నాగోబా జాత‌ర విశిష్ట‌త‌.. పురాణా గాథ‌..

 

ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. సర్పజాతిని పూజించడమే ఈ జాతర ప్రత్యేకత. రాజ్ గోండ్ ఆది వాసీ తెగ‌లోని మేస్త్రం వంశ‌స్తులు ప్ర‌తి ఏడాది ఈజాత‌ర‌ను నిర్వ‌హిస్తారు.ఈ రోజున తమ ఆరాధ్య దైవం ‘ నాగోబా ‘(శేష నారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనులు నమ్మకం. తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌డ్‌, మ‌హారాష్ట్ర ,ఒరిస్సా నుంచి ప్ర‌జ‌లు వేలాదిగా ఈ జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చి మొక్కులు తీర్చుకుంటారు.

పురాణాగాథ‌…

నాగోబా చ‌రిత్ర‌కు సంబంధించి ఓక‌థ ప్రాచుర్యంలో ఉంది.పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు క‌ల‌లో క‌నిపించి స‌ర్పం రూపంలో ఆమె గ‌ర్భాన జ‌న్మిస్తాని మాట ఇస్తాడు. అన్న‌ట్టుగానే జ‌నించి..రాణి త‌మ్ముడి కూతురు గౌరిని వివాహం చేసుకుంటాడు. అత్త ఆజ్ఞ మేర‌కు గౌరి..భ‌ర్త‌ను బుట్ట‌లో పెట్టుకుని గోదావ‌రికి ప‌య‌న‌మవుతుంది. ప్ర‌యాణం మ‌ధ్య‌లో ఓచోట పాము ఉడుం రూపంలో ప్ర‌త్య‌క్ష్య అవుతుంది. అప్ప‌టినుంచి ఆప్రాంతం ఉడుంపూరు ప్ర‌సిద్ధికెక్కింది. అనంత‌రం గౌరి ధ‌ర్మ‌పురి వ‌ద్ద గోదావ‌రిలో స్నానం చేయటానికి వెళ్ల‌గా ఆమెను చూసిన నాగేంద్రుడు..మ‌నిషి రూపంలోకి మార‌తాడు.అప్ప‌డు గౌరికి వ‌ర‌మిచ్చి.. పేరు,ప్ర‌తిష్ట‌లు కావాలా? సంప్ర‌దాయం కావాలా? తేల్చుకోమ‌ని ప‌రీక్ష పెడ‌తాడు. అప్పుడు ఆమె సంప్ర‌దాయాల‌ను లెక్క‌చేయ‌న‌నే స‌మాధానమిస్తుంది. స్వామి తిరిగి పాముగా మార‌తాడు.అనంత‌రం గౌరి గోదావ‌రిలోని స‌త్య‌వ‌సి క‌లిసిపోయింద‌ని.. ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారుతుంది. ఆ తర్వాత నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని పురాణా గాథ‌. ఇక నాగేంద్రుడు వెళ్లిపోయిన కెస్లాపూర్ గుట్ట వ‌ద్ద భక్తులు నాగోబా దేవాల‌యాన్ని నిర్మించారు. ప్ర‌తి ఏటా
పుష్య‌ మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు అక్క‌డ ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం.

పూజా విధానం

జలంతో నిండిన కలశాన్ని ‘పూసిగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూర్ మండలం గురిజాల గ్రామానికి తెస్తారు. ఒక రోజు త‌ర్వాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్లకు తరలి ఒక దినమంతా పండుగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇంద్రాదేవి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్ర‌వెల్లి పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడి నుంచి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద నాలుగు రాత్రులు , ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తీసుకొస్తారు. ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి , పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రిచెట్టు దగ్గర బావినీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారుచేస్తారు. ఆలయం పక్కనున్న పూల మందిరాన్ని అల‌క‌రించి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలోని నాగదేవతను అభిషేకిస్తారు.

గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. భాజా భజంత్రిలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్ర‌మాల‌ను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు , మొలకలు , పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్రమంలో పాట్లాల్ , గయిక్ వాడి , హవాల్ దార్ మొదలైన వారు పాల్గొంటారు.

భేటింగ్ కియ్ వాల్ లేదా వధూవరుల పరిచయ వేదిక..

మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్‌లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటి దాకా వారు నాగోబా దేవుణ్ని చూడడం , పూజించడం నిషిద్ధం.

వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజసామాక్షిగిని పట్టుకొని , కాలినడకన బయలుదేరతారు. కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్’ అని పిలుస్తారు. వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని (బోడుందేవ్) జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు.

దర్భార్

జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత , చరిత్ర ఉన్నది. 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరిగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించాడు. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు ,  స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమండాఫ్ ను ఆదిలాబాద్‌ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు , కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని నిశ్చ‌యించాడు.

Optimized by Optimole