దేశంలో హైవేలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేలపై కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. వీటివలన కాలుష్యం తగ్గి సామర్థ్యం పెరిగే అవకాశమున్నందున హైవేల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.ఈ నాలుగు లైన్ల రహదారులపై 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను ఉపయోగించడంతో పాటు.. టోల్ ప్లాజాల్లో సోలార్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహించాలని కేంద్ర నిర్ణయించినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను.. ఢిల్లీ- ముంబైల మధ్య నిర్మించే అవకాశం ఉండే అవకాశముందన్నారు.
కాగా ఎలక్ట్రిక్ హైవేలు రైల్వేలైన్లను పోలి ఉంటాయి. విద్యుత్ లైన్ల సాయంతో వాహనాలు నడిచే వీలుంటుంది. ప్రస్తుత తరుణంలో పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల వలన వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు నడవాలని కోరారు గడ్కరీ. అన్ని జిల్లా కేంద్రాలను జాతీయ రహదారులతో అనుసంధానిస్తామని కేంద్రమంత్రి తేల్చిచెప్పారు.అంతేకాక రవాణ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు డిజిటలైజ్ చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.