తెనాలిలో జ‌న‌సేన నాయ‌కుల అరెస్ట్ అప్రజాస్వామికం : నాదెండ్ల మ‌నోహ‌ర్‌

తెనాలి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమ‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్‌. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయం. అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా… వచ్చినా పరదాల మాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేముంటుందని ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ముస్తాబుల కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిపి రోగులను ఇబ్బందుల పాలుచేశారని మండిప‌డ్డారు. నాయకులను అరెస్టు చేయడం, ప్రజలను బయటకు రానీయకపోవడం, షాపులు మూయించడం… చూస్తుంటే రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారు అనిపిస్తోందని అనుమానం వ్య‌క్తం చేశారు. తెనాలి ఎంతో ప్రశాంతమైన పట్టణం. కళలు, సంస్కృతికి నెలవైన తెనాలిలో ప్రజలు ప్రశాంతత కోరుకుంటారు. అలాంటి పట్టణంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో భయానక వాతావరణం సృష్టించడమే వైసీపీ మార్కు పాలనగా అభివ‌ర్ణించారు నాదెండ్ల.

You May Have Missed

Optimized by Optimole