Janasena: కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి వేతుకుంటు వస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి పదవి వస్తేనే పొత్తులు పెట్టుకోవాలని కొందరు అంటున్నారు.. గత ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాలు గెలిచి ఉంటే ఆ వాదనకు బలం చేకూరేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి వరించాలి తప్ప వెంపర్లాడనని తేల్చిచెప్పారు. మా గౌరవానికి భంగం కలగకుండా ఉంటే కలసి ముందుకు వెళ్తామని, వైసీపీ దాష్టికాలను బలంగా ఎదుర్కొంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రేసులో నేను లేను అంటే కొందరికి ఆనందంగా ఉంటుందని చెప్పారు. నన్ను ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీ, బీజేపీలను అడగనన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చేస్తుంటే చూస్తూ ఊరుకోమని.. పొత్తులపై కూర్చుని మాట్లాడుకుంటాం.. అవసరం అయితే ఒప్పిస్తామన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారితో సమావేశం తర్వాత అదే విషయం వెల్లడించినట్టు తెలిపారు. ముందస్తు ఎన్నికలు ఎన్నికలు వస్తే జూన్ నుంచి ఇక్కడే ఉండి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానన్నారు.
కాగా గురువారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వమన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఏడు శాతం ఓటు సాధించిందన్నారు. మాకు బలమున్న నియోజకవర్గాల్లో 30 శాతం కూడా ఓట్లు వచ్చాయని తెలిపారు. 2014లో పార్టీ పెట్టిన నెల రోజుల్లో అభ్యర్ధుల కోసం వెతుకులాట ఇష్టం లేకే రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని టీడీపీ-బీజేపీల కూటమికి మద్దతిచ్చామని జనసేనాని పేర్కొన్నారు.
జనసేన బలం రెట్టింపు అయ్యింది
2019లో 137 స్థానాల్లో పోటీ చేసి పార్టీని పూర్తి స్థాయిలో నిలబెట్టామన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పార్టీ మీద విమర్శలు చేస్తున్న వారు ఎవరూ అప్పుడు నాకు నిలబడలేదన్నారు. జనసేనకు సలహాలు ఇద్దామనుకున్న వారు గత ఎన్నికల్లో 30-40 స్థానాలు గెలిపించలేకపోయారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవి మనం డిమాండ్ చేయాలి అంటే మనం కనీసం 30-40 స్థానాలు గెలిచి ఉండాలని అన్నారు. పెద్దన్న పాత్ర వహించడం అంటే బాధ్యత వహించడమని.. రాజకీయం అంటే కులానికి సంబంధించిన వ్యవహారం కాదాని.. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని పవన్ స్పష్టం చేశారు.