మునుగోడు ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో బీజేపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.దమ్ముంటే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేరుతో అభ్యర్థిని బరిలోకి దింపాలని సవాల్ విసిరారు.అక్రమ సంపాదనతో ఉప ఎన్నికలో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగిరి తీరుతుందని కుండబద్ధలు కొట్టారు.దళితబంధు, గిరిజన బంధు, పేదలబంధు ఇవ్వాలని కమలం నేతలు డిమాండ్ చేశారు.
కాగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నికుట్రలు పన్నినా బీజేపీ గెలిచితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.దుబ్బాక.. హుజురాబాద్ లో వేలకు వేలు పంచారని.. మునుగోడులో వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో ఓటుకు 40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమయ్యిందని ఆరోపించారు.కాంగ్రెస్ ,టీఆర్ఎస్ రెండు ఒక గూటి పక్షులేనని ఎద్దేవా చేశారు.లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత మీద వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదని సంజయ్ ప్రశ్నించారు.
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీగా ఖర్చుపెడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.డబ్బు పంపిణీని తాము అడ్డుకోమని.. అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు పంచాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.100 సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్..45 సంవత్సరాలు కలిగిన బీజేపీ పార్టీలకు సొంత విమానం లేదని అలాంటిది..టీఆర్ఎస్ పార్టీ 270 కోట్ల ఖర్చు చేసి విమానం కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు.ఇంత డబ్బు కేసీఆర్ కు ఎక్కడి నుంచి వచ్చిందని ఈటల ప్రశ్నించారు.ధనిక రాష్ట్రాన్ని.. అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఈటల ఎద్దేవా చేశారు.
ఇక మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ పేరుతో గెలిచిచూపించాలని సవాల్ విసిరారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్.ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని..ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో గుణపాఠం చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని లక్ష్మణ్ తేల్చిచెప్పారు.
ఇటు ఉప ఎన్నికలో గెలుపే థ్యేయంగా ప్రచారాన్ని పెంచిన కాషాయంనేతలు.. చాన్స్ దొరికితే చాలు టీఆర్ఎస్ ,కాంగ్రెస్ నేతలను ఆటాడేసుకుంటున్నారు.ఓవైపు చేరికల స్పీడప్ చేస్తూనే.. కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతున్నారు.