కళ్లకు కట్టిన ‘క్లాస్’

.
కెప్టెన్ లియోనల్ మెస్సీ (10), మరో ఫార్వర్డ్ జులియన్ అల్వరెజ్ (9) మిగతా తొమ్మిది మందితో కలిసి చేసిన మాయ లాటిన్ అమెరికా దిగ్గజం అర్జెంటీనా ను ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ కు చేర్చింది. క్వార్టర్ ఫైనల్ లో మరో మేటి జట్టు బ్రెజిల్ ను ఓడించి సెమీస్ చేరి సంచలనం సృష్టించిన క్రొయేషియా ఏ దశలోనూ అర్జెంటీనా ముందు నిలువలేక పోయింది. ఆట ఆద్యంతం అర్జెంటీనా ఆటగాళ్లు ప్రశాంతంగా, అపార మనోధైర్యంతో, ఏ తత్తరపాటు లేకుండా ఆటను రక్తి కట్టించారు. చిన్న చిన్నవే అయినా…ఎంతో ఖచ్చితత్వపు పాస్ లు, వ్యూహాత్మక కదలికలతో ఆటను తాము ఎంజాయ్ చేయడమే కాకుండా ప్రేక్షకులకు ఆహ్లాదం కలిగించారు.

ప్రత్యర్థి కన్నా బలమైన జట్టు అయివుండీ, తెంపరితనం కాకుండా సాధికారత, మెచూరిటీని అడుగడుగునా ప్రదర్శించి 3-0 తో గెలిచారు. పెనాల్టీ స్టోక్ ద్వారా మొదటి గోల్ కెప్టెన్ మెస్సీ చేశాక మరో రెండు, కళ్లు మిరుమిట్లు గొల్పే గోల్స్ జెర్సీ నెంబర్ 9 అల్వరెజ్ చేసి తిరుగులేని ఆధిక్యాన్ని జట్టుకు జమకూర్చాడు. ఆయన చేసిన తొలి గోల్….. మైదానం మధ్యలోంచి ఒక్కడే అతి వేగంగా బంతిని వెంట తెచ్చుకుంటూ, అడ్డగించిన ఓ అరడజన్ మందిని తెలివిగా తప్పించుకొని, ముఖ్యంగా క్రొయేషియా డిఫెన్స్ ను తుత్తునియలు చేసి, గోల్ కీపర్ ను బోల్తా కొట్టి బంతిని గోల్ పోస్ట్ లోకి అలవోకగా పంపిన తీరు మహాద్భుతం. ఇక చివరి గోల్…. రైట్ ఫ్లాంక్ నుంచి ముగ్గురు డిఫెండర్లను తప్పించి, మెస్సీ కళాత్మకంగా ఇచ్చిన ఒక మెరుపు పాస్ ను రెప్ప పాటు లో గోల్ గా మార్చి ప్రత్యర్థులనే కాదు స్టేడియంలోని వేలాది మందిని నివ్వెర పరిచాడు. విశ్వవ్యాప్తంగా నాలాంటి కోట్లాది మంది ఫుట్బాల్ ప్రియులు బ్రెజిల్ నుంచి ఆశించి, చూడలేకపోయిన ‘క్లాస్’ ను ఈ మ్యాచ్ లో అర్జెంటీనా ఓ 90 నిమిషాల పాటు కళ్లకు కట్టినట్టనిపించింది. ఈ ఊపు చూస్తుంటే….. ఆఫ్రికా కొత్త సంచలనం మొరాకో, డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ లలో రెండో సెమీస్ విజేత ఎవరైనా కప్పు ఈ సారి ఆర్జెంటీనాదేనెమో? అనిపించింది. నిద్రపోతే పోయింది గానీ, మన అర్ధరాత్రి దాటాక ఈ ఆనందపు సమయం తన’లైవ్’ ద్వారా పంచిన ‘జియో సినిమా’కు థాంక్స్!

====================

Dilip Reddy, people’s pulse director

Related Articles

Latest Articles

Optimized by Optimole