BiharElection: బీహార్‌ ఎన్నికలు… ఎన్నెన్నో ప్రశ్నలు..!

BiharElection:

బీహార్‌ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్‌ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బీహార్‌ రాష్ట్రానికి పెద్ద పీఠ వేసి అందరికంటే ముందుగానే బీజేపీ అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. గత ఎన్నికల వరకు ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యు)దే పైచేయిగా ఉండేది. కానీ, ఐదేళ్లలో రాజకీయ సమీకరణాలు మారాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ క్రమంగా బీజేపీ ఎన్డీఏలో పైచేయి సాధించింది. నితీష్‌ ఎన్డీయేతో పలుమార్లు తెగదెంపులు చేసుకుని కూటమి పొత్తు ధర్మాన్ని తప్పడంతో జేడీ(యు) ప్రతిష్ట దెబ్బతింది. నితీష్‌ ఇప్పటికీ ముఖ్యమైన నాయకుడే అయినా కూటమిని శాసించడంలో బీజేపీ ఆయన ప్రాబల్యాన్ని తగ్గించింది. ఈ పరిస్థితుల మధ్య 8వ సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్‌కు బహుశా ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు! దీనికి తోడు ఆయన ఆరోగ్యంపై కూడా కథనాలు వస్తున్నాయి.

బీజేపీ అగ్రవర్ణాలపై తన పట్టును కాపాడుకుంటూనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రెండు దశాబ్దాలుగా జేడీ(యు) ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీలను, దళితులను తన వైపు తిప్పుకుంది. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో, పరిపాలన సంస్కరణలతో లబ్దిపొందిన ఈ వర్గాలను ఆకర్షించడం ద్వారా బీజేపీ తన ‘సామాజిక’ కూటమిని బలోపేతం చేసుకుంది. సామాజిక న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకులు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయింది. ఆ పార్టీ తమ గుర్తింపును కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడుతున్న వేళ అది కూడా బీజేపీకి సానుకూలంగా మారింది.

బీహార్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక సౌకర్యాల కల్పనపై బీజేపీ దృష్టి పెట్టినట్టు బయటకు కనబడుతున్నప్పటికీ వివిధ కుల సమూహాలను తనవైపు తిప్పుకోవడానికి బీజేపీ అంతర్గతంగా ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తుంది. పలు సందర్భాల్లో జేడీ(యు)తో విభేదాలొచ్చినా రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటం వల్ల బీజేపీ తన హిందుత్వ భావజాలాన్ని బీహార్‌ మట్టిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేయగలిగింది. హిందూ సంఘటితం చుట్టే రాజకీయాలు నడుపుతూ మొట్టమొదటిసారి ఈ ఎజెండాతోనే ఎన్నికలు నడిచేలా బీజేపీ వ్యూహాలను రచిస్తుంది. ఒకవైపు బీహార్‌ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూనే… దానికి హిందుత్వ అంశాన్ని మిళితం చేస్తున్న బీజేపీ బీహార్‌లో సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించగలిగింది.

హిందుత్వ ప్రయోగంతో మతపరమైన భావోద్వేగాలను పెంచడంతో పాటు, కులాల ఆధారంగా విడిపోయిన బీహార్‌ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. దీంతో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌లు శాసించిన కుల ఆధారిత రాజకీయాలు ఇప్పుడు బలహీనపడే అవకాశం ఉంది. చారిత్రాత్మకంగా బడుగు బలహీన వర్గాల ఐక్యతను కాపాడాలనే సిద్దాంతంతో పని చేస్తున్న ‘ఇండియా’ కూటమికి ఇది అతిపెద్ద సవాలుగా మారబోతోంది. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండడంతో పాటు వ్యూహాత్మకంగా సృష్టిస్తున్న హిందూ కులాల ఐక్యతతో ఈసారి బీహార్‌లో ఎన్నికలు మునుపెన్నడూ లేనివిధంగా రసవత్తరంగా జరగనున్నాయి. బీహార్‌ రాజకీయ చరిత్రలో ఈ ఎన్నికలు కీలక మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయి.

2020 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బీజేపీ, జేడీ(యు), ఎల్జేపీ, హిందుస్తానీ ఆవామ్‌ మోర్చా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 43.17 శాతం ఓట్లు రాగా, ఆర్జేడీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, వికాసశీల్‌ ఇన్సాన్‌ పార్టీలతో కూడిన మహాఘట్‌బంధన్‌ (ఎంజీబీ) కూటమికి 38.75 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్ల వ్యత్యాసం ఇకముందు కూడా కొనసాగితే ఎన్డీఏ 2025లోనూ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి. కానీ 2020 తర్వాత వీఐపీ మహాఘట్‌బంధన్‌లో చేరడం, ఎల్జేపీ ఎన్డీఏతో జతకట్టడం, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ జేడీ(యు)లో విలీనం కావడంతో ఈ సారి లెక్కలు మారవచ్చు.

ఎంజీబీ విజయం సాధించాలంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3 శాతం అధికంగా సానుకూల ఓట్లు సాధించాలి. దీంతో ఎంజీబీకి 41 శాతానికి పైగా ఓట్లు రావడం వల్ల ఎన్డీఏ 40 శాతం దగ్గరే ఆగిపోతుంది. బీహార్‌లో 18 శాతం ఉన్న ముస్లింలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు. 2020లో ఎంజీబీకి 76 శాతం ముస్లిం ఓట్లు రాగా, ఎన్డీఏకు ముస్లిం ఓట్లు కేవలం 5 శాతమే వచ్చాయి. యాదవ్‌-ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, బీజేపీ వైపు ఉన్న బీసీలను, దళితులను తనవైపు తిప్పుకోగలిగితే ఎంజీబీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. అయితే రాష్ట్రంలో పుట్టుకొచ్చిన కొత్త పార్టీలు ఎన్డీఏ, ఎంజీబీ కూటముల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ జన్‌ సూరజ్‌ పార్టీ నుంచి ఎంజీబీకి ముప్పు పొంచి ఉంది. 2024లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం ఆయన ఇటు ఎంజీబీ, అటు జేడీ(యు) ఓట్లను గణనీయంగా చీల్చేవచ్చు. ఆయన ఆర్జేడీ, జేడీ(యు) పార్టీలపైనే విమర్శలతో విరుచుకుపడుతుండటంతో బీజేపీకి పరోక్షంగా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల ఆధారిత రాజకీయాలు కాకుండా అభివృద్ధి తరహా రాజకీయాలు చేస్తానని పీకే చెప్తున్నారు. లాలూ, నితీష్‌ల వృద్ధాప్యం, పాశ్వాన్‌ మరణంతో ఏర్పడిన స్పేస్‌ను తాను భర్తీ చేయాలనుకుంటున్నారు. ఈ పెద్ద నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించడం వల్ల తానే ప్రధాన ప్రత్యామ్నాయం అవుతానని ఆయన ఆశిస్తున్నారు. బీహార్‌ యువత అభిమానం సంపాదించుకున్న ఆయన తేజస్వి యాదవ్‌ను తక్కువ అంచనా వేస్తున్నారు. పీకే తన రాజకీయ వ్యూహాలతో దశాబ్దాలుగా కుల రాజకీయాలతో పాతుకుపోయిన నాయకులను అభివృద్ధి పేరుతో పడగొట్టగలరా అనేది పెద్ద సందేహమే. ఎందుకంటే, 243 నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి బలమైన, నమ్మకమైన అభ్యర్థులు ఆయన పార్టీకి లేరు.

జనసూరజ్‌ పార్టీయే కాకుండా ఇతర చిన్న పార్టీలు కూడా శాసనసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్‌ మాజీ సీనియర్‌ నేత ఐ.పి.గుప్తా ‘ఇండియన్‌ ఇంక్విలాబ్‌ పార్టీ’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రెండు కులాలపై ఈ పార్టీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఐపీఎస్‌ అధికారిగా బీహార్‌లో ప్రత్యేక పనితీరు కనబర్చిన మహారాష్ట్రకు చెందిన శివ్‌దీప్‌ లాండె ‘హింద్‌ సేన’ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ మాజీ ఐపీఎస్‌ అధికారి బీహార్‌ను తన కర్మభూమిగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు నితీష్‌కు సన్నిహితునిగా ఉన్న ఆర్‌సీపీ సింగ్‌ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ జేడీ(యు) మళ్లీ పొత్తు పెట్టుకోవడంతో ఈయన ‘ఆప్‌ సబ్‌కీ ఆవాజ్‌’ పార్టీని నెలకొల్పారు. కుర్మీ సామాజిక నేత అయిన ఆర్పీ సింగ్‌ ఆ సామాజిక ఓట్లు చీల్చే అవకాశాలున్నాయి. ఈ చిన్న పార్టీలు చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాఘట్‌బంధన అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నాయి.

ఆర్జేడీ నేతృత్వంలోని ‘ఇండియా’కూటమి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాజకీయాల నుంచి దాదాపు విరమించారు. ఆయన కుమారుడు తేజశ్వీ యాదవ్‌ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నా తండ్రి వలే బలమైన ముద్ర వేయలేకపోతున్నారు. ఆర్జేడీ కులం ఆధారంగా రాజకీయాలు నడిపించిన పార్టీ. అయితే మత రాజకీయాలతో బీజేపీ బలపడడంతో ఆర్జేడీ తన సిద్ధాంతాలను కాపాడుకుంటూనే, వాస్తవాలకు తగ్గట్టుగా కొత్త వ్యూహాలను రచించుకోవాలి. బీజేపీకి పెరుగుతున్న ఆకర్షణను అడ్డుకోవడానికి ఆర్జేడీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఓబీసీలను ఏకం చేయాలని, మైనారిటీ ఓట్లను కాపాడుకుంటూనే ఈబీసీలను, దళితులను ఎన్డీయే శిబిరం నుంచి తమ వైపు తిప్పుకోవాలని ఎంజేబీ లక్ష్యాలుగా పెట్టుకుంది. దీని కోసం వారి వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. అంతేకాక సీట్ల పంపకాల్లో ఈ రెండు పార్టీల మధ్య 2020 కంటే ఈసారి నియోజకవర్గ స్థాయిలో సమన్వయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని సామరస్యంగా పరిష్కరించకోకపోతే ఏంజీబీకి ప్రతికూలంగా మారుతుంది.

బీహార్‌లో కుల గణన పూర్తి అయ్యింది. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆశాజనకమైన బడ్జెట్‌తో బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధిపై ఆశ చూపించింది. మరోవైపు వలసల నియంత్రణ, ఉద్యోగాలు కావాలనే డిమాండ్స్‌ రోజురోజుకు పెరుగుతున్నాయి. లాలూ ప్రసాద్‌, నితీష్‌ కుమార్‌, పాశ్వాన్‌ వారసత్వాన్ని బీహార్‌ ప్రాంతీయ పార్టీలు కొనసాగిస్తాయా లేక బీజేపీ సంధించిన జాతీయత అస్త్రంతో ఆ పార్టీల మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందా అనేది మరో ఏడు నెలల్లో జరిగే ఎన్నికలతో తేలిపోతుంది.

========

ఆర్‌. దిలీప్‌ రెడ్డి,

డైరెక్టర్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ.

Optimized by Optimole