ఎన్నికలకు ఏడాది ముందరే పొత్తుల పొద్దు పొడుస్తోంది. రణానికి నగారా ‘రణస్థలం’ నుంచి మోగించారు జనసేనాని పవన్ కల్యాణ్! ఎన్నికలకు ఇంకా పదహారు నెలల కాలం ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి, ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్దమౌతున్నట్టు పవన్ ప్రకటించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పొత్తుకు మౌలికంగా జనసేన సంసిద్దమే అని సంకేతాలు ఈ వేదిక నుంచి వెలువడ్డాయి. పొత్తు ఏదైనా ‘గౌరవప్రదంగా’ ఉండాలనే ఒక షరతును మాత్రం మంద్ర స్వరంతో వినిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో జరిపిన ఇటీవలి భేటీ తర్వాత వెలువడ్డ తాజా ప్రకటనను బట్టి, ఈ విషయంలో స్థూలంగా వారి మధ్య ఒక అవగాహనో, అంగీకారమో కుదిరినట్టే భావించాలి. ఆయన ప్రసంగాన్ని లోతుగా పరిశీలించి`విశ్లేషిస్తే ఇది వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపిస్తోంది. విమర్శిస్తాయని తెలుసు కనుక, పొత్తుల్లో తప్పులేదని, రాక్షస పాలనను అంతమొందించేలా నియంతను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పోరాడాల్సిందేననీ సూత్రీకరిస్తూ ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను…’ అని చాన్నాళ్లుగా చెబుతున్న తన మాటల దిశలో, అందుకు కొనసాగింపుగానే తాజా ప్రతిపాదనలు చేశారు. దీనికి జనామోదం ఉందనే భావన కలిగించేలా… ‘మీరు చెప్పండి, ఒంటరిగా పోవడానికి చాలా శక్తి కావాలి, అది మీరిస్తారా? అలా వెళదామంటారా? ఔనంటే హర్షద్వానాలతో స్పందించండి’ అని సభాముఖంగా కోరారు. ఆ తర్వాత.. పొత్తుల ఆవశ్యకత, బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి పొత్తులతో వెళ్లాల్సిన అవసరాన్నీ ఆయన నొక్కి చెప్పారు. వ్యూహాన్ని తనకు వదిలిపెట్టాలని సభాముఖంగా ప్రకటించారు. పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆత్మహత్యా సదృశమన్న భావన వచ్చేలా కూడా ఆయన మాట్లాడారు. ‘ఇప్పుడు ఒంటరిగా పనిచేసి, పోరాడి… వీర మరణం చెందాల్సిన అవసరం లేదు’ అని పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చారాయన.
మాటల్లో పరిపక్వత
ఇదివరకటిలా కాకుండా జనసేన నాయకుడిలో, కార్యకర్తలు, అభిమానుల్లో ఒక తేడా స్పష్టంగా కనబడుతోంది. పార్టీ విధానాల నుంచి అనుసరించే వైఖరి, ప్రత్యర్థుల్ని ఖండిరచే పద్దతి వరకు మాటల్లో కొంత వివేచన, పరిపక్వత కనిపిస్తున్నాయి. ‘ముక్కుసూటితనంతో నేరుగా వెళ్లటం వల్ల, గోడకు గుద్దుకొని ముక్కు నుజ్జునుజ్జవుతుంది’ అని చెప్పినా, పరవాలేదనే పంథా ఇదివరలో పవన్ అనుసరించేవారు. కానీ, ఇప్పుడు తేడా వచ్చింది. పొత్తులకు అనుకూలంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, సాధారణ జనం నుంచి మద్దతు కూడగట్టేందుకు యత్నించిన సంకేతాలు ప్రసంగాల్లో, మీడియా సమావేశాల్లో గమనించవచ్చు. ‘2019 ఎన్నికల్లో కనీసం 54 చోట్ల వ్యతిరేక ఓట్లు చీలడం వల్ల వైసీపీ గెలిచింది. అది వారి సాంకేతిక విజయమే! అలా మీరు ఎన్నిసార్లు గాయపడతారు?’ అంటూ పార్టీ శ్రేణులు, అభిమానుల్ని ప్రశ్నించారు. అదే క్రమంలో…. ‘రెండు చోట్ల ఓడిపోయానని నన్ను అవమానిస్తూ మాట్లాడతారు. కానీ, వాటిని నేను యుద్దంలో గాయాలుగానే భావిస్తాను’ అన్నారు. పూర్తి స్థాయి ప్రజామద్దతు, అంతటా లభించినపుడే పొత్తులు లేకుండా పోటీ చేయగలమని కూడా ఆయన వివరణ ఇచ్చారు. కార్యకర్తలు, అభిమానుల్లోనూ అత్యధికులు ఆచితూచి మాట్లాడుతున్నారు. కదిలిస్తే, ‘నిజమే, కేవలం మా యువతరం మద్దతు మాత్రమే సరిపోదని మాకూ తెలుసు. ఈ సారి మా తల్లిదండ్రులను, ఇతర పెద్దల్ని కూడా మాలా ఆలోచింప జేసేట్టు ప్రయత్నిస్తున్నాం, వారిలో మార్పు తెస్తున్నాం’ అని స్పందిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబునూ తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడిన పవన్ అభిమానులు, ఓట్లు చీలనివ్వొద్దన్న పవన్ నినాదానికే ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. స్థానిక నేతలెవరు? గెలుస్తారా? ఓడుతారా? వంటివేవీ వారి దృష్టిలో లేవిప్పుడు. ఉన్నదొకటే…. పవన్ నంబర్`1 గా ఉండాలంతే! 18 సీట్లు గెలిచీ అన్న చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు, ఎన్నికల్లో ఓటమి పాలై కూడా ఎనిమిదేళ్లుగా తమ నాయకుడు పార్టీ నడుపుతున్నాడనే భరోసా పవన్‌పై కార్యకర్తలు వ్యక్తం చేశారు. ఆయన కూడా ‘శ్వాస ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటా’ అని, ‘ఆయనది ఊగిసలాట ధోరణి’ అనే విమర్శకులకు చెక్ పెట్టారు.
వ్యూహాత్మక అడుగులు…
పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా ఉన్నట్టు జనసేన నాయకత్వ స్థాయిలో జరిగిన చర్చల్ని బట్టి తెలుస్తోంది. కనీస ఉమ్మడి కార్యక్రమం (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్) మాత్రమే కాకుండా అన్ని స్థాయిల్లో రాజకీయ ఎజెండా ఉండాలనే వ్యూహం రచిస్తున్నట్టుంది. పొత్తంటే ఈ ఒక్క ఎన్నిక దృష్టితోనే ఉండొద్దని, 175 అసెంబ్లీ స్థానాలతో పాటు, 25 లోక్‌సభ, ఎప్పటికప్పుడు భర్తీ అయ్యే రాజ్యసభ`శాసనమండలి, 26 జడ్పీ అధ్యక్ష స్థానాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ (కార్పొరేషన్లు`మున్సిపాలిటీలు), సర్పంచుల వంటి స్థానిక సంస్థల పోస్టులతో సహా అన్ని స్థాయిల్లో ఉండాలనే స్థూల ప్రతిపాదన జనసేపార్టీ నాయకత్వానికి ఉన్నది.
నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ దామాషా పద్దతిలో పొత్తు అంగీకారాలుండాలని, తద్వారా అన్ని స్థాయిల్లో బలోపేతమయ్యే ఆస్కారం ఉంటుందన్నది జనసేన భావిస్తోంది. ఎమ్మెల్యే టిక్కెట్టో, ఎంపీ టిక్కెట్టో ఒక పార్టీకి దక్కితే, దాని పరిధిలో ఉండే మిగతా ముఖ్యమైన ఇతర రాజకీయ అవకాశాలు భాగస్వామ్య పక్షానికి దక్కాలి, ఇదే పద్దతి అన్ని స్థాయిల్లో అనునసరించాలి. దీని వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి, వీటి ప్రయోజనాలు 2029 ఎన్నికల్లో స్పష్టంగా నెరవేరుతుందనే ధీమాలో జనసేన నాయకత్వం ఉంది.
కేంద్రంలో రెండు పర్యాయాలు, యూపీఏ`1 (2004`09), యూపీఏ`2(2009`14) ప్రభుత్వాల విజయాల్లో వ్యత్యాసం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కనీస ఉమ్మడి కార్యక్రమంతో కమ్యూనిస్టులు బలమైన భాగస్వాములుగా ఉన్న యూపీఎ`1 ఇచ్చినంత ప్రజారంజక పాలన యూపీఏ`2 ఇవ్వలేకపోయింది. యూపీఏ`1 లోనే గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం వంటి మంచి నిర్ణయాలు జరిగాయి. పొత్తు భాగస్వాముల మధ్య సయోధ్య, పరస్పర గౌరవ భావన కూడా ముఖ్యమే! 2014 ఎన్నికల తర్వాత, చంద్రబాబు నాయుడు ‘అంతా నావల్లే, నేనే గెలిచి, గెలిపించా…’ అన్నట్టు మాట్లాడటం, వ్యవహరించడం వల్లే టీడీపీ`జనసేన మధ్య సయోధ్య చెడిరది.ఆ పరిస్థితి రానీయొద్దని ఇరుపక్షాలు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పరిస్థితుల గమనిస్తే స్పష్టమౌతోంది.
పెరిగిన రాజకీయ దృష్టి
పొత్తులపై విస్పష్ట వైఖరిని జనసేన అదినేత వ్యక్తం చేసినప్పటికీ బీజేపీ విషయంలో ఒక వ్యాఖ్య కూడా చేయకపోవడం ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబుతో తన భేటీపై పాలకపక్షం భయపడుతోందని, తాము యోచించే పొత్తులోని హేతుబద్దతకు అదే పెద్ద సంకేతమన్నట్టు ఆయన మాట్లాడారు. బాబుతో తన భేటీని బట్టి బేరాలు కుదిరాయనే కొందరివి పిచ్చి కూతలని విమర్శిస్తూనే, ‘ఏపీ భవిష్యత్తు గురించి బాబుతో చర్చించాన’ని స్వయంగా వెల్లడిరచారు. వాటాలు, సీట్ల పంపకాల గురించి చర్చించలేదని చెప్పినా, పొత్తుల అంశం ప్రస్తావనకు రాలేదని మాత్రం అనలేదు. పొత్తుపై రేపు రాబోయే విమర్శలకూ ఆయన సన్నద్దమైనట్టు మాటల్నిబట్టి తెలుస్తోంది. ‘పొత్తులు ఎందుకో…’ రాష్ట్ర ప్రజలకు నచ్చేలా, వారు ఆమోదించేలా జనసేన చెప్పాల్సి ఉంటుందేమో కానీ, రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబుకో, ఆర్కే రోజాకో సమాధానం చెప్పాల్సిన పని అయితే లేదన్న ధీమా ఆయన మాటల్లో వ్యక్తమైంది. పవన్ వ్యక్తీకరణలో కొంత స్పష్టత పెరిగింది. అలాగే కార్యకర్తలు, అభిమానుల్లోనూ… వ్యక్తిపూజ దశ దాటి, రాజకీయ దృష్టితో ఆలోచించే ఖచ్చితత్వం కొంత పెరిగినట్టు రణస్థలంలో కనిపించింది. 2014లో జనసేన టీడీపీ కి మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో జనసైనికులెవరూ ఆర్థికంగా చితికిపోయిన దాఖలాలు లేవు. కానీ, రాష్ట్రంలో అనేక మంది జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీకోసం ఇప్పటికే ఎంతో ఖర్చు చేశారు. వీరిని సంతృప్తి పరచాల్సిన బాధ్యత జనసేన నాయకత్వం ఉంటుంది.
బాబు ` టిడిపి నాయకుల వైఖరీ ముఖ్యమే!
టీడీపీ ` జనసేన మధ్య రేపు కుదిరే పొత్తులో చంద్రబాబు ఏ వైఖరి అనుసరిస్తారన్నదీ ముఖ్యమే! 2014 లో కుదిరిన సయోధ్య, 2019 లో కుదరకపోవడానికి బాబు తనయుడు ‘నారా లోకేష్ వ్యవహార శైలియే’ కారణమని అంటారు. అందుకేనేమో, పవన్ తో ఇటీవల తాను జరిపిన రెండు ముఖ్య భేటీల్లో ‘నారా లోకేష్’ లేకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు. అంత మాత్రాన చంద్రబాబును ` పవన్ సంపూర్ణంగా నమ్ముతారు అనుకోవడానికి లేదు. బాబు విషయంలో ఆయన అభిప్రాయాలు ఆయనకున్నాయి. రణస్థలంలో ‘…..ప్రజాకంటకులను ఎదుర్కోవడానికి, ఒకోసారి మనకు పడని శత్రువులతోనైనా కలవాల్సిందే’ అన్న పవన్ మాటల్లో లోతైన అర్థం ఉంది.
బీజేపీతో మిత్రపక్షంగా ఉండి కూడా, తిరుపతిలో లోక్‌సభకు, ఆత్మకూరు, బద్వేలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో పవన్ గానీ, ఆయన పార్టీ ముఖ్యులు గానీ ప్రచారానికీ వెళ్లలేదు. జనసేన నేతలు, పవన్‌కళ్యాణ్ బీజేపీ కేంద్రనాయకత్వం ఇచ్చే రోడ్‌మ్యాప్‌కోసం వేచి చూస్తున్నామని అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఇప్పటివరకు ఆ రోడ్‌మ్యాప్ బిజెపి కేంద్ర నాయకత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీతో ఇటీవల విశాఖపట్నంలో దాదాపు 8 సంవత్సరాల తరువాత భేటీ అయ్యారు. ఆ భేటీలోని అంశాలు బయటకు రాకపోయినా ఆ భేటీ తరువాత అయినా జనసేన`బీజేపీ కలిసి ఉమ్మడిగా చేపట్టిన కార్యక్రమాలు లేవు. జనసేన`బీజేపీతో వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్తుందా లేక కేవలం తెలుగుదేశంతో మాత్రమే అన్నది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు వేచి చూస్తున్నారు. ఈ విషయం కొద్ది నెలలోనే స్పష్టమౌతోంది.
టిడిపి` జనసేన పార్టీలు ఎంత సయోధ్య, పరస్పర అవగాహనతో పొత్తుల ప్రక్రియను ముందుకు తీసుకు వెళతారనేది ఇప్పుడే ఊహించడం కష్టం. జనసేన కిందస్థాయి కార్యకర్తలూ పూర్తి రాజకీయ చైతన్యాన్ని సంతరించుకునే కృషిలో ఉన్నారనడానికి రణస్థలం సభకు వచ్చిన ఒక నడివయస్కుడి మాటలే తార్కాణం. నగదు బదిలీతో పెద్దఎత్తున అమలు చేస్తున్న తమ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని వైసీపీ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న నమ్మకాన్ని నీరుగార్చేలా, తమపై మోపుతున్న ధరలు, పన్నుల భారంపై ఆయన ఘాటైన వ్యాఖ్య చేశారు. ‘ఏం పథకాలండీ, రేగు పండిచ్చి తాటికాయ లాక్కుపోతున్నాడు’ అన్నది ఆయన ముక్తాయింపు.
=================
-ఆర్.దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,