వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంచకట్టు. తలకు మూడు రంగుల పంచచుట్టి, కాళ్లకు బూట్లు వేసుకొని పాదయాత్ర కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను చూస్తే.. ప్రజలు, కాంగ్రెస్ వర్గీయుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తానని 2003లో వైఎస్ చేపట్టిన పాదయాత్ర రీతిలో నేడు భట్టి పాదయాత్ర కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని అడవిలో నివాసముంటున్న గిరిజన తండాలు, పెంకుటిల్లు లేని పూరి గుడిసెల్లో జీవిస్తున్న వారి వ్యధ, పోడు భూముల కోసం ఆశగా ఎదురు చూస్తున్న గిరిజనల గోసను, వారి గుండె చప్పుళ్లు భట్టి హృదయాన్ని కదిలింప చేస్తున్నాయి. అటవీ హక్కుల చట్టాల కోసం ఈ గిరిజనులు ఇంకెన్నాళ్లు పోరాటాలు చేయాలి అనే బాధ భట్టిలో కనిపిస్తుంది. ఈ పరిస్థితులను కళ్లారా చూసినపుడు కంటనీరు పెట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. మరో పక్క ప్రచార అర్భాటాలు లేకుండా.. ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగట్టడమే లక్ష్యంగా భట్టి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. హంగులు, ఆర్భాటాలు, మంది మార్భలం, అధికార దర్పం మచ్చుకైనా పాదయాత్రలో కనిపించడంలేదు. సామాన్యుడిలా టెంట్లో నివాసం, నవ్వారు మంచంపై నిద్ర, ప్రజలతో సహఫంక్తి భోజనాలు చేయడం పాదయాత్రలో హైలెట్‌గా నిలిచాయి.
పాదయాత్రలో ఎవ్వరైనా.. ఎప్పుడైనా, ఎక్కడికైనా పిలిస్తే వెళ్లి ప్రజల కష్టాలు వింటున్నారు. ఇందిరమ్మ రాజ్యం మళ్లీ వస్తుందని ప్రజల్లో భట్టి భరోసా కల్పిస్తున్నారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఆత్మగౌరవ లక్ష్యాలు కాస్త నీరుగారి పోయాయని అవేదన చెందుతున్నారు. తెలంగాణ వస్తే ప్రజల జీవన విధానం మారిపోతుందని భావించాం కాని.. ఇక్కడ చూస్తే మాత్రం.. బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణగా మారినట్లు కనిపిస్తుందని భావిస్తున్నారు. దశాబ్దాల పాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దొరల కుటుంబ కబంధహస్తాల్లో దోపిడీకి గురవతున్నట్లు భట్టి అవేదన చెందుతున్నారు. పీపుల్స్ పల్స్ భట్టితో మాట్లాడినపుడు.. జీవితంలో ఎప్పుడు చూడలేని, కనలేని, వినలేని పరిస్థితులు పాదయాత్రలో అనుభవంలోకి వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు నిరాశ నిస్పృహలో కూరుకపోయారని, ప్రజలకు అండగా నిలిచే నాయకుడి కోసం వారు ఆశగా ఎదురు చూస్తున్నారని అనిపించిందని ఈ పాదయాత్ర ద్వారా తెలిసిందన్నారు. దగాపడ్డా తెలంగాణలో ప్రజల బాగోగులను పట్టించుకునేదెవరు నే ప్రశ్నకు నేనున్నాంటూ సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క పాదయాత్రలో దూసుకవస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర స్పూర్తితో.. భట్టీ ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర చేపట్టి ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. హస్తం పార్టీ అభిమానులు, కార్యకర్తలతో పాటు ప్రజలు స్వచ్చంధంగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హాత్‌సే హాత్ జోడో అభిమాన్ యాత్ర కొనసాగింపుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టిన మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజారిహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16న ప్రారంభమైంది. ఈ పాదయాత్ర 41 నియోజకవర్గాల్లో 91 రోజుల పాటు కొనసాగి ఖమ్మంలో ముగియనుంది. ఈ పాదయాత్రను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ థాక్రె ప్రారంభించారు.
కదలించిన సంఘటనలు ఎన్నో..
పాదయాత్రలో నడుస్తున్న క్రమంలో తాను ఊహించని విధంగా గిరిజనులు, తండా వాసుల స్వాగతాలు ఎంతో సంతృప్తినిచ్చాయని ఆయన అన్నారు. ఈ పాదయాత్రలో బూచి మెట్ల క్యాంపుకు చెందిన వంద గిరిజన కుటుంబాలు పాదయాత్రకు స్వాగతం పలికారు. మా కోసం పాదయాత్ర చేస్తున్న మీరు మా ప్రాంతానికి రావాలని పట్టుబట్టి భట్టిని తీసుకెళ్లారు. 1951 అటవీ భూ హక్కు చట్టం ప్రకారం గిజనులకు 1987లో భూములను ఇచ్చారు. సాగు చేసుకుంటు జీవిస్తున్న గిరిజనుల నుంచి ఆ భూమిని ప్రభుత్వ అటవీ అధికారులు లాక్కున్నారు. వాటిని తిరిగి మీరే ఇప్పించాలని, ఇక్కడ మీరే నాగలి పెట్టి దున్ని విత్తనం వేయాలని వారు కోరినప్పుడు నా మనసు చల్లించిపోయిందని భట్టి కంటనీరు పెట్టుకున్నారు. వారి చేతి వంటకం తిన్నారు. దొరల రాజ్యంలో గిరిజన బిడ్డలు ఇన్ని బాధలు అనుభవిస్తున్నారని తెలిసినప్పటి నుంచి నా మనసు కలత చెందిందని ఆయన బాధపడ్డారు. నా పాదయాత్రలో 125 గిరిజన కుటుంబాలు కిలోమీటర్లు నడస్తుండడంతో ఆయన చలించిపోయారు.
పేదలతో ఉగాది జరుపుకోవాలనే అభిలాషతో పాదయాత్రను కొనసాగించిన భట్టికి ఒక వింత సంఘటన ఎదురయ్యింది. కెరమెర జరీమోడి గిరిజనులు ఆయనను తమ గ్రామానికి తీసుక వెళ్లారు. వారి అచార వ్యవహారాలతో అన్ని గింజలను ఉడికించి చేసి పెట్టిన వంటకం అందరితో కలిసి ఆరగిస్తున్నపుడు నా ఆనందానికి అవధులు లేవని ఆయన చెప్పారు. ఈ గ్రామంలో కూడ భూమలన్నింటినీ లాక్కున్నారని, వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారని గిరిజనులు వాపోయారని అన్నారు. చివరకు అడవిలోకి వెళ్లి ప్రకృతి సంపదగా లభించే పండ్లు ఫలాలను తీసుకోకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని వారు తన దృష్టికి తెచ్చినట్టు భట్టి చెప్పారు. చివరకు ఇంట్లో జరిగే పెళ్లికి అడవిలో నాలుగు పచ్చని చెట్ల కొమ్మలను కొట్టుకొని వచ్చి పందిరి వేసుకుంటే కూడా కేసులు పెడుతున్నారని గిరిజనులు వాపోతుంటే అసలు గిరిజనులు తెలంగాణలోనే ఉన్నారా.. అనే అనుమానం నాలో కలిగిందని ఆయన చెప్పారు. మరో గిరిజన గ్రామం మోదిలో కూడ గిరిజనులు ఇదే సమస్యలను చెప్పారు. దశాబ్దాలుగా ప్రకృతి ఒడిలో జీవిస్తు, అడవీ తల్లి అందిస్తున్న పండ్లు, ఫలాలను తింటు జీవించే గిరిజనులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఇబ్బందులను చూస్తే బాధకలిగిందని ఆయన అన్నారు. అభద్రత భావంలో జీవిస్తున్న గిరిజనులకు నా పాదయాత్ర ద్వారా ఏదో ఒక మంచి చేయాలని నిశ్చయించుకున్నట్టు తెలిపారు. గిరిజనుల కష్టాలు ఇలా ఉంటే మరోవైను…సింగరేణి కార్మికుల వెతలు మాటల్లో చెప్పలేమని భట్టి బాధపడ్డారు. జయ్‌పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో పని చేసే కార్మికులు కూడా వారి కష్టాలు చెప్పుకోవడానికి పాదయాత్ర వద్దకు వచ్చినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి తెలంగాణకు తలమానికం. ఈ సంస్థలో లక్షా ఐదు వేల మంది కార్మికులు పని చేసేవారు.. వారి సంఖ్యను కుదించారు. చివరకు సింగరేణిలో ప్రస్తుతం కేవలం 42 వేల మంది ఉద్యోగులు మాత్రమే మిగిలారు. కొత్త మైన్స్, ఓపెన్‌కాస్టులు ప్రైవేట్ కాంట్రాక్ట్‌లకు దారదత్తం చేస్తూ కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం తీరుపై పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఉందని భట్టి అన్నారు. ప్రభుత్వం సింగరేణి కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వలేదని కార్మిక కుటుంబాలు ఫిర్యాదులు చేస్తున్నారని భట్టి అన్నారు. ఇలా తన పాదయాత్రలో ప్రజలు స్వచ్చంధంగా వచ్చి వారి సమస్యలను తెల్పుతూ.. నన్ను అశ్వీదిస్తున్న తీరును చూస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయనే భావన కలిగిందని భట్టి విక్రమార్క పీపుల్స్ పల్స్‌తో తెలిపారు.
పాదయాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు…
పాదయాత్ర చేస్తూనే గిరిజనల తరుపున వారికి భూములపై హక్కులు కల్పించాలని, వారి కష్టాలకు ముగింపు పలకాలని దశాబ్ధాలుగా పోడు భూముల్లో జీవిస్తున్న వారిని రోడ్డు పాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని ఏప్రిల్ 3న జయ్‌పూర్ మండలం పోలంపల్లిలో సీఎం కేసీఆర్‌కు లేఖను విడుదల చేశారు. ఈ నెల 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న పక్షపాత వైఖరికి స్వస్తి పలకాలని కోరుతూ ఇందారం క్యాంపులో మీడియా సమక్షంలో ఈ నెల 7న లేఖను భట్టి విడుదల చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని, బగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఐటి హబ్‌గా మారిందని, ఐటీ సెక్టార్‌లో తెలంగాణ మరింతగా అభివృద్ది చెందేందుకు సహకరించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్రం విచారణ చేపట్టాలని భట్టీ లేఖలో డిమాండ్ చేశారు. వీటితోపాటు పాదయాత్రలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు, బాబు జగ్జీవన్‌రావు జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఓపెన్‌కాస్టుల పరిశీలిన, వివిధ సంఘాలతో వారి సమస్యల వినతి పత్రాల స్వీకరణ, మసీదులో రంజాన్ ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బగ్గు గనులను సింగరేణికి కేటాయిస్తామని, పేదలకుడబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని, తాము ఇంటి నిర్మాణాలకు నిధులిస్తామని పాదయాత్రలో భట్టీ హామీ ఇచ్చారు. 14వ తేదీ నిర్వహించే సభ గురించి పార్టీ శ్రేనులతో చర్చించారు.
అందరితో పాటు ఆయన కూడ..
పట్టుపరులపై పడుకోవాలనే ఆశలను వదిలి వేసి నవ్వారు మంచంపై అందరితోపాటు ఆయన విశ్రమిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే కాలకృత్యాలతోపాటు వేపపుల్లతో పళ్లు తోముకుంటున్నారు. పొలాల్లోని పంపు నీళ్లకింద పంచకట్టుకొని స్నానం చేసి ఆ రోజు పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. అల్పాహారం, భోజనం అందరూ కలిసి సామూహికంగా చేస్తున్నారు. తనను కలవడానికి వచ్చిన వారితో మనసువిప్పి ముచ్చటిస్తున్నారు, వారి సాదకబాధలు తెలుసుకుంటున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఒక సామాన్యుడి యాత్రలా కొనసాగుతోంది. పాదయాత్ర పొడవునా సోదరీమణులు ఇస్తున్న మంగళహారతులు, ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు, పల్లె, పట్టణాల్లో ప్రజలు వారు పడుతున్న ఇబ్బందులను చెబుతున్నప్పడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారా..అని ఆవేదన కలుగుతుదని ఆయన పీపుల్‌పల్స్‌తో బాధపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలను తీర్చడమే లక్ష్యంగా పని చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
============
బి. రాజ శేఖర్ ( సీనియర్ జర్నలిస్ట్)