తెలంగాణలో బీజేపీ ఆపరేషస్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటీకే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికకు రంగం సిద్ధమవ్వగా ..అధికార టీఆర్ఎస్ కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలలు టచ్ లో ఉన్నారంటూ ఆపార్టీ జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ బాంబ్ పేల్చారు. సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమంటూ .. బీజేపీలోకి ఎవరూ వచ్చిన గెలిపించుకుంటామని ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తాజాగా ఓ ఛానల్ తో ఇంటర్వ్యూ లో భాగంగా ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తర్వాత కొత్తగా తనకేమీ పాపులారిటీ రాలేదని..గజ్వేల్ లో సీఎం కేసీఆర్‌ను ఓడించాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కూ భవిష్యత్ లేదని నేతలు నమ్ముతున్నారని.. ఇందుకు అనుగుణంగానే బీజేపీలో చేరేందుకు సుముఖుత చూపుతున్నట్లు తెలిపాడు. సీఎం కేసీఆర్ నూ ఓడించాలనే పట్టుదల ప్రజల్లో కనిపిస్తుందని ఈటల స్పష్టం చేశాడు.
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఈటల జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులైన నేతలు.. త్వరలోనే అంచెలంచెలుగా పార్టీలో చేరతారన్నారు. ఈటల అంటేనే నిజాయితీకి పెట్టింది పేరని.. నిజాలను చెప్పేందుకు తాను ఎప్పుడూ సంకోచించబోనని ఈటల స్పష్టం చేశారు. కరోనా టైంలో ప్రజల మనిషిగా అండగా ఉన్నానని ఆయన గుర్తు చేశారు. తనకు పార్టీ ఏబాధ్యత అప్పగించిన.. పూర్తి న్యాయం చేస్తానని వెల్లడించాడు.
మొత్తంమీద బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పకనే చెప్పారు ఈటల. దీన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న మునుగోడుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే వాస్తవమైతే కమలం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.