తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు.పార్టీలో చేరికలు , సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్న కమలనాథులు.. ఛాన్స్ దొరికితే చాలు అధికార టీఆర్ఎస్ నూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఊపులో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈకార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ముఖ్యఅతిధిగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది.
గతంలో అనేక సార్లు తెలంగాణలో పర్యటించిన షా..అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.ఈక్రమంలోనే కమలం పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో .. రాష్ట్ర వ్యాప్తంగా భారీ కార్యక్రమాలు చేపట్టాలని కమలం నేతలు భావిస్తున్నారు. పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ .. నేటి నుంచి రాష్ట్రంలో నాలుగు రోజులు పర్యటిస్తుండటంతో.. కాషాయ నేతలతో చర్చించిన విమోచన దినోత్సవంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈకార్యక్రమాలకు అమిత్ షా తో పాటు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మె ,మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కమలం పార్టీలో చర్చ జరుగుతోంది.