BJPTelangana: డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలనే డిమాండ్‌తో తెలంగాణా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలు చేపట్టింది. ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని ధర్నాలు, ఆందోళనల్లో నేతలు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి.. ప్రజల్ని మోసం చేశారని కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమీపించడంతో మరోసారి ఓట్లు దండుకునే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని మాయ మాటలు చెప్పిన కేసీఆర్ 9 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం 5 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చలేదని కమలనాథులు మండిపడ్డారు.పి ఎం ఏ వై అర్బన్ ద్వారా సుమారు 4700 కోట్లు 2.5 లక్షల ఇళ్లను.. పి ఎం ఏ వై రూరల్ ద్వారా 196 కోట్లు 70000 ఇండ్లను మొదటి విడుతగా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే డబుల్ బెడ్ రూమ్ పేరుతో వాటిని కూడా పేదలకు అందకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించిన బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అత్యంత నాసిరకంగా, ఎలాంటి మౌలిక వసతులు లేకుండా నిర్మించిందని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఇక ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పును ఒప్పుకుని తను ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కమలనాథులు డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలి లేకుంటే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.