Newsminute24

సీఎం సన్నిహిత సంస్థ ఇండోసోల్ కంపెనీకి వేల ఎకరాల భూ సంతర్పణ: నాదెండ్ల

APpolitics: ‘అడ్డగోలు వ్యవహారాలు… అడ్డదిడ్డమైన నిర్ణయాలతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలు విస్తుగొలిపేలా ఉన్నాయన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రజాధనాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తన అనుకున్న కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి బరి తెగించారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ కంపెనీకి చేసిన భూ కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చట్టాలను, నిబంధనలను గాలికొదిలేసి మరీ ఆ కంపెనీకు లబ్ధి చేకూర్చడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందన్నారు. కేవలం 1 సంవత్సరం 9 నెలలు 12 రోజుల కిందట పుట్టిన కంపెనీకి వేలాది ఎకరాల భూమిని అడ్డగోలుగా కట్టబెట్టడం ఒక ఎత్తయితే, దానికి వేల కోట్ల రూపాయల ప్రోత్సాహాకాలను ప్రభుత్వం చట్టాలను సవరించి మరీ కల్పించడం విస్తుగొల్పిస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ పాలన – అవినీతి జమానా’ కార్యక్రమంలో భాగంగా  రోజుకొక అవినీతి తంతును బయటపెట్టే క్రమంలో భాగంగా బుధవారం మనోహర్ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గరలో పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ద్వారా సాగిన భూ సంతర్పణను బయటపెట్టారని మనోహర్ స్పష్టం చేశారు.

కంపెనీ కోసం ఏకంగా కొత్త విధానమే తెచ్చారు..

ఇండోసోల్ కంపెనీకి అనుచిత లబ్ధి కల్పించేందుకు ప్రభుత్వం అడ్డదారులు తొక్కిందన్నారు మనోహర్. ఏకంగా ఓ పారిశ్రామిక పాలసీను ప్రణాళిక ప్రకారం రూపొందించడం విశేషమని ఎద్దేవ చేశారు. ఈ పాలసీ కేవలం ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ఒకటి రెండు, కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా రూపొందించారన్నారు. న్యూ ఇండస్ట్రీయల్ ల్యాండ్ పాలసీ పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం వల్ల పరిశ్రమలకు సులువుగా భూములు ఇవ్వడానికి, పరిశ్రమలు వేగవంతంగా నెలకొల్పడం కోసం, ఉపాధి అవకాశాలు పెంచడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారని అన్నారు. అయితే దీనివల్ల సాధారణ పారిశ్రామికవేత్తలకు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా విధానాలను రూపొందించారన్నారు. 2022 నవంబరు 3వ తేదీన క్యాబినెట్ దీనిపై సంతకాలు చేసిందని.. కొత్త పాలసీ వల్ల ఎవరు లబ్ధి పొందారు.. ఏ పరిశ్రమలు వచ్చాయి.. పెట్టుబడులు ఎంత.. పరిశ్రమలు వచ్చాయా అంటే అదీ లేదు.. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న ఇద్దరికో, ముగ్గురికో ఉపయోగపడేలా పాలసీను తెచ్చారని ఆరోపించారు. గతంలో ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్న వారికి ఉపయోగపడేలా దీన్ని రూపొందించడం విశేషమని..ముందుగా ఎంవోయులు చేసుకున్న కంపెనీ అంటే అది ఇండోసోల్ కోసం అని చెప్పాలని మనోహర్ డిమాండ్  చేశారు.

 

 

 

 

Exit mobile version