక్ష్మీ, జి.మురళీ కృష్ణ, ప్రదీప్, ప్రశాంత్, జంపాల ప్రవీణ్, ఐ.వి.మురళీ కృష్ణ శర్మ ఈ నివేదికను రూపొందించారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ప్రధానంగా ఈ కింది అంశాలపై దృష్టి సారించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, వంటపనివారు, సామాజిక కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించడం జరిగింది.
ఎ. మధ్యాహ్న భోజనం ప్రారంభించిన తరువాత కాలేజీల్లో విద్యార్థుల హాజరు సంఖ్య పెరిగిందా? లేక తగ్గిందా?
బి. భోజనం నాణ్యత, శుభ్రత ఎలా ఉంది?
సి. మెనూ ప్రకారమే పదార్థాలు ఉంటున్నాయా?
డి. మెనూ నచ్చిందా? లేక ఏమైనా మార్పులు చేయాలా?
ఇ. ఈ పథకంలో ప్రస్తుతం ఉన్న లోపాలు ఏమిటి?
ఎఫ్. సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా? సిబ్బందికి ఉన్న సమస్యలేమిటి?
జి. తాగునీరు సమస్య ఉందా?
హెచ్. ఎవరైనా ఎప్పుడైనా తనిఖీలు చేస్తున్నారా?
ఐ. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వంట సిబ్బంది ఈ పథకంపై ఎలా అభిప్రాయ పడుతున్నారు?
వీటి ఆధారంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మరింత మెరుగ్గా అమలు చేయడానికి సంబంధిత నిపుణుల నుంచి కూడా సమగ్ర సమాచారాన్ని తీసుకొని దాన్ని క్రోడీకరించి, ఈ నివేదికను రూపొందించాము.
పథకం నేపథ్యం :
గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ‘‘డొక్కా సీతమ్మ’’ పేరిట ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించారు. గతంలో పాఠశాలలకే పరిమితమైన ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ కాలేజీలకు కూడా విస్తరించారు. 2025 జనవరి 4వ తేదీన మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ నారా లోకేశ్, విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని లాంచనంగా ప్రారంభించగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మండల కేంద్రాల్లో ఉండే ప్రభుత్వ కాలేజీలకు దూర గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి వస్తుంటారు. వీరిలో చాలామంది బడుగు బలహీనవర్గాలకు చెందిన వారే ఉంటారు. ఆర్థిక కారణాలతో పాటు పలు కారణాలతో చాలా మంది లంచ్ బాక్స్ తెచ్చుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో హాజరు శాతం తగ్గడాన్ని గమనించిన తెలుగు దేశం ప్రభుత్వం 2018 ఆగస్టులో ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఈ పథకాన్ని నిలిపివేసింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని పున: ప్రారభించారు.
475 కాలేజీల్లో అమలు :
ప్రస్తుతం రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,48,419 మంది విద్యార్థులు ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ ద్వారా లబ్ది పొందుతున్నారు. ఈ పథకంలో భాగంగా భోజనం అందించడానికి 398 కాలేజీలను సమీపంలోని ప్రభుత్వ పాఠాశాలలకు అనుసంధానం చేయగా, మిగిలిన 77 కాలేజీలను సెంట్రలైజ్డ్ కిచెన్‌లకు అనుసంధానించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 29.39 కోట్ల బడ్జెట్ కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 85.84 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
లోపభూయిష్టంగా జీవో 40:
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 40 జారీ చేసింది. అయితే, ఈ జీవోలో ఉన్న మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో పథకం అమలు చేయడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ జీవో లోపభూయిష్టంగా ఉంది.
*భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వండిరచి, కాలేజీలకు తరలిస్తున్నారు. కానీ, వాహన ఖర్చుల గురించి జీవోలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఈ రవాణా ఖర్చుకు సంబంధించి బడ్జెట్ లోపలే ప్రిన్సిపల్స్ బిల్లులు పెట్టుకోవచ్చని చెప్పినా… దీనికి ఎంత బడ్జెట్ అని మాత్రం చెప్పలేదు.
*విద్యార్థులకు అందించే భోజనం కోసం ఒక్కో ప్లేటుకు ఎన్ని గ్రాముల రైస్ ఇవ్వాలి,కూరలు, వాటిలో ఉండాల్సిన పోషకాలు, భోజనంలో ఇతర ఆహార పదార్థాలు ఏముండాలి అనే అంశాలపై జీవోలో స్పష్టంగా పేర్కొనలేదు.
*జీవో నెం.40 ప్రకారం, ఒక్కో విద్యార్థికి భోజనానికి ఎంత కేటాయిస్తున్నారు? దానికి సంబంధించిన పోషకాహారాలు ఎంత ఉండాలి? ఒక్కో విద్యార్థికి భోజనం, కూర ఎన్ని గ్రాములు ఇవ్వాలి? తదతర అంశాలను జీవోలో ఎక్కడా పేర్కొనలేదు.
*భోజనం వండిన నాలుగు గంటల్లోనే విద్యార్థులకు వడ్డించాలని జీవో చెప్తోంది. కానీ, సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి పొద్దున్నే వస్తున్న ఆహారం నాలుగు గంటల తర్వాతే వడ్డిస్తున్నారు. దీనివల్ల ఆహారపదార్థాలు చల్లబడిపోతున్నాయి.
*మేము సేకరించిన సమాచారం ప్రకారం ఒక్కో విద్యార్థికి భోజనానికి రూ.14.50 లు మాత్రమే ప్రభుత్వం అందజేస్తుంది. ఈ విషయంపై జీవో 40 లో ఎక్కడా స్పష్టం చేయలేదు.
*రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర, స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా మహిళలు వండి విద్యార్థులకు అందించే ఆహారానికి ఒక్కో విద్యార్థికి కేవలం రూ.14.50 లు మాత్రమే అందిస్తోంది.
*ప్రభుత్వం కేవలం రేషన్ బియ్యం, కోడిగుడ్డు, చిక్కి మాత్రమే అందజేస్తోంది.
*డ్వాక్రా మహిళలు, అక్షయపాత్ర, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం ఇచ్చే రూ.14.50 ల్లోనే కూరగాయలు, గ్యాస్ సిలిండర్, వంటచెరుకు, నూనె, ఉప్పు, కారం, పసుపు, ఇతర వంట సామాగ్రిని వారే సమకూర్చుకోవాలి.
*వంట సిబ్బందికి నెలకు రూ.3,000 జీతమే ఇస్తున్నారు.
*దీనికితోడు వంట సిబ్బందికి గ్యాస్ సిలిండర్లు కూడా తమ ఖర్చుతోనే కొనాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కూరలను నీళ్లలా వండుతున్న పరిస్థితి ఏర్పడడింది.
*ఈ పథకం అమలు, నిర్వాహణకు ఇంటర్ విద్య డైరెక్టర్ చర్యలు తీసుకుంటారని చెప్పినా… వారు ఏమి చేయాలి అని మాత్రం చెప్పలేదు. తనిఖీ వ్యవస్థ గురించి కూడా జీవోలో స్పష్టంగా పేర్కొనలేదు.
పిండి కొద్దీ రొట్టె
పిండికొద్దీ రొట్టె అన్న సామెతలాగా పథకానికి తగిన నిధులు కేటాయించకుండా ఆశించిన లక్ష్యాలు చేరుకోవడం సాధ్యం కాదు. ఏ కార్యక్రమం చేపట్టిన తగిన నిధులు కేటాయించాల్సిన ఆవశ్యకత ఉంది. ‘‘డొక్కా సీతమ్మ’’ భోజన పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం సాధ్యపడటం లేదు.
ప్రస్తుతం ఏ కూరగాయల ధర చూసుకున్న కెజి రూ.40 కు తక్కువ లేదు. అదేవిధంగా మంచి నూనె కెజి రూ130 వరకు ఉంది. ప్రభుత్వం ఒక్క విద్యార్థికి కేటాయిస్తున్న రూ.14.50 ల్లో నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించడం సాధ్యపడటం లేదు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సరిపోకపోవడం వల్ల కూరలు, ఇతర ఆహారపదార్థాలు నాణ్యతపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న భోజనాన్ని తీసుకోవడానికి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ భోజనం చేయడానికి ఇష్టపడటం లేదు. నాణ్యమైన భోజనం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని కర్నూల్‌లో ఒక అధ్యాపకుడు (పేరు వెల్లడిరచడానికి ఇష్టపడ లేదు) వాఖ్యానించారు. అంటే, విద్యార్థులకు నాణ్యమైన భోజనం కోసం ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నదనే వాస్తవాన్ని స్పష్టంగా సూచిస్తోంది. కాబట్టి, ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు నిధుల పెంపు అత్యవసరమని ప్రభుత్వం గుర్తించాలి. కనీసం ఒక్కొక్క విద్యార్థికి ఒక్క భోజనానికి రూ.30 కేటాయిస్తేనే ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించవచ్చు.
పాయకాపురం నుంచే సర్వే ప్రారంభం:
మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ ఈ పథకాన్ని ప్రారంభించిన విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచే పీపుల్స్ పల్స్ సంస్థ ఈ సర్వేను ప్రారంభించింది. పథకం ప్రారంభించిన మొదటి రోజు ప్రజా ప్రతినిధులు, అధికారులు హడావిడి చేయడం తప్ప ఆ తర్వాత ఆ కాలేజీలకు ఎవరు రాలేదని, కనీసం తనిఖీలు కూడా చేయడంలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఆరంభ శూరత్వం తప్ప పథకం అమలు చేయడంలో ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి లేదని స్పష్టం అవుతోంది.
ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చినప్పుడు నాణ్యమైన ఆహారం పెడతారని, తర్వాత నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదనగా చెప్పారు. మెనూ ప్రకారం రాగి జావా ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకు రాగి జావ అందని కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. పాయకాపురం కాలేజీకి అక్షయ పాత్ర సంస్థ భోజనం సరఫరా చేస్తోంది. అక్కడ మెను ప్రకారం ఎగ్ కర్రీ రావాల్సిన రోజు ఆలూ టమాటో కర్రీ రావడం మేం గమనించాం. మెనులో బటర్ మిల్క్ లేకపోయినా అక్షయ పాత్ర బటర్ మిల్క్ ఇస్తోంది. మెనూను పాటించడం లేదని చెప్పడానికి ఇలా అనేక ఉదంతాలను పలు కాలేజీల్లో పీపుల్స్ పల్స్ రికార్డు చేసింది.
బడుగు, బలహీనవర్గాల ఆకలి తీరుస్తున్న పథకం:
ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారా అని విద్యార్థులను ప్రశ్నించినప్పుడు తింటున్నామని 61.2 శాతం మంది చెప్పగా, 32.5 శాతం మంది అప్పుడప్పుడు తింటున్నామని, 1.3 శాతం మంది అక్కడ తినడం లేదని చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, కర్నూల్ లాంటి పట్టణాల్లో 50 శాతం మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తింటున్నారు. మిగిలిన వాళ్లు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం లేదా ఇంటికి వెళ్లి తినడం చేస్తున్నారు. దీనిపై కొంతమందితో మాట్లాడినప్పుడు ‘‘నీళ్ల కూరలు, మెత్తటి అన్నం కంటే పొద్దున్న మా ఇంట్లో వండే అన్నమే బాగుంటుంది. అందుకే అంతకముందు లాగే రోజూ బాక్స్ తెచ్చుకుంటా’’ అని కాకినాడలో ఐశ్వర్య అనే విద్యార్థిని చెప్పారు.
నరసన్నపేటలో 450 మంది విద్యార్థులు ఉంటే 400 మంది భోజనం చేస్తున్నారు. కాకినాడ కాలేజీలో 690 మంది విద్యార్థులుంటే, 420 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. సామర్లకోట కాలేజీలో 400 మంది విద్యార్థులుంటే 250 మంది భోజనం చేస్తున్నారు. పాలకొండలో 400 మంది గాను 300 భోజనం చేస్తున్నారు. గొల్లప్రోలు కాలేజీలో 250 మంది విద్యార్థులుంటే కేవలం 60 నుంచి 70 మందే తింటున్నారు. పిఠాపురం కాలేజీలో 700 మంది విద్యార్థులుంటే 130 నుంచి 150 వరకు మాత్రమే భోజనం చేస్తున్నారు. చాలా కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉంది. మిగతావాళ్లు భోజనానికి సంక్షేమ హాస్టల్స్ లేదా ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. నాణ్యతతో పాటు అక్కడ కూడా శుభత్ర లేకపోవడంతో కొంతమంది కేవలం గుడ్డు, చిక్కి తీసుకుంటూ, భోజనం మాత్రం చేయడం లేదు. ఇలాంటి చోట్ల అధ్యాపకులు లేదా ప్రిన్సిపల్స్ చొరవ తీసుకుని పర్యవేక్షణ పెంచితే, భోజనం తినే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులే చదువుకుంటున్నారు. బీసీలు 60 శాతం, ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 6 శాతం, ఓసీలు 12 శాతం ఈ మధ్యాహ్న భోజన పథకం వినియోగించుకుంటున్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల్లో అధిక శాతం మంది రైతులు, రోజువారి కూలీలు, ప్రయివేట్ ఉద్యోగులు, కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి పిల్లలు ఉదయం గ్రామాల నుంచి 8 గంటలకే బయల్దేరి చాలా దూరం ప్రయాణించి మండల కేంద్రాల్లో ఉండే జూనియర్ కాలేజీలకు చేరుకుంటారు. కొన్ని సార్లు ఇంటి నుండి లంచ్ బాక్స్ తెచ్చుకోవడం వీలుకాకపోవడంతో అప్పుడు అర్థాకలితో చదువుకుంటున్నారు. ఇలాంటి సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ తీసుకురావడం మంచి విషయమే. అయితే పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించి ఈ పథకాన్ని బలోపేతం చేస్తేనే భావితరాలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం గుర్తించాలి.
మెనూ :
ప్రభుత్వం విడుదల చేసిన మెనూ ప్రకారం… సోమవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ. మంగళవారం అన్నం, కోడిగుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ. బుధవారం వెజ్ పులావ్, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ. గురువారం అన్నం, కోడిగుడ్డు, కర్రీ, సాంబార్, రాగిజావ. శుక్రవారం పులిహార, గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ.శనివారం అన్నం, వెజ్ కర్రీ, కర్రీ, రసం, పొంగల్ స్వీట్ పెట్టాలి.
మెనూ మారాలి:
పీపుల్స్ పల్స్ సంస్థ పరిశీలించిన కాలేజీల్లో ఎక్కడా మెనూ బోర్డులు కనిపించలేదు. మెనూ ప్రకారమే అన్ని పదార్థాలు ఉంటున్నాయా? అని మా రీసెర్చర్లు విద్యార్థులను అడిగినప్పుడు ఉంటున్నాయి అని 76.7 శాతం మంది, కొంత తేడా ఉంటుందని 20.8 శాతం మంది, ఉండటం లేదని 2.5 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న మెను మీకు నచ్చిందా? లేక ఏమైనా మార్పులు చేయాలా? అని వారిని అడిగినప్పుడు 29.7 శాతం మంది నచ్చిందని చెప్పగా, 3.8 శాతం మంది నచ్చలేదని, 66.5 శాతం మంది మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పారు. ‘‘కోడి గుడ్డు ప్రతి రోజు కాకుండా, వారానికి మూడు, నాలుగు రోజులు పెడితే బాగుంటుందని, కోడిగుడ్డుకు బదులు ఏదైనా పండు ఇచ్చినా ఒకే’’ అని గుంటూరులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వెంకటేశ్వర్లు చెప్పాడు. ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాలే రాష్ట్రమంతా వెలువడ్డాయి. కాబట్టి, మెనూను మరింత మెరుగుపరచాలనే అభిప్రాయాలను ప్రభుత్వం పరిగనణలోకి తీసుకుంటే బాగుంటుంది.
భోజనంపై విద్యార్థుల అభిప్రాయం:
మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందని విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నప్పుడు 23.3 శాతం మంది బాగుందని చెప్పగా, 49.7 శాతం మంది పర్వాలేదని, 27 శాతం మంది బాగోలేదని చెప్పడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. మధ్యాహ్న భోజనం బాగుందా? లేక ప్రతి విద్యార్థికి మెస్ చార్జీలు ఇవ్వడం బెటరా? అనడిగినప్పుడు 83 శాతం మంది మధ్యాహ్న భోజనమే బెటర్ అని చెప్పారు. అంటే, వీరు ప్రభుత్వం నుంచి మరింత మెరుగైన భోజనాన్ని ఆశిస్తున్నారని స్పష్టమౌతోంది.
గుంటూరు పెనుమాక గర్ల్స్ కాలేజీలో పీపుల్స్ బృందం పర్యటించినప్పుడు అక్కడ అక్షయ పాత్ర సంస్థ ఆహారం సరఫరా చేస్తోంది. వారు పంపిన పులిహోర పిల్లలు తినకుండా వదిలివేశారు. అక్షయపాత్ర అందజేస్తున్న ఆహారం ఉదయం 10.30కే ఆహారం రావడంతో అది మధ్యాహ్నానికి చల్లబడిపోవడం, మెత్తబడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రయివేట్ సంస్థలు సరఫరా చేస్తున్న ఇతర కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
మహిళా సంఘాలే బెటర్:
మీకు అందిస్తున్న భోజనం ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రశ్నకు 65 శాతం మంది మధ్యాహ్నం భోజనం వండే బడి నుండి అని చెప్పగా… 7.6 శాతం మంది సెంట్రలైజ్డ్ కిచెన్ నుండి వస్తుందని, 1.9 శాతం మంది ఎన్జీవో సంస్థల నుంచి వస్తుందని చెప్పగా… ఏకంగా 25.5 శాతం మంది తెలియదని చెప్పారు. వాస్తవానికి ఉప్పు, కారంతో పాటు రుచి విషయంలో మహిళా సంఘాలు వండిన భోజనమే బాగుందని అధిక శాతం విద్యార్థులు చెప్పారు. ప్రయివేట్ సంస్థల కిచెన్ల నుంచి వస్తున్న ఆహారం చప్పగా ఉంటుందన్నారు. దీనితో పాటు వాళ్లు గుడ్లు ఇవ్వడం లేదు. దీనికోసం ఉడకబెట్టిన గుడ్లు బయట నుంచి తీసుకువస్తున్నారు. కాబట్టి, మహిళా సంఘాలకు మరింత పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అప్పగిస్తే, భోజన నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.
కాలేజీల్లో మధ్యాహ్న భోజనం స్థానికంగా వండకుండా… అక్షయపాత్ర, కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఉదాహరణకు జగ్గంపేట, కిర్లంపూడి, కరప కాలేజీల్లో పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వండి తీసుకొస్తుండగా, కాకినాడ కాలేజీకి అక్షయ పాత్ర నుంచి వస్తోంది. సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు కాలేజీలకు బెండపూడిలోని అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ నుంచి ఆహారం వస్తోంది. ఇలా తీసుకొస్తున్న ఆహార పదార్థాలు వేడిగా ఉంటున్నాయా? అని అడిగినప్పుడు 58 శాతం మంది కొన్నిసార్లు మాత్రమే వేడిగా ఉంటుందని చెప్పారు. కొన్ని కాలేజీల్లో దాతలు ఇచ్చిన హాట్ బాక్సుల్లో తెచ్చి వడ్డించడం వల్ల వేడిగా ఉంటున్నాయి. కొన్ని కాలేజీల్లో మామూలు గిన్నెలో వడ్డించడం వల్ల తొందరగా చల్లబడిపోతున్నాయి.
వృథా అవుతోందా?
మధ్యాహ్న భోజనంలో వేస్టేజ్ ఉందా? ఉంటే ఎందుకుంటోందని ప్రశ్నించినప్పుడు రైస్ సరిగ్గా లేనప్పుడు 34.8 శాతం, కూరలు బాగాలేనప్పుడు 18.4 శాతం, పదార్థాలు రుచి లేనప్పుడు 14.6 శాతం వేస్టేజ్ ఉంటుందని, వేస్టేజ్ ఉండటం లేదని 32.2 శాతం మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం తగినంతగా వడ్డిస్తున్నా, కూర మాత్రం అరకొరగా అందించడంతో విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. స్థానికంగా వండిన భోజనం కొంత బాగానే ఉంటోంది. కానీ, ఇతర ప్రాంతాల నుంచి తెస్తున్న భోజనం కాలేజీకి చేరేసరికి ముద్దగా మారిపోతోంది. దీనివల్ల విద్యార్థులు తక్కువగా తింటుండటంతో ఎక్కువ ఆహారం వృథా అవుతోంది.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం వెజ్ పులావ్ వడ్డించే రోజు విద్యార్థులు ఎక్కువగా భోజనం చేస్తున్నారు. అయితే, పులిహార తరచుగా ముద్దగా ఉండటంతో ఆ రోజుల్లో తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రైవేట్ సంస్థలు సరఫరా చేస్తున్న ఆహారం పొద్దున్నే రావడం, గంటల తరబడి బాక్సుల్లో నిల్వ ఉంచడంతో మెత్తబడిపోతోంది. కొన్నిసార్లు పాచిపోవడం కూడా జరగుతోంది. దీంతో విద్యార్థులు తినలేక ఆహారం వృథా అవుతోంది.ఈ సమస్యకు పరిష్కారంగా భోజనం నాణ్యత మెరుగుపరిచేలా కాలేజీలోనే వండి, వడ్డించే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది.
పరిశుభ్రత కరువు:
భోజనం వండే ప్రదేశం, విద్యార్థులు భోజనం చేసే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. మధ్యాహ్న భోజనం చేయడానికి ఇచ్చే ప్లేట్లు, గ్లాసులు శుభ్రంగా ఉంటున్నాయా? అని విద్యార్థులను అడిగినప్పుడు ఉంటున్నాయి అని 56.1 శాతం చెప్పగా, ఉండటం లేదని 17.6 శాతం, కొన్నిసార్లు మాత్రమే శుభ్రంగా ఉంటున్నాయి అని 26.3 శాతం చెప్పారు. భోజనం చేసే ప్రదేశం శుభ్రంగా ఉంటుందా? అని అడిగినప్పుడు 50.5 శాతం ఉంటుందని చెప్పగా, 32.6 శాతం ఉండటం లేదని, కొన్నిసార్లు మాత్రమే శుభ్రంగా ఉంటున్నాయి 16.9 శాతం మంది చెప్పారు. శుభ్రత ఉండాలంటే కచ్చితంగా సంబంధిత అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేయాలి.
ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 40 ప్రకారం… ఈ పథకాన్ని దగ్గరుండి చూసుకోవాల్సింది కాలేజీ ప్రిన్సిపల్సే! కానీ, చాలా కాలేజీల్లో వారు ఇతర పనుల్లో తలమునకలవ్వడం వల్ల సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నామని చెప్తున్నారు. కాలేజీ ప్రిన్సిపల్స్ ప్రత్యేక దృష్టి సారించిన కాలేజీల్లో మాత్రం మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల శాతం ఎక్కువగా ఉంది. అక్కడ ఈ కాలేజీల్లో ప్లేట్లు, గ్లాసులు శుభ్రంగా ఉండటంతో పాటు, భోజనం నాణ్యత మెరుగ్గా ఉంది. ఉదాహరణకు పీపుల్స్‌పల్స్ బృందం పరిశీలించిన జగ్గంపేట, కరప (వేలంగి), పోలాకి, కోటబొమ్మాలి, ఆముదాల వలస కాలేజీల్లో ప్రిన్సిపల్స్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల దాదాపు 95 శాతం విద్యార్థులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు.
తనిఖీలు లేవు:
మధ్యాహ్న భోజనం సరిగ్గా పెడుతున్నది, లేనిది తనిఖీలు చేయడానికి ఎవరైనా వస్తుంటారా? అని విద్యార్థులను అడిగినప్పుడు 79.8 శాత మంది రావడం లేదని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు, ప్రజా ప్రతినిధులు రానప్పుడు కనీసం అధ్యాపకుల పర్యవేక్షణ అయినా ఉండాలి. కానీ, తమకు అనేక బాధ్యతలు ఉండటం వల్ల ఈ పర్యవేక్షణ సరిగ్గా చేయలేపోతున్నామని అధ్యాపకులు చెప్తున్నారు.
ఈ విషయాలను పరిశీలిస్తే భోజనం నాణ్యత, ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు కచ్చితంగా ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా, విద్యార్థులకు మేలు కలిగించేలా మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుంది.
విద్యార్థుల గోడు వినేది ఎవరు?
సేవలైనా, పాలనైనా మెరుగుపడాలంటే సరైన ఫీడ్‌బ్యాక్, ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించే వ్యవస్థ కచ్చితంగా ఉండాలి. కానీ, మధ్యాహ్న భోజన పథకానికి అలాంటి వ్యవస్థ లేకపోవడం విద్యార్థులకు పెద్ద సమస్యగా మారింది. 81.8 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సమస్యల గురించి ఫిర్యాదు చేసే సౌకర్యమే లేదని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా దీనిని పట్టించుకోవడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఏకాభిప్రాయంగా చెప్పారు. కొంతమంది విద్యార్థులు సమస్యలను ప్రిన్సిపల్ లేదా అధ్యాపకులకు తెలియజేస్తున్నా పరిస్థితిలో ఏ మార్పు రావడం లేదని చెప్పారు. ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుని వెంటనే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ లేదా ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రతినెలా అధికారుల సమీక్ష నిర్వహించి, విద్యార్థుల ఫిర్యాదులపై స్పందించాలి. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు తక్షణ చర్యలు తీసుకునేలా వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పాలి. విద్యార్థుల సమస్యల్ని పట్టించుకోకపోతే, మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం నీరుగారిపోవడం ఖాయం.
మంచినీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి:
భోజనానికి కంటే ముందు మంచి నీరు చాలా ముఖ్యం. మన ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా మంచినీళ్లే ఇస్తాం. తాగడానికి సరిపడా నీళ్లు లేకపోతే, భోజనం చేయాలనిపించదు. కానీ, చాలా కాజీల్లో తాగునీటి వ్యవస్థ సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. భోజన సమయంలో తాగునీరు అందుతోందా? అని విద్యార్థులను అడగ్గా 57.3 శాతం అందుతోందని, 31.4 శాతం అందట్లేదని చెప్పగా 11.3 శాతం మాత్రం సొంత బాటిల్స్ తెచ్చుకుంటామన్నారు. ‘‘తాగడానికి సరిగ్గా నీళ్లు లేకపోతే భోజనం కూడా చేయాలనిపించదు. అందుకే నేను అప్పుడప్పుడే తింటాను’’ అని అనంతపురంలో సోమశేఖర్ అనే విద్యార్థి చెప్పాడు. కాలేజీల్లో కనీస అవసరమైన తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.
భోజనం చేయడానికి వసతుల కొరత:
కాలేజీల్లో భోజనం సమయానికి అందిస్తున్నప్పటికీ, తినేందుకు సరైన వసతులు లేకపోవడం విద్యార్థులకు ప్రధాన సమస్యగా మారింది. భోజన సమయంలో కూర్చునే సదుపాయం ఉందా? అని విద్యార్థులను అడిగినప్పుడు 45.3 శాతం ఉంటుందని, 32 శాతం ఉండదని చెప్పగా 22.7 శాతం ఎక్కడో చోట సర్థుకుంటున్నాము అన్నారు. ఎక్కువమంది చెట్ల కింద, లేక ఆరు బయట కూర్చోని తినడం పీపుల్స్ పల్స్ బృందం అనేక కాలేజీల్లో చూసింది. కాలేజీల్లో డైనింగ్ హాల్స్ లేకపోవడంతో మధ్యాహ్న భోజనం ఒక అన్నదాన కార్యక్రమంలా సాగుతోంది.
అయితే, ఇక్కడ మెచ్చుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే విద్యార్థులు మానవతా విలువలు పాటిస్తున్నారు. రాజకీయ నాయకులు సృష్టించే కుల మత భావనలు వారిలో లేవు. భోజన సమయంలో ఇతరులతో కలిసి కూర్చుంటున్నారా? అని విద్యార్థులను అడిగినప్పుడు కలిసే తింటామని 90 శాతం చెప్పడమే ఇందుకు నిదర్శనం. భోజనం పెట్టడమే కాక, విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో తినేలా చూడటం కూడా ప్రభుత్వ బాధ్యతే!
విద్యార్థి సంఘాల వైఫల్యం :
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు విద్యార్థి సంఘాల మద్దతు లేదని పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ పథకంపై విద్యార్థి సంఘాలు శ్రద్ధ పెడుతున్నాయా అని ఆరా తీయగా… ఏ విద్యార్థి సంఘం ఈ పథకంలో ఉన్న లోపాలను పట్టించుకోవడం లేదని తెలిసింది. విద్యార్థి సంఘాలు ఎంతసేపూ ప్రయివేట్ విద్యా సంస్థల చుట్టూ తిరుగుతూ తమ బంధువులకు ఫ్రీ అడ్మిషన్స్ ఇప్పించుకోవడం, సెటిల్ మెంట్స్ చేసుకోవడంలోనే బిజీగా ఉంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం సహా కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు కూడా ఈ సమస్యలపై మౌనంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఏర్పడ్డ సంఘాలు ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తి చూపాలి, పరిష్కారం కోసం పోరాడాలి. కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేయడం దురదృష్టకరం.
ప్రచారానికే పరిమితమవుతున్న నేతలు, మీడియా :
డొక్కా సీతమ్మ పథకం ప్రారంభంలో రాజకీయల నేతలతో పాటు మీడియా కూడా ఎంతో హడావుడి చేయడం తప్ప పథకం అమల్లోకి వచ్చిన తర్వాత వాటిలో లోటుపాట్లను గమనించడంలో నేతలతో పాటు మీడియా కూడా పూర్తిగా విఫలమైనట్లు మా అధ్యయనంలో తేలింది. స్థానిక నేతలు పథకం అమలు తీరును పట్టించుకుంటున్నారా..? అప్పుడుడప్పుడు పర్యవేక్షిస్తున్నారా..? అని విద్యార్థులను అడగ్గా అలంటిదేమీ లేదనే అభిప్రాయం అన్నిచోట్ల వినిపించింది. ఇక మీడియా కూడా ఏదో ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప, ఈ పథకం అమలు తీరుపై వార్తలు రాసిన దాఖలాలు ఎక్కడా లేవు.
ఇంటర్ విద్యార్థులకు పోషకాహారం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆదారణ పెరిగే అవకాశం ఉంది. ఇంటర్ పూర్తి కాగానే, విద్యార్థులకు ఓటు హక్కు కూడా వస్తుంది. కాబట్టి, ప్రభుత్వం వారికి మంచి ఆహారం అందిస్తే.. భవిష్యత్తులో వారు గుర్తుపెట్టుకుని ఓట్లు కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి, ఈ పథకాన్ని ఏదో మొక్కుబడిగా అమలు చేయకుండా, వారి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడిగా భావించాలి.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా నిర్వహించడానికి కొన్ని సూచనలు…
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించినా అనంతరం దీనిపై పర్యవేక్షణ కొరవడడంతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారుతోంది. ఈ పథకం అమలుతీరుపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మధ్యాహ్న భోజన పథకం అందించే సిబ్బంది, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చించినప్పుడు పలు సూచనలు సలహాలు అందాయి. వీటినన్నింటినీ క్రోడీకరించి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పథకం అమలులో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తోంది. ప్రభుత్వం కింది చర్యలు తీసుకుంటే ఈ పథకాన్ని మరింత పటిష్టంగా నిర్వహించడంతో పాటు ప్రజల మనసును కూడా గెలుచుకోవచ్చు. స్వాతంత్ర సమరయోధురాలు, నిత్య అన్నదాతగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు మీద అమలవుతున్న ఈ పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకొని ఆమె పేరు ప్రతిష్టతలకు భంగం కలగకుండా చూడాలని అందరూ కోరుకుంటున్నారు.
*డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తూ అంతా బాగుందనే భ్రమల్లో ప్రభుత్వం ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. పథకం ఎలా అమలవుతుందో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహిస్తే ప్రయోజకరంగా ఉంటుంది.
*సోషల్ ఆడిట్‌లో పథకం అమలు తీరులో లోటుపాట్లతో పాటు, ఎక్కడైనా అవినీతి జరిగినా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. గత సర్కార్ హయాంలో చిక్కీ సరఫరాలో అవినీతి ఆరోపణలు రావడం తెలిసిందే.
*మధ్యాహ్న భోజనం పథకం మరింత మెరుగ్గా నిర్వహించడానికి ప్రస్తుతం ఒక్కొక్క విద్యార్థికి ఒక్క భోజనానికి కేటాయిస్తున్న రూ.14.50 నిధులను కనీసం రూ.30 లకు పెంచాలి. ఈ నిధులు కేటాయించినప్పుడే ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. సరైన నిధులు లేకపోతే ఏ కార్యక్రమం ఫలప్రదం కాదు.
*అన్న క్యాంటీన్‌లో ఒక్క ప్లేటుకు ప్రభుత్వం రూ.22 కేటాయిస్తుండగా, లబ్ధిదారుని నుండి రూ.5 లు వసూలు చేస్తున్నారు. అంటే మొత్తం రూ.27 లు అక్షయ పాత్ర వారికి ప్రభుత్వం అందజేస్తుంది. కానీ, ఇంటర్ విద్యార్థులకు మాత్రం రూ. 14.50 మాత్రమే కేటాయిస్తోంది. ఇంత తక్కువ ధరలో విద్యార్థులకు పోషకాహారం అందించడం సాధ్యమేనా? ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఖచ్చితంగా కనీసం రూ.30 లు ఒక్కొక్క విద్యార్థికి ఒక్క భోజనానికి అందజేయాలి.
*విద్యార్థులకు ఇస్తున్న మెనూ చార్జీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం మెనూ తయారు చేసినట్టుంది. మెనూ బాగుంది కానీ కేవలం రూ.14.50 తో నాణ్యమైన భోజనం అందించడం సాధ్యం కాదు. ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలి. కనీసం ఒక్కో విద్యార్థికి రూ.30 మెనూ చార్జీలు కేటాయించాలి. లేదంటే ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలనే లక్ష్యానికి ఎప్పటికీ చేరుకోలేదు.
*అక్షయ పాత్ర లేదా ఇతర ప్రయివేట్ సంస్థలు వెల్లుల్లి, ఉప్పు, కారం సరైన మోతాదులో వేయకుండా వంట వండి బాక్సుల్లో పొద్దున్నే పంపిస్తుండడంతో ఆహారం మధ్యాహ్నం వరకు చెడిపోతోంది. వీటి రుచి కూడా విద్యార్థులకు నచ్చడం లేదు. దీంతో విద్యార్థులకు తినకుండా పారేస్తున్నారు.
*మరోవైపు బియ్యం కూడా సరిగ్గా లేకపోవడంతో అన్నం మెత్తగా కావడం, రుచిగా లేకపోవడంతో విద్యార్థులు తినడానికి ఇష్టపడడం లేదు. అన్నం కూడా చెడిపోతుంది. అన్నం బాగోలేనప్పుడు వేస్టేజ్ ఎక్కువగా ఉంటుందని 34.8% మంది విద్యార్థులు సర్వేలో అభిప్రాయపడడమే ఇందుకు నిదర్శనం.
*ప్రభుత్వం దొడ్డు బియ్యం అందజేస్తుండడంతో అన్నంలో నాణ్యత లోపిస్తోంది. సన్నబియ్యం సరఫరా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వేలో వెలువడిరది.
*పథకంలో అమలు చేస్తున్న మెనూపై కూడా అసంతృప్తి కనిపిస్తుంది. మెనూలో మార్పులు చేస్తే బాగుంటుందని 66.5% మంది అభిప్రాయపడ్డారు.
*మధ్యాహ్న భోజనం పథకం విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టమైన వైఖరీతో జీవోను విడుదల చేయాలి. విద్యార్థులకు ఆర్థిక భారం కలగకుండా వారు ఉన్నత చదువులు కొనసాగించడానికి అవసరమైన పోషకాహారం అందించాలని గుర్తించినట్టు జీవోలో చెప్పినా, విద్యార్థులకు అందించాల్సిన పోషకాహార పరిమాణం, ఎన్ని గ్రాముల ఆహారం ఇవ్వాలి అంశాలపై జీవోలో స్పష్టత లేదు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది.
*పేరు ప్రఖ్యాతలున్న అక్షయ పాత్ర సంస్థపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా, వారు తయారు చేసే ఆహార పదార్థాల రుచులకు విద్యార్థుల రుచులకు వ్యత్యాసం ఉండడంతో అది విద్యార్థులకు నచ్చడం లేదు. కాబట్టి భోజనం వండే బాధ్యతలను పాఠాశాలల మాదిరిగా, అన్ని కాలేజీల్లో మహిళా సంఘాలకే అప్పగిస్తే విద్యార్థుల రుచులకు అనుగుణంగా ఆహారం వండే అవకాశాలుంటాయి.
*ఈ పథకం పర్యవేక్షణ, వాటి నిర్వహణ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక ప్రత్యేక అధికారి నియామకంతో పాటు, ఈ కార్పొరేషన్ బాధ్యతలను ఒక ప్రజా ప్రతినిధికి లేదా సమర్థతగల నాయకుడికి అప్పగించాలి. ఈ కార్పొరేషన్‌లో కాలేజీ ప్రిన్సిపల్‌తో పాటు కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, సంఘ సేవకులను, విద్యార్థి సంఘాల నేతలను, కార్మికులను కూడా సభ్యులుగా నియమించి వీటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించాలి.
*జీవో ప్రకారం కలెక్టర్ కూడా ఈ పథకాన్ని పర్యవేక్షించాలి. కానీ, అధికారులు మొదటి రోజు హడావిడి చేసి, ఇప్పటి వరకు వాళ్లు వచ్చి తనిఖీ చేసిన సందర్భాలే లేవు. వాళ్లు ఒక్క రోజు తిని బాగుందని చెప్పడం… కాదు. క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే కిందస్థాయి సిబ్బందిలో బాధ్యత పెరుగుతుంది.
*మంత్రులు, జిల్లా ఇన్చార్జీ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ పథకం అమలుపై తరచూ తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తే లోటుపాట్లు లేకుండా ఉంటాయి. అంతేకాక విద్యార్థుల్లో కూడా మధ్యాహ్న భోజనంపై భరోసా కూడా ఏర్పడుతుంది.
*రాష్ట్ర స్థాయిలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రజా ప్రతినిధులతో, టీచర్స్ ఎమ్మెల్సీలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఒక సలహా కమిటీని ప్రభుత్వం అధికారికంగా నియమించి ప్రతీ 15 రోజులకొకసారి సమావేశాలు ఏర్పాటు చేసి వాటిలోని లోటుపాట్లను సరిచేయాలి.
*మధ్యాహ్న భోజనం పథకాన్ని పర్యవేక్షించడానికి ఆయా కాలేజీ పరిధిలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులతో సలహా కమిటీలను ఏర్పాటు చేయాలి.
*ప్రజా ప్రతినిధులు పథకం ప్రారంభం మొదటి రోజు హడావిడి చేసిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు వాళ్లు వచ్చి పథకంపై తనిఖీ చేసిన సందర్భాలు లేవు. ప్రజా ప్రతినిధులు ఈ పథకం గొప్పదనాన్ని గుర్తించి, తమ ప్రచారంలో ఉపయోగించుకోవాలంటే, తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి. ఇది కూడా ప్రజా సేవలో ఒక భాగమే. *మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై తనిఖీలకు ఎవరూ రారని 79.8% విద్యార్థులు సర్వేలో చెప్పారు. ఎవరూ తనిఖీలు చేపట్టకపోతే సిబ్బందిలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలుంటాయి.
*ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు చేపడితేనే బాగుంటుంది.
*విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఈ పథకంలో దాతలు, పారిశ్రామిక వేత్తలు పాలు పంచుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దాతల సహాయానికి గుర్తింపుగా కాలేజీలలో ఒక డిస్ ప్లే బోర్డ్‌లో వారి వివరాలు నమోదు చేస్తే గౌరవప్రదంగా ఉండడమే కాకుండా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. దీనికి స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలి. దీని వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గడంతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది.
*ఈ పథకానికి సంబంధించి వివిధ రూపాల్లో దాతలను ప్రోత్సాహించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తే పథకం లక్ష్యం కూడా నెరవేరుతుంది.
*తాగునీటి సౌకర్యం, శుభ్రత విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. ప్లేట్లను శుభ్రంగా కడిగేలా సిబ్బందికి సూచించాలి. శుభ్రతకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
*కొన్ని చోట్ల వంట సిబ్బంది అపరిశుభ్రంగా ఉంటుండడంతో అక్కడ తినడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.
*వంట వండే సిబ్బందికి శుభ్రతతో పాటు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం వేసని కాలంలో ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి.
*మధ్యాహ్న భోజన సిబ్బందికి యూనిఫామ్‌తో పాటు, వారికి ఆప్రాన్, గ్లౌజులు, మాస్కులు ఇవ్వాలి.
*ఆహార పదార్థాల నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, శుభ్రత తదితర సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి ఒక వ్యవస్థ లేకపోవడం కూడా పథకంలో ఒక లోపమే. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ గానీ, ప్రతి కాలేజీలో సలహాల బాక్స్ గానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
*వంట సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న వేతనాలను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వంట మాస్టర్లకు, వారి అసిస్టెంట్లకు మంచి డిమాండు ఉంది. వారు రోజుకు రూ.500 నుండి రూ.1000 వరకు సంపాదిస్తున్నారు. ఇందుకు భిన్నంగా ఈ పథకంలో వంట సిబ్బంది అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారు. ధరలు ఆకాశానంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలనే డిమాండ్ ఉంది.
*వంట వండే సిబ్బందికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఒక్కోసారి ఐదారు నెలలు కూడా బిల్లుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించకపోవడంతో వీరు అప్పులు తెచ్చి విద్యార్థుల కోసం వండాల్సి వస్తుంది. నిరుపేదలైన వీరికి బయట అప్పు పుట్టడం కూడా గగనమవుతోంది.
*నిధులు లేకుండా ఆహారం వండడం సాధ్య పడదు కాబట్టి ప్రభుత్వం ప్రతి నెల వంట సిబ్బందికి గ్రీనెచానెల్ ద్వారా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
*గ్యాస్ సిలిండర్లను ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం కోసం అందించాలి.
*చాలా కాలేజీల్లో విద్యార్థినిలు ఈ పథకాన్ని వినియోగించుకోవడం లేదు. లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. విద్యార్థినిలు కోరుకుంటున్న నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలి.
*విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటానికి వంట షెడ్లు, డైనింగ్ రూమ్స్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. వీటి ఏర్పాటుకు దాతలను కూడా ప్రోత్సాహిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
*విద్యార్థులతో పాటు లెక్చరర్లు, సిబ్బంది కూడా మధ్యాహ్న భోజనం పథకంలోనే తింటే నాణ్యత మరింత మెరుగ్గా ఉంటుందని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
*మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన అనంతరం అంతా బాగుందనే భావనలో ప్రభుత్వం ఉన్నా వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. పథకం ఎలా ఉందనే దానిపై విద్యార్థుల స్పందనను పరిశీలిస్తే బాగుందనే వారు 23.3% మాత్రమే ఉన్నారు. 49.7 శాతం పర్వాలేదని అభిప్రాయపడ్డారంటే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
*ఈ పథకాన్ని ఏడాది పొడవునా నిర్వహించాలని 86.2% మంది విద్యార్థులు సర్వేలో అభిప్రాయపడిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తే బాగుంటుంది.
*మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణకు గ్రామ సచివాలయం సిబ్బందిలో ఒకరికి బాధ్యతలు అప్పగించాలి.
*ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో సహా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పనితీరుపై కనీసం నెలకు ఒక్కసారి క్రమం తప్పకుండా ఉన్నతస్థాయిలో సమీక్షించాలి. తద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు సాధించవచ్చు.
*ఈ పథకంలోని లోపాలను సరిదిద్ది వచ్చే విద్యా సంవత్సరంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
*ప్రస్తుతం పాఠశాలల్లో వండుతున్న ప్రాంతాల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఆయా కాలేజీలలోనే వండేలా చర్యలు తీసుకోవాలి.