Telangana:
తెలంగాణలో ఇటీవల జరుగుతున్న కొన్ని కీలక పరిణామల వెనుక అదృశ్య శక్తుల కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో పేదలకు విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలను దూరం చేయడానికి కూడా కొందరు వెనుకాడడం లేదనే చర్చ నడుస్తోంది. ఉన్నత విద్యా సంస్థల మూసివేత వెనుక, ఆరోగ్యశ్రీ నిలిపివేత వెనుక కంటికి కనిపించని రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
పేదల ప్రయోజనాలను పణంగా పెడుతున్నరు!
ఇటీవల తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు కాలేజీల మూసివేతకు పిలుపునిచ్చాయి. తదుపరి ప్రభుత్వ చర్చలతో సమ్మెను విరమించుకున్నాయి. అయితే, వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కాలేజీలకు రూ.5,500 కోట్లు బకాయిలు పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉన్నత విద్యాసంస్థలకు నిధుల విడుదలకు విడతలవారీగా టోకెన్లు జారీ చేస్తోంది. అయితే ఉన్నపళంగా వారు కాలేజీలు మూసివేస్తున్నట్టు నిర్ణయించడం వెనుక కొందరి ఉద్దేశపూర్వక రాజకీయ ప్రమోయం ఉందనే అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
రాజకీయ ప్రయోజనాల కోసం 13 లక్షల మంది పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడానికి కూడా కొందరు వెనుకాడకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అందుకే, కాలేజీలను తిరిగి దారికి తీసుకురావడాని గతంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అధ్యయనం చేస్తోందనే చర్చ నడుస్తోంది. వసతులు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను దోచుకుంటున్న కాలేజీలపై ప్రభుత్వం త్వరలో చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది. విద్యా ప్రమాణాలు పాటించకుండా కాలేజీలు నడుపుతున్న కొన్ని యాజమాన్యాలు రాజకీయ శక్తులకు పరోక్షంగా సహకరిస్తూ తమపై కుట్ర చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
సమ్మెకు కొందరే ఎందుకు..?
ఇక ఆరోగ్యశ్రీ నిలిపివేత వెనుక కూడా కుట్ర ఉందని ప్రభుత్వం భావిస్తోంది. నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం నెలవారీ రూ.100 కోట్లు చెల్లిస్తోంది. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో రూ.1,779 కోచెల్లించింది. పెండింగ్ రూ.1,400 కోట్ల బకాయిల్లో గత సోమవారం ఉదయమే రూ.100 కోట్లు విడుదల చేసింది. ఆస్పత్రుల డిమాండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం సానుకూలంగా స్పందిస్తోంది.
ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను సగటున 22 శాతం మేర పెంచింది. కొత్తగా 120కిపైగా ఆస్పత్రులను ఎంప్యానెల్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చేస్తున్నా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేయాలని నిర్ణయించడం వెనుక అదృశ్య శక్తలు ప్రమేయం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. రాష్ట్రంలో 470కిపైగా ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉంటే 150 మాత్రమే ఆరోగ్యశ్రీని నిలివేస్తున్నట్టు ప్రకటించడం దీనికి నిదర్శనమని ఉదాహరిస్తోంది.
మరోవైపు గ్రూప్-1 నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఒక్కోపోస్టును రూ.3 కోట్లకు అమ్ముకుందనే ప్రచారాన్ని కొన్ని శక్తులు తెరపైకి తెచ్చాయి. దీనిపై ర్యాంకర్ల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. రూ.3 కోట్ల పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తమకు తెలియదని, రాజకీయ స్వలాభం కోసం తమ పిల్లల భవిష్యత్తును, తమ కష్టాన్ని పణంగా పెట్టవద్దని వేడుకున్న దృష్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఇలా ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల వెనుక అదృశ్య శక్తుల ప్రమేయం ఉన్నదని ప్రభుత్వం అనుమానిస్తోంది. రాజకీయ స్వార్థం కోసం పేదలకు విద్య, ఉపాధి, వైద్యం అందకుండా చేయడం ద్వారా ఆయా శక్తులు పైశాచిక ఆనందం పొందుతున్నాయనే చర్చ జోరుగా నడుస్తోంది. తద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు కొన్ని శక్తులు తెరలేపాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.