Newsminute24

బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

 

 ఎవరికి వరం? ఎవరికి శాపం?

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని బల్లగుద్ది చెప్పే వారున్నారు. ఎవరి లాభ`నష్టాల సంగతెలా ఉన్నా, కొంత ప్రభావం తప్పదనే వాదనా ఉంది. ఆయన వస్తే గిస్తే, పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తన స్వప్రయోజనాల కోసం బీజేపీతోఅక్కడ జత కట్టే ఆశతో, తెలంగాణలో ముందుగానే వారికి సహకరించేందుకే ఈ ఎత్తు తప్ప మరేమీ కాదని ఇప్పటికే మీడియా కోడై కూస్తోంది! నిజంగా ఆయన సహకారం ఇక్కడ బీజేపీకి నేరుగా లాభమా? లేక కాంగ్రేసేతర విపక్షాలన్నింటినీ పాలకపక్షమైన బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా, బీజేపీ ఛత్రఛాయ కింద ఏకం చేయడానికి పనికొస్తుందా? అన్నది రాగల పరిణామాల్ని బట్టి తెలాల్సిందే! తెలంగాణలో కమ్యూనిస్టులు ముందే బీఆర్‌ఎస్‌ చంకనెక్కిన దరిమిళా… బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీతోను, షర్మిల నేతృత్వపు వైఎస్సార్‌టీపీతో, ప్రవీణ్‌కుమారు నాయకత్వపు బీఎస్‌పీతో పొత్తో, అవగాహనో కుదుర్చుకుంటే తప్పేంటనే చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ప్రధానంగా కాంగ్రెస్‌పై నమ్మకం కోల్పోయి, పాలక బీఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్న వారి కోరిక అనుకోవచ్చు! జాతీయస్థాయిలో ప్రత్యర్థి పక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు ఎలాగూ కలవవు. ఇక ఇన్నాళ్లూ ఓ ప్రాంతీయపార్టీ (టీఆర్‌ఎస్‌)యే అయిన ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ను దెబ్బకొట్టడానికి కలిసివచ్చే శక్తులతో జట్టు కట్టడం బీజేపీకి లాభించేదేనన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది. తాను తేలిగ్గా తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి రాష్ట్రంలో బహుముఖ పోటీలో, కనీసం ఓ బలమైన ముక్కోణపు పోటీనో ఉండాలని కేసీఆర్‌ నేతృత్వపు బీఆర్‌ఎస్‌ కోరుకోవడం సహజం! అలా కాక, అది కాంగ్రెస్‌ కేంద్రకంగానో, బీజేపీని అల్లుకొనో జరిగే కూటముల ఏర్పాటయితే అది వారికి తలనొప్పి వ్యవహారమే! సదరు తలనొప్పి చంద్రబాబుతో రావడం కేసీఆర్‌ జీర్ణించుకోలేరు. ఖమ్మం సమావేశం బాగా జరిగింది, పునరాగమనానికి మంచి ఎంట్రీ దొరికిందనే సంబరాల్లో ఉన్న టీడీపీ తదుపరి అడుగులు ఎలా ఉంటాయి? వారి ఆలోచనలకి బీజేపీ ఎలా స్పందిస్తుంది? రాజకీయ పండితులు అంచనా వేస్తున్నట్టు మిగతా అమాంబాపతు పార్టీల్లో ఉలుకూ పలుకూ ఉంటుందా? అన్నదే తెలంగాణలో రాజకీయ శక్తుల పునరేకీకరణని నిర్ణయించనుంది.

ప్రభావం ఎంత?

2014 ఎన్నికల తర్వాత టీడీపీ తెలంగాణలో చేతులెత్తడంతో అప్పటివరకు ఆ పార్టీలో వెలిగిన పలువురు నాయకులు దిక్కున్న చోటుకి జారుకున్నారు. ఎక్కువ మం నాటి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి తమ తమ స్థానాల్ని పదిలపరచుకున్నారు. కొందరు ఇప్పటికీ అక్కడ బలంగా ఉన్నారు. మరికొందరు చేరనైతే చేరారు కానీ, నిరాదరణతో ఉన్నారు. 2014 సాధారణ ఎన్నికల పిదప జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలెట్టి 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల నాటికే టీడీపీ వ్యవస్థ తెలంగాణలో చాలా వరకు చెదిరిపోయింది. ఓటుబ్యాంకులు కకావికలమయ్యాయి. చిట్టచివర్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో వారంతా వీలున్నచోట సర్దుకొని, ఇతర పార్టీ ముద్రల్లోకి వెళిపోయారు. అలాంటి ఉనికి కనుమరుగు దశ నుంచి ఇప్పుడు ఉవ్వెత్తున లేశాం అని టీడీపీ జబ్బలు చరుస్తోంది. ఎంత చెప్పుకున్నా, ఇటీవలి ఖమ్మం సభ ఆ పార్టీ నిర్వహణా సామర్థ్య ఫలితమే! తెలంగాణ టీడీపీలో ఇప్పుడు బలమైన నాయకులు లేరు. సీఎం కేసీఆర్‌ పాత స్నేహం, ప్రత్యేక చొరవ వల్ల క్యాబినెట్లో, బయట కీలకంగా మారిన వారు కొందరు, పార్టీ మారి టీపీసీసీ పగ్గాలు దక్కిచ్చుకున్న రేవంత్‌ వెనుక కాంగ్రెస్‌లో కొందరు, స్వీయ ప్రయత్నాల ద్వారా బీజేపీ పంచన చేరి మరికొందరు తమ ఉనికి కాపాడుకుంటున్నారు. వీలయిన కొందరు పలుకుబడి ఎంజాయ్‌ చేస్తున్నారు. వీలుపడని వారు అసంతుష్టులుగానే ఆయా శిబిరాల్లో కొనసాగుతున్నారు. బాబు ఇప్పుడిచ్చే ‘ఘర్‌ వాపసీ’ పిలుపునందుకొని తిరగి టీడీపీ వైపు వచ్చేది ఎందరు? అన్నది పెద్ద ప్రశ్న. ఒకవంక సర్వేలతో బెదిరిస్తూనే మరోవంక సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఖాయం అన్నట్టు సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. క్రమంగా పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత దృష్ట్యా 30 శాతం వరకైనా అభ్యర్థులను మార్చక తప్పదనే ఆంతరంగిక చర్చ బీఆర్‌ఎస్‌లో సాగుతోంది. అందువల్ల, తెలంగాణలో బీజేపీ`టీడీపీ జతకడితే వారికి మేలేనేమో! అన్న ఊహా చర్చకు బాగానే ఉంది.

ఏపీపై ఆశ తెలంగాణలో ఘోష!

సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబు అంతటి అనిశ్చితి నాయకుడు కానరాడు. మసీదులు కూల్చే పార్టీ అని తిట్టిపోసిన బీజేపీతోనే మళ్లీ జతకట్టడానికి అమితంగా ఆయనే ఉబలాటపడుతున్నారు. ఏపీలో సీఎం జగన్మోహన్‌రెడ్డి నేతృత్వపు వైసీపీని ఎదుర్కోవడానికి తన బలం చాలదని తెలుసు. యువత క్రేజీ నాయకుడు పవన్‌కల్యాణ్‌ జనసేన, బీజేపీలతో తాను కలిసి ఏపీలో తిరిగి అధికారం చేపట్టాలన్నది బాబు ఆకాంక్ష. పవన్‌ కొంత ఊగిసలాటలో ఆయనకు సానుకూలంగా ఉన్నా, బీజేపీ మాత్రం బాబుతో చేతులు కలపడానికి ససేమిరా అంటోంది. బీజేపీకి ఏపీలో ఓట్లు లేవని, వారితో సీట్లు రావని బాబుకు తెలుసు. కానీ, వారితో పొత్తుంటే… జగన్‌ ని వైరిపక్షంలో చూడొచ్చు, బీజేపీ ఆశీస్సులు ఆయనకి అందకుండా చేసినట్టవుతుంది. ఎన్నికల వేళ పాలకపక్షంగా వైసీపీ ఆగడాలకు దిగితే, కేంద్ర సహాయంతో అడ్డుకోవచ్చన్నది ఆయన ఆశ. అందుకోసం… ఇక్కడ తెలంగాణలో పావులు కదుపుతున్నారు. బీజేపీకి ఇక్కడ తాను తోకపార్టీగా ఉంటూ, ఉడతాభక్తి సహాయపడతామనేది ప్రతిపాదన. తెలంగాణలో, ఢల్లీి స్థాయిలో ఇప్పటికే బీజేపీలో చేరి ఉన్న టీడీపీ నాయకులూ ఈ ప్రతిపాదనకు ఆ పార్టీలో ఊపిరిపోస్తారు. వీలయిన వేదికల్లో ‘అవును, టీడీపీతో కలిసి వెళితే మనకే మేలు, అప్పుడే కేసీఆర్‌ను కొట్టగలం…’ అంటూ బీజేపీ అగ్ర నాయకత్వం చెవిలో నూరిపోస్తారు. అలా ఇక్కడ రొట్టెవిరిగి నేతిలో పడితే, ఏపీలో పొత్తుకు దారి సుగమమౌతుందన్నది బాబు ఆశ. ఖమ్మం సభ తెలంగాణలో టీడీపీ బలానికి సంకేతమా? ఇరుకైన రోడ్డు కూడళ్లలో సభలు పెట్టి, తెలివి కూడిన డ్రోన్‌ ఫోటోలు, సానుకూల మీడియా కథనాల ద్వారా జనాధరణ అపారంగా పెరిగి పోతున్నట్టు నమ్మించగలరా? ఇలాంటి యుక్తుల వల్లే వికటించిన కందుకూరు సభ వంటి ఉపద్రవాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అన్నవి సమాధానం రావాల్సిన ప్రశ్నలే!

ఇద్దరికీ సంకటమే!

‘ఇంత జరిగాక ఇంకా తెలంగాణపై ఆంధ్రా పెత్తనమేంటి? బాబుకు ఇక్కడేం పని?’ అంటూ కిందటి ఎన్నికల్లోలా కేసీఆర్‌ ఇప్పుడు చంద్రబాబును తూలనాడలేరు. ఎందుకంటే, ఆయన ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ఏపీతో పాటు దేశమంతటికీ పోవాలాయె! బాబుకు ఎదురయ్యే ఇబ్బంది ఏమంటే, పాత నాయకుల్ని ఏం ఆశ చూపి తిరిగి టీడీపీలోకి లాగగలరు? ‘నేనొచ్చాను, మీరు రండి’ అంటే రావడానికి ఎందరు సిద్దంగా ఉన్నారు? కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రులతో సహా కొందరు హాయిగానే ఉన్నారు. స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకుల పెత్తనాల వల్ల ఇబ్బంది పడుతున్న వారు కూడా, ఏదైనా అక్కడే తేల్చుకోవడానికి సిద్దమవుతున్నారు తప్ప టీడీపీ వైపు పునరాగమనం ఆలోచిస్తున్నట్టు లేదు. అలా జరిగితే కేసీఆర్‌ తమను ఇబ్బందిపెడతారనేది వారి భయం. దాన్ని తట్టుకోవడానికి బీజేపీకి వెళ్లినా, అక్కడ శరణార్థులుగా కొన్ని సౌకర్యాలు లభిస్తాయి తప్ప టీడీపీలో అటువంటి భరోసా ఏమీ ఉండదని వారి వెనుకడుగు! కాంగ్రెస్‌లో ఉన్న టీడీపీ పాత నాయకులు కూడా ఒకటికి రెండు మార్లు ఆలోచిస్తారు. ‘వచ్చాం, మా శక్తియుక్తుల్ని చూపిస్తాం, ఏదైనా ఇక్కడే తేల్చుకుంటాం’ అని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.కొన్ని పరిణామాలు టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డి వ్యూహాన్ని బట్టి కూడా ఉంటాయి. పీసీసీ పీఠం ఇచ్చిన ఢల్లీి అధిష్టానం, సీనియర్లు తనకు సహకరించేలా సయోధ్య కురుర్చకపోతే ఆయన తీవ్రమైన నిర్ణయాలకూ తెగించవచ్చన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. తెలంగాణలో బాబు రాజకీయ కదలికలు బీఆర్‌ఎస్‌ ఓట్లకు ఎంత మేర గండికొడతాయనేదాని కన్నా, రేవంత్‌ విశ్వసనీయతను ఎంత దిగజారుస్తాయన్నదే చర్చనీయాంశమౌతోంది.

ముక్కోణం కోరుతున్నారు…

తెలంగాణ, ఏపీ… ఇద్దరు ముఖ్యమంత్రులూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీలు ఉండాలనే కోరుకుంటున్నారు. ఎవరు ప్రత్యామ్నాయమో తేలకుండా, బీజేపీ`కాంగ్రెస్‌లు సమ స్థాయిలో పోటీ పడాలని కేసీఆర్‌ ఆశిస్తారు. 2014 ఎన్నికలప్పుడు మిగతా చిన్న పార్టీలు ఎవరెవరితో జత కట్టినా… ప్రధానంగా పోటీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ మధ్య సాగింది. కేసీఆర్‌, పొన్నాల లక్ష్మయ్య, ఆర్‌.క్రిష్ణయ్యలలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి? అంటే, సహజంగానే కేసీఆర్‌ వైపు జనం మొగ్గుతారు… అలాగే మొగ్గారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇటీవల పవన్‌పై నేరుగా ప్రత్యక్ష విమర్శలకు దిగుతున్నారు. ఒక రకంగా అది పవన్‌ను లేపడమే! తనకున్న సమాచారం ప్రకారం బీజేపీ`టీడీపీలు కలవవు. ఇక వవన్‌ కల్యాణ్‌ కూడా, తనకు తాను ఎక్కువగా ఊహించుకొని టీడీపీతో కలువకుండా విడిగా పోటీ చేసేట్టయితే… ఆ ముక్కోణపు పోటీ తనకు లాభించి వైసీపీ నేత కల ఫలిస్తుంది. అదీ, ముక్కోణపు ఆశ వెనుక మూల సూత్రం!

 

-దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌,

Mail: dileepreddy.ic@gmail.com,

Cell No: 9949099802

Exit mobile version