Telangana politics: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల కాలేదు. జమిలి ఎన్నికల ప్రక్రియ ఊసే లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడను లేదు. కానీ తెలంగాణలో రెండు రోజుల పాటు జరగనున్న మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ సభలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు మాటల తూటాల పేల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కాగా కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే.. హైదరాబాద్ వేదికగా ఈ నెల 17 వ తేదీన సీడబ్ల్యుసీ సమావేశాలు నిర్వహించేందుకు ఆపార్టీ అధిష్టానం నిర్ణయించింది. దాదాపు ఒకటిన్నర దశాబ్ద కాలం అనంతరం హైదరాబాద్‌లో మళ్లీ సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది. గత సీడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఈ సారి ప్రతిపక్ష హోదాలో సమావేశం ఏర్పాటు కాబోతుంది. ఈ సమావేశాలకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సుమారు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు.. సీడబ్ల్యూసీ మెంబర్లు.. రెండు వందల మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరితోపాటు కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గెలు ప్రత్యేక అతిధులుగా పాల్గొనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు.. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండాలనే విషయాలపై చర్చ జరుగనున్నట్లు సమాచారం. కర్ణాటకలో అధికారంలోకి రావడం.. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించడంతో నాయకుల్లో ఆత్మస్థర్యం పెరిగింది. ఇదే ఊపులో కీలమైన తెలంగాణతోపాటు మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అధికారం రావాలనే సంకల్పం కాంగ్రెస్‌లో పెరుగుతు వస్తోంది. ఈ క్రమంలోనే బహిరంగ సభలో సోనియా గాంధీ చేసే డీక్లరేషన్‌లోని ఐదు అంశాలను తెలంగాణ వ్యాప్తంగా విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆపార్టీ భావిస్తోంది.
విముక్తి దినోత్సవ్ పేరుతో..
తెలంగాణ బీజేపీ..వరంగల్‌లో నిర్వహించాలని భావించిన విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్‌కు మార్చింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సీడబ్ల్యూసీ, బహరంగ సభ నిర్వహిస్తుండడంతో కాషాయ దళం కార్యక్రమంలో మార్పులు చేసింది. హైదరాబాద్ పేరెడ్ గ్రౌండ్ వేదికగా సెప్టెంబరు 17న తెలంగాణా విమోచన దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు జాతీయ బీజేపీ నాయకులు.. పలువురు మంత్రులు..రాష్ట్ర బీజేపీ నాయకులు హజరుకానున్నారు. సీఎం కేసిఆర్..విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. బీజేపీ_ బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న భావనను ప్రజల మనసుల్లో నుంచి పూర్తిగా తొలగించి..ఒక్క దెబ్బకు రెండు పిట్టల మాదిరి లబ్ధి పొందాలని కమలం పార్టీ భావిస్తోంది. దీనికి తోడు కవితకు మరోమారు సీఐడి నోటీసులు ఇవ్వడంతో బీజేపీ పాత్ర లేదని బహిరంగ సభ వేదికగా అమిత్ షా స్పష్టమైన సంకేతాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో ఎన్నికల దగ్గర పడడుతున్న క్రమంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటనల అనంతరం ఏర్పడిన పరిణామాలు పార్టీని ఒకింత ఇబ్బంది పెడుతున్నాయి. వీటన్నంటిని అధిగమించి మూడో సారి అధికారంలోకి రావాలంటే గట్టి నిర్ణయాలు, హమీలు ఇవ్వాల్సి ఉంటుంది.ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలు పూర్తికాకపోవడం.. ఇవ్వడానికి పెద్దగా కొత్త హమీలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న బీఆర్‌ఎస్ హ్యట్రిక్ సాధన అంత సులభంకాదన్న అభిప్రాయంతో నేతలు ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్ అడ్డాగా కాంగ్రెస్, బీజేపీ భారీ బహిరంగ సభల తాకిడిని తట్టుకోవడానికి బీఆర్‌ఎస్ ఈ సారి కొత్త రాగం అందుకుంది. దశాబ్దాలుగా నిర్మాణానికి నోచుకోలేని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కొద్దిపాటిగా పూర్తి చేసి 16న ప్రారంబోత్సవ కార్యక్రమం పెట్టుకుంది.బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్, బీజేపీలను తన మాటల గారడీతో కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసిన కేసీఆర్.. ఎప్పుడు లేని విధంగా ఈ సారి సెప్టెంబరు 17ను జాతీయ సమాఖ్యత దినోత్సవం పేరుతో ఎంఐఎంతో కలిసి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఆ పార్టీ కి ఏ మేర కలిసి వస్తుందో వేచి చూడాలి.
మొత్తంగా తెలంగాణలో రానున్న రెండు రోజులు పార్టీల బహిరంగ సభలతో రాజకీయ సందడి నెలకొననుంది. నేతల మాటల తూటాలతో రానున్న రోజుల్లో రాజకీయం రంజుగా మారనుంది.
=============
( బొజ్జ రాజశేఖర్ ,సీనియర్ జర్నలిస్ట్)