‘జర్నలిజం చేయాలని ఎందుకు అనుకున్నావ్?’
ఏదో తెలుగు భాషపైన అభిమానం, పట్టు ఉన్నాయి గనుక
‘పట్టు అంటే, ఎట్లా వచ్చింది ఏమైనా చదివావా?’
ఆ… చదివాను, తెలుగు సాహిత్యం.
‘ఏం సాహిత్యం చదివావు?’
రామాయణ, భారత, భాగవతం వంటి ప్రాచీన పద్య సాహిత్యం నుంచి ఆధునిక వచన సాహిత్యం వరకు ఏవేవో చదివా.
‘….. ఊ, ఎవరెవరి పుస్తకాలు చదివావేంటి?’
నన్నయ, పోతన, పెద్దన, శ్రీనాథుడి నుంచి విశ్వనాథసత్యన్నారాయణ, గురజాడ, శ్రీశ్రీ, చలం, ఆత్రేయ… ఇలా చాలా మందివే చదివా.
‘విశ్వనాథ వారివి ఏం చదివావు?’
చెలియలి కట్ట, ఏకవీర, రామాయణ కల్పవృక్షం, వేయిపడగలు…..
‘నువ్ వేయిపడగలు చదివావా……!?!’
ఆ, చదివా…..!
‘ఏముంది చెప్పు, అందులో?’
ధర్మారావని………. …..
సాహిత్యమే కాకుండా నక్సలిజం, తెలంగాణ వెనుకబాటుతనం, మద్యం వంటి దురలవాట్లు, యువశక్తి నిర్వీర్యానికి కారణాలు, ఇంగ్లీషులో చో చో పరిజ్ఞానం……. ఇలా గుడ్డెద్దు చేలోపడి, మేస్తూ వెళ్లినట్టు 55 నిమిషాల పాటు సాగింది ఇంటర్వ్యూ. వచ్చిందే జీవితంలో రెండోసారి ఉద్యోగానికి అంటే, ఇక ఇంటర్వ్యూ అనేది బతుకులో తొలిసారి. ‘అమ్మో! ఈ నాగయ్య చౌదరి ఎవరో గానీ, మహా ఘటికుడే ఉన్నాడు’ అని మనసులోనే అనుకుంటూ, ఆ ప్రాంగణం వీడాను. దోమలగూడలోని మేనమామ ఇంటికి వెళ్లడానికి, సోమాజిగూడ ‘ఈనాడు’ ఆఫీస్ నుంచి ఖైరతాబాద్ బస్‌స్టాప్ వరకూ నడిచొచ్చా. బస్ కోసం నిరీక్షిస్తున్నా….. పక్కన నిలబడి ఒక నడివయస్కుడు తిరగేస్తున్న ‘సితార’ సినీపత్రిక పైన పడ్డాయి కళ్లు. గాలికి కవర్‌పేజీ వేళాడుతుంటే, ఇన్‌సైడ్ కవర్ పేజీ, బ్లాక్ అండ్ వైట్ ఫోటో క్యాప్షన్ ఒకటి నన్ను గగుర్పాటుకు గురి చేసింది. ఆ ఫోటో కింద ఇలా రాసి ఉంది… ‘కళ్లు చిత్ర దర్శకుడు రఘుకు మెమెంటో అందిస్తున్న రామోజీరావు’. బాప్‌రే బాప్… ఇప్పటిదాకా దాదాపు గంటసేపు నన్ను ఇంటర్వ్యూ పేరిట తికమక పెట్టడానికి చూసింది స్వయంగా రామోజీరావే! అంతవరకు రామోజీరావు ఫోటో కూడా చూసి ఎరగని మనం, ఫక్తు ‘జోగిపేట’ బాపతు కావడం వల్ల ఇది జరిగింది. నాతో నెలరోజులుగా కరెస్పాండెన్స్ చేసున్న పర్సనల్ డిపార్టుమెంట్ ఇంచార్జీ ‘నాగయ్య చౌదరి’యే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనుకుంటున్నా. కానీ, ఆయన స్వయానా రామోజీరావు అని కనీసం ఊహించలేకపోయా! (అదీ ఒకందుకు మంచిదయిందేమో! తడుముకోకుండా, బింకంగా, అడిగిన ప్రతి ప్రశ్నకూ సాధికారిక స్వరంతో సమాధానాలిచ్చా). ‘హమ్మయ్య, ఏదేదో మాట్లాడేశా, ఏమనుకున్నాడో పెద్దాయన’ అని నాలోనాకొక అంతర్మధనం! రాదులే ఉద్యోగం అనుకున్నా. ఏమైతేనేం, ఉద్యోగానికి పిలిచారు, వెళ్లా, పదహారున్నరేళ్లు బుద్దిగా పనిచేసుకున్నా, స్వయంగా దగ్గరికి వెళ్లి, గౌరవంగా ఆ పెద్దాయనకు కృతజ్ఞతలు చెప్పి మరీ వచ్చా, అది వేరే విషయం.
ఇక అసలు విషయం, మా నాగయ్య చౌదరి. సౌమ్యుడు, విజ్ఞానవంతుడు, మాట తూలని నెమ్మదస్తుడు, ఇతరుల పట్ల మర్యాద మీరని పద్దతైన పెద్దమనిషి ఇవాళ ఉదయం మరణించారని తెలిసి ఎంతో బాధ అయింది. పర్సనల్ డిపార్టుమెంటులో ప్రతిదీ మెదడుతో ఆలోచించడం కాకుండా కొన్ని విషయాలను హృదయంతోనూ గమనించి, అందుకనుగుణంగా నడిచిన మానవతావాది. చల్లని మనసు. అందుకే, నాకు ఆయన పట్ల అపార గౌరవం. ఈనాడు సంస్థాగత కట్టుబాట్లు, పరిమితులు, సరిహద్దుల గడులను కూడా దాటి నా పట్ల వాత్సల్యం, అభిమానం చూపినవాడు. నేను సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఉన్నపుడు, ‘దిలీప్ గారూ, మీరేమి వస్తారులే గానీ, మధ్యాహ్నం ఉంటారా? నేనే మీ ఆఫీస్ కు వస్తా‘ అని ఒక అసిస్టెంట్‌ను వెంటబెట్టుకొని, లెడ్జర్ పుస్తకాలు కూడా తెచ్చుకొని పీఎఫ్, ఫామ్16 వంటి వాటికి సంబంధించి నా సంతకాలు తీసుకువెళ్లిన సహృదయుడు. మొన్న కరుకు కొరోనా కష్టపు రోజుల్లో, మా పాత మితృడు కరీం చనిపోయిన రోజు, వారి ఇంటి వద్ద నివాళించడానికి నే వెళితే, అక్కడ కలిసిందే, నాగయ్య చౌదరి చివరి చూపు.
సహృదయ నేస్తానికి నా కన్నీటి నివాళి
================
ఆర్.దిలీప్ రెడ్డి
పీపుల్స్ పల్స్ డైరెక్టర్