Telanganaelections2023:తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుంది.మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు…కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడుతుండు. నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్ కు చెబుతున్నా..80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారు. 80కి ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
బోధన్ ఏసీపీ తన విధులు తాను చేసుకోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవవహరిస్తే డిసెంబర్ 9 తర్వాత ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. మా కార్యకర్తలను ఏసీపీ కొడుతున్నాడని మా నాయకులు చెబుతున్నారని ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. మా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు మా నాయకులు రెడ్ డైరీలో రాసుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరో ఆలోచన చేసుకోవాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
పదేళ్లలో కేసీఆర్ ఏ సమస్యను తీర్చలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. పోడు భూముల సమస్య తీర్చలేదు.. లంబాడాలను ఆదుకోలేదు మంచిప్ప ప్రాజెక్టును పూర్తి చేయ లేదని మండిపడ్డారు. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి పదేళ్లయినా హామీ నెరవేర్చలేదు. అందుకే కవితను ఇక్కడి రైతాంగం బండకేసి కొట్టారు అన్నారు. అందుకే అప్పటి నుంచి కేసీఆర్ ఈ ప్రాంత రైతులపై కక్ష కట్టిండ్రు అని ఆరోపించారు. ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న ఇక్కడి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాశారు. 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను పొట్టనపెట్టుకున్న బాజిరెడ్డి గోవర్ధన్ ను వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలన్నారు.
అయ్య బక్కోడు.. కొడుకు తిరుగుబోతోడు. ప్రజలను ఆదుకోవాలంటే ఒక్కరూ ముందుకు రారు.ఎర్రజొన్న రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయలేదు. పసుపు బోర్డు తెస్తానన్న గుండోడు ఎక్కడికో పోయిండు. అని రేవంత్‌రెడ్డి తెలిపారు. బక్కోన్ని బక్కోన్ని అని చెప్పుకునే కేసీఆర్… లక్ష కోట్లు దిగమింగాడు..10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేను పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత యువకులు నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమని అడిగారు. అధిష్ఠానం నన్ను కామారెడ్డిలో పోటీ చేయమని ఆదేశించిందన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎటువైపు ఉంటారో.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఉంటే 2 వేలే పింఛన్ ఇస్తారని అదే కేసీఆర్‌ను బొంద పెడితే ఇందిరమ్మ రాజ్యంలో 4 వేల పింఛన్ ఇస్తామన్నారు.