Nancharaiah merugumala senior journalist:
” ఇందిరమ్మ రాజ్యం ఊసెత్తకుండానే….మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?”
కాంగ్రెస్ ప్రతిపక్ష నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్–మేలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి (దేశంలోనే తొలిసారి) ‘ఇందిరమ్మ రాజ్యం తీసుకొద్దాం’ అనే నినాదాన్ని విజయవంతంగా వాడుకున్న విషయం ఆయన కూతురు వైఎస్ షర్మిలకు తెలుసు. అలాగే 2023 నవంబర్–డిసెంబర్ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి నాటి వైఎస్ దారిలో ‘ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం’ అంటూ ఎన్నికల ప్రచారం చేశారు. అంతకు ముందు తెలంగాణలో ‘రాజన్న రాజ్యం తీసుకొస్తా’ అని చెబుతూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి పాదయాత్ర చేశాక షర్మిలమ్మకు విషయం బోధపడింది. ఇటలీ రోమన్ కేథలిక్ కుటుంబంలో పుట్టిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని హస్తినలో కలిసిన ప్రొటెస్టెంట్ క్రైస్తవ విశ్వాసి షర్మిలమ్మ హలలూయా, ఆమెన్ అనే రెండు పదాలను ఒకేసారి పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు దక్కాయనే విషయం తెలియగానే ‘తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిని ఆ బ్లాక్‌మెయిలర్‌కు ఇవ్వవద్దు.’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏకైక చెల్లెలు కాంగ్రెస్ హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. తన తండ్రి బాటలో ‘ఇందిరమ్మ రాజ్యం’ ఊసెత్తినందుకైనా రేవంత్ రెడ్డిని ఆమె మన్నించలేదు.
‘దేశంలోనే రాజన్న రాజ్యం’ రావాలా?
50 ఏళ్ల వయసులో గురువారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈమెను ఓ రిపోర్టర్, ‘ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యం ఎప్పుడొస్తుంది?’ అని ప్రశ్నించగా, ‘మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలి,’ అని షర్మిలమ్మ డొంక తిరుగుడు జవాబు చెప్పడం ఎందరికో ఆశ్చర్యం కలిగించింది. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తన తండ్రి కల, తన ఆకాంక్ష అని చెబుతూనే–దేశంలోనే రాజన్న రాజ్యం రావాలి–అని షర్మిల ప్రకటించడం నిజంగా సాహసమే. అలాగే ‘ఒక క్రిస్టియన్‌గా చెబుతున్నా. మణిపూర్‌లో జరుగుతున్న ఘోరం నన్ను ఎంతో బాధించింది. రెండు వేల చర్చిలను ధ్వంసం చేశారు. 60 వేల మంది నిరాశ్రయులయ్యారు,’ అని ఆమె బహిరంగంగా ప్రకటించడం కూడా వైఎస్ రాజారెడ్డి మనవరాలిగా, మరో వైఎస్ రాజారెడ్డి తల్లిగా చేసిన రెండో సాహసమే. దైవ భక్తి ఎక్కువగా ఉన్న హిందూ కుటుంబంలో పుట్టి, పెళ్లి కారణంగా క్రైస్తవరాలిగా మారిన తల్లి విజయమ్మగాని, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాని బహిరంగంగా తాము క్రైస్తవులమని ప్రకటించడం ఇంత వరకు జరగలేదనే చెప్పొచ్చు. 1992–93 ప్రాంతంలో నేదురుమల్లి జనార్దనరెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉండగా ‘రాష్ట్రంలో రెడ్డి రాజ్యం, రెడ్ల ఆధిపత్యం నడుస్తోంది,’ అంటూ నాటి కడప ఎంపీ, అసమ్మతి కాంగ్రెస్ నేత డా.రాజశేఖరరెడ్డి– తాను రెడ్డిని కాదని, అల్పసంఖ్యాకవర్గానికి చెందినవాడినని విలేఖరులకు చెప్పారు. ఒక పక్క రాజన్న రాజ్యం కావాలంటూనే తాను క్రిస్టియన్ అని షర్మిలమ్మ మీడియాకు చెప్పడం చూస్తే–ఆమె తన తండ్రి డా.వైఎస్ దారిలో నడిచే ప్రయత్నం చేస్తోందని అర్ధమౌతోంది. క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరుసలేంకు వెళ్లే క్రైస్తవ భక్తులకు ప్రయాణ ఖర్చుల్లో రాష్ట్ర సర్కారు రాయితీ ఇస్తుందని 2004 వేసవిలో ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొన్నాళ్లకు రాజశేఖరరెడ్డి ప్రకటించడం కూడా అప్పటికి ఎంతో రాజకీయ సాహసం కిందే లెక్క. 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెల్చుకున్నట్టు ప్రకటించిన రోజున సాక్షి టీవీ రిపోర్టర్ ఒకరు లోటస్ పాండ్‌లోని షర్మిలమ్మ ఇంటికొచ్చి, ‘ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విజయంపై మీ అభిప్రాయం ఏంటి?’ అని ప్రశ్నించగా, ‘నాయన మంచి పనులే కాంగ్రెస్‌ను గెలిపించాయి,’ అని ఆమె వ్యాఖ్యానించారు. వెంటనే ఆ విలేఖరి తన గొట్టాన్ని ఆమె భర్త నోటి దగ్గరకు జరిపి అదే ప్రశ్న వేయగా, ‘దేవుడు దయామయుడు, కరుణామయుడు. నీతిమంతుడు కూడా,’ అని బ్రదర్ మొరుసుపల్లి అనిల్ కుమార్ అనగానే భర్త వింత భాష్యానికి షర్మిల నవ్వు ఆపులేకపోయారు. చివరికి కాస్త బిగ్గరగానే నోరు తెరిచి నవ్వి భర్త అనిల్ దేవుని భక్తిపైన, దేవుని వాక్యంపై ఉన్న శ్రద్ధాసక్తులపైనా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు రాజన్న కూతురు.