cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood:

లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం..

తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి ఉన్న సున్నితమైన సంఘర్షణలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా తమ సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా, తెలంగాణ ఫోక్ గాయని నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నవీన్ యెర్నేని, కేఎల్ దామోదర ప్రసాద్, ఎస్‌కేఎన్, బాపినీడు, ధీరజ్ మొగిలినేని, దర్శకులు మెహర్ రమేష్, చందూ మొండేటి, సాయిరాజేష్, వేణు ఊడుగుల తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, చిత్రబృందం ఈ సినిమాపై గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. టైటిల్‌లోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఇడుపు కాయితం’ ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా ఆడబిడ్డ ఉన్న ప్రతి ఇంటికి దగ్గరగా ఉండే కథ అని పలువురు వ్యాఖ్యానించారు.

ప్రియదర్శి మాట్లాడుతూ, “ఇది తెలంగాణ నేపథ్యంతో రూపొందుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యే భావోద్వేగ కథ. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ, “ఫోక్ సింగర్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందిన నేను, ఇప్పుడు హీరోయిన్‌గా ఒక బలమైన పాత్రతో వస్తున్నాను. కథ వినగానే నాకు ఎంతో నమ్మకం కలిగింది. ఇది నా జీవితంలో మరచిపోలేని అవకాశం” అని పేర్కొన్నారు.

నిర్మాత తబిత సుకుమార్ మాట్లాడుతూ, “తెలంగాణ అమ్మాయిగా ఈ కథ నన్ను వెంటనే కదిలించింది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ కథ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది” అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, “ప్రాంతీయతను దాటి ప్రతి కుటుంబానికి సంబంధించిన అంశాన్ని ఈ సినిమా స్పృశిస్తుంది. కథే ఈ ప్రాజెక్ట్‌లోకి అందరినీ తీసుకొచ్చింది. ‘ఇడుపు కాయితం’ ఒక మంచి తెలుగు సినిమా అనిపించేలా ఉంటుంది” అని తెలిపారు.

దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ, “మన సంస్కృతి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేక్షకుల మద్దతు మా బలంగా నిలుస్తుంది” అన్నారు.

చిత్రబృంద సభ్యులంతా ఈ సినిమాను తెలంగాణ నేటివిటీతో పాటు  భావోద్వేగాలను మిళితం చేసిన కథగా అభివర్ణించారు. ‘బలగం’ తరహాలో కుటుంబ సంబంధాలపై చర్చకు దారితీసే చిత్రంగా ‘ఇడుపు కాయితం’ నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

నటీనటులు: ప్రియదర్శి, నాగదుర్గ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు.

సాంకేతిక బృందం:
దర్శకత్వం – వంశీరెడ్డి దొండపాటి
నిర్మాత – బన్నీ వాస్
సంగీతం – సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం – ఎంఎన్ బాల్ రెడ్డి
ఎడిటింగ్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ – ఆశిష్ తేజ
కాస్ట్యూమ్స్ – అశ్వత్ భైరి

Optimized by Optimole