Newsminute24

Pmmodi: మోదీ ఓబీసీ కాదన్న రాహుల్ మాటలు.. చిరంజీవి కుటుంబంపై సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది!

Nancharaiah merugumala senior journalist:

” నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్‌ గాంధీ చెప్పడం గతంలో కొణిదెల చిరంజీవి కుటుంబం ఒరిజినల్‌ కాపులు కాదని సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది! “

పుట్టుకతో నరేంద్ర మోదీ ఓబీసీ కాదని నిన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఒడిశాలో చెప్పారు. మోదీ జీ పుట్టింది జనరల్‌ కాస్ట్‌ లోనేని కూడా ఆయన వివరించారు. నిజమే మోదీ పుట్టిన 49 ఏళ్లకు 1999 అక్టోబర్‌ 27న గుజరాత్‌ ప్రభుత్వం ఆయన కులాన్ని (మోఢ్‌ ఘాంచీ–ఇతర ఉత్తరాది ప్రాంతాల్లో తేలీ) రాష్ట్ర ఓబీసీ జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆయన గుజరాత్‌ సీఎం కావడానికి కొన్ని నెలల ముందు మోఢ్‌ ఘాంచీలను కేంద్ర ప్రభుత్వ వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చారు. నరేంద్ర మోదీ అసలు సిసలు ఓబీసీ కాదని రాహుల్‌  పదే పదే ఈమధ్య చెబుతున్నట్టే– ఆంధ్రప్రదేశ్‌ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మెగా స్టార్‌ కొణిదెల చిరంజీవి కుటుంబం ఒరిజినల్‌ కాపులు కాదనీ, కొంత కాలం తర్వాత కాపులమని ఈ కుటుంబ సభ్యులు ప్రకటించుకున్నారని తోట, జ్యోతుల, పంతం, యర్రంశెట్టి వంటి ఇంటిపేర్లున్న కొన్ని కాపు కుటుంబాలకు చెందిన కొందరు కాపులు బయట సంభాషణల్లో ఎడాపెడా మాట్లాడడం మొన్న మొన్నటి వరకూ తెలుగు జనానికి తెలిసిన విషయమే. చిరంజీవి కొడుకు రామ్‌ చరణ్‌ చిత్తూరు జిల్లాలో మూలాలున్న అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి గారి మనవరాలు ఉపాసనా కామినేనిని పెళ్లాడే వరకూ ఇలాంటి ప్రచారమే కొణిదెల కుటుంబంపై కొనసాగింది. గతంలో బాబాసాహబ్‌ బీఆర్‌ అంబేడ్కర్, మాన్వవర్‌ కాశీరామ్‌ వంటి గొప్ప నేతలు దళిత కుటుంబాల్లో పుట్టలేదని, వారు నిజానికి బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టారనే దుష్ప్రచారం సాగేది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ కూడా ఇలాంటి కులోన్మాదుల దారిలో పయనించడం కాంగ్రెస్‌ పార్టీకి, భారతదేశానికి మేలు చే యదు.

Exit mobile version