మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించే దమ్ము టీఆర్ఎస్ కు లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదని.. ప్రజల కోసం వచ్చిన ఎన్నికన్నారు. ధర్మయుద్ధంలో ప్రజలంతా తనవెంట ఉన్నారన్నారు రాజగోపాల్. మంత్రి జగదీష్ రెడ్డిని మునుగోడు ప్రజలు ఉరికించి కొట్టడం ఖాయమన్నారు.మూడున్నర ఏండ్లలో నియోజకవర్గ అభివృద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.డబ్బులతో తన వెంట ఉన్న సర్పంచ్ లను కొనాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. కారునేతల పప్పులు తనవద్ద ఉడకవని రాజగోపాల్ కుండబద్ధలు కొట్టారు.
కాగా మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ అహంకారంపై దెబ్బకొట్టడమని ఖాయమన్నారు రాజగోపాల్. ఉప ఎన్నికలో బీజేపీ గెలిచితీరుతుందన్నారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు అవినీతి డబ్బు సంచులతో నియోజకవర్గంలో తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. తనను ఓడించేందుకు కేసీఆర్ రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేని ఇంచార్జ్ గా నియమించారని ఫైర్ అయ్యారు.తన రాజీనామాతో ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ ను మునుగోడు రప్పించానని అన్నారు.ఏండ్లకేండ్లు ఉద్యమం చేసినా మండలం ఇవ్వని టీఆర్ఎస్.. తాను అమిత్ షా ను కలిసిన వెంటనే గట్టుపల్ మండలాన్ని ప్రకటించిందని రాజగోపాల్ గుర్తుచేశారు.
ఇక మునుగోడు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 90 శాతం పూర్తయిన ఎస్ఎల్బీసీ పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. తెలంగాణలో రాచరిక పాలన పోయి ప్రజాస్వామ్యం బతకాలంటే ఉప ఎన్నికలో బీజేపీ గెలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మోటార్లకు మీటర్లు పెడతారని కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఏనాడు బీజేపీ ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయలేదని రాజగోపాల్ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. గట్టుప్పల్ మండలం కమ్మగూడెం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్తో పాటు మరికొందరు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ ఆయన కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మొత్తంమీద ఉప ఎన్నిక ధర్మయుద్ధంలో టీఆర్ఎస్ ఎన్నికుట్రలు పన్నినా గెలుపు తనధేనని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.