విద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చవద్దు: పవన్ కళ్యాణ్

విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విద్యాలయాల ప్రాంగణాలను..  సీఎం జగన్ ఫ్లెక్సీలతో  నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందన్నారు. సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందన్నారు జనసేనాని.

ఇక తొమ్మిది దశాబ్దాలపైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మేరకు  ఆమోదయోగ్యమైనవ? తెలపాలని పవన్ డిమాండ్ చేశారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సి.ఆర్.రెడ్డి లాంటి గొప్పవారు ఉప కులపతులుగా బాధ్యతలు నిర్వర్తించిన సరస్వతి ప్రాంగణం ఆంధ్ర విశ్వవిద్యాలయం.. ఆ విద్యా వనం నుంచి ఎందరో మేధావులు వచ్చారని.. అలాంటి చోట చిల్లర రాజకీయాలు చేయడం ఏంటని పవన్ ప్రశ్నించారు. పార్టీ ఫ్లెక్సీలు కట్టించేవాళ్ళు కీలక బాధ్యతల్లో ఉంటే.. ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ ఆలోచించాలన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోనూ ఇదే పోకడ కనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.విశ్వ విద్యాలయ ఉప కులపతులకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ.. ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించాలని పవన్ సూచించారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole