Newsminute24

Moviereview: వీరాంజనేయులు విహారయాత్ర రివ్యూ..జ్ఞాపకాలే కథలు.. కథలే మనం..!

విశీ(వి.సాయివంశీ):

అనుభవాలే జ్ఞాపకాలు.. జ్ఞాపకాలే కథలు.. కథలే మనం! 

చాన్నాళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాను నింపాదిగా చూశాను. Skip & Forward బటన్ నొక్కకుండా పూర్తిగా చూడగలిగాను. మరీ ముఖ్యంగా ‘తెలుగు’ నటులున్న సిసలైన ‘తెలుగు’ సినిమాను చూశాను. అదే ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ‘ETV Win’ Streaming Appలో ఉంది.

ఇది చాలా సింపుల్‌గా కనిపించే చాలా కాంప్దికేటెడ్ కథ. ఈ మాట ఎందుకంటున్నానంటే, మహాభారతం, రామాయణం లాంటి భారీ కథల్లో బోలెడన్ని పాత్రలు, ఉపకథలు, ట్విస్టులు గట్రా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ శ్రమ పడకుండానే కథ ముందుకు వెళ్తుంది. కానీ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథకు సీన్స్ రాయడం అంటే మహా కష్టం! ఆసక్తికరంగా ఉండాలి, లాజిక్ కుదరాలి, కన్విన్స్ చేయాలి, కథ దారి తప్పకుండా చూసుకోవాలి.. అబ్బో! అది కత్తి మీద సాము గరిడీ. ఈ సినిమాలో ఆ పని చాలా బాగా చేశారు. ఇదిగో ఇక్కడ బోర్ కొడుతుందేమో అని ఫీలయ్యేలోగా కథను మరో మంచి మలుపు తిప్పుతూ ముందుకు నడిపారు. మొదలెంత బాగుందో, చివరిదాకా అంతే బాగుంది.

నరేష్ గారి నటన గురించి కొత్తగా చెప్పాలా? పాత్రను పరమాద్భుతంగా పండించారు. కామెడీని కరెక్ట్‌గా చేయగలిగిన నటుడు ఏ పాత్రనైనా అవలీలగా చేయగలడని మరోసారి నిరూపించారు. సీనియర్ నటి శ్రీలక్ష్మి గారి కెరీర్లో ఈ సినిమా ఒక మైలురాయి అవుతుంది. పక్కా! ఇన్నాళ్లూ ఆమెనొక కామెడీ యాక్టర్‌గానే చూసిన ప్రేక్షకులు ఇకపై గొప్ప నటిగా చూస్తారు. ఇంత గొప్ప ఆర్టిస్ట్‌ ప్రతిభను వెలికి తీసే పాత్ర ఇప్పటికైనా దొరకడం ఆనందం. సినిమాను చాలా సీన్లలో ఆమే నడిపించారు. ఒకరకంగా ఆమే ఈ సినిమాకి హీరో. ఆ పాత్రకోసం ఆమెను ఎన్నుకోవడంతోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు. నటీనటులంతా వారి పాత్రల్లో సహజంగా ఒదిగిపోయారు. ఫ్రస్ట్రేషన్‌తో తండ్రిని తిట్టి, ఆ తర్వాత పశ్చాత్తాపం చూపే కొడుకుగా రాగ్‌మయూర్ బాగా చేశారు. చాలా అరుదుగా దొరికే పాత్ర ఇది. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. కూతురిగా ప్రియ వడ్లమాని తన పాత్రకు బాగా సూటయ్యారు.

ఈ సినిమాలో ఒక్క డబుల్ మీనింగ్ డైలాగు లేదు. ఒక్కచోట కూడా బాడీ షేమింగ్ ఊసు లేదు. ఒక్కటంటే ఒక్క అనవసరపు మాట లేదు. ఇంటిల్లిపాదీ కూర్చుని హాయిగా చూడదగ్గ సినిమా. కెమెరా పనితనం భలే బాగుంది. చిన్న ఫోన్లోనే ఫ్రేమ్స్ ఇంత బాగుంటే, థియేటర్లో గనక చూస్తే ఇంకెంత బాగుంటాయా అనిపించింది. అంత బాగుంది సినిమాటోగ్రఫీ! సంగీతం సందర్భానుసారంగా కుదిరింది. ప్రతి పాటా పాడుకునేలా మధురంగా ఉంది. ఎమోషనల్ సీన్స్‌లో నేపథ్య సంగీతం Awesome.

అన్నింటినీ మించి బ్రహ్మానందం గారి గొంతు పలికించిన భావాలు. లాజవాబ్! చివర్లో ఆయన చెప్పిన మాటలు ఇంకా మనసులో తిరుగుతున్నాయి. ‘అనుభవాలే జ్ఞాపకాలు.. జ్ఞాపకాలే కథలు.. కథలే మనం! Will be remembered as Stories, nothing more.. nothing less’. ఎంత గొప్ప మాట. కుడోస్! దర్శకుడు ఇలాంటి మంచి కథలతో మరిన్ని సినిమాలు తీయాలి. తీస్తాడు!

Exit mobile version