మహారాష్ట్రలో ఏక్ నాథ్ శిందే ప్రభుత్వం కొలువుదీరింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత శిందే..బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి పతనమవడానికి అసలు పాత్రధారి ఎవరూ? ప్రభుత్వం కూలిపోవడానికి వ్యూహా రచన ఎవరు చేశారు?అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గడంలో ఎవరి పాత్ర ఏంటన్నది శిందే మీడియాతో పంచుకున్నారు. సినిమా తలపించేలా రక్తికట్టించిన మహాడ్రామా చివరకు ఎలా ముగిసిందో తెలుసుకుందాం!
గత నెలలో మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన పై ఏక్ నాథ్ శిందే తిరుగుబాటు చేశారు. ఆయనతో పాటు అతని వర్గం ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టారు. అయితే కొత్త ప్రబుత్వం ఏర్పాటులో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య భూమిక పోషించినట్లు శిందే వెల్లడించాడు. మహాడ్రామాలో ఫడ్నవీస నూ జగన్నాటక సూత్రధారిగా ఆయన అభివర్ణించారు. విశ్వాసపరీక్ష రోజు అతను వ్యవహరించిన తీరుతో.. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొదని నిర్ణయించుకుంటున్నట్లు శిందే చెప్పుకొచ్చాడు.
ఫడ్నవీస్ తో ఎమ్మెల్యేల రహస్య సమావేశం..
శివసేనపై తిరుగుబాటు అనంతరం తిరుగుబాటు ఎమ్మేల్యేలంతా కలిసి గౌహతిలోని లగ్జరీ హోటల్లో బసచేసినట్లు శిందే తెలిపారు. ఆతర్వాత బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో ఎమ్మేల్యేలంతా సమావేశమైనట్లు తెలిపాడు. విశ్వాస పరీక్ష రోజు ఉదయమే 40 మంది ఎమ్మేల్యేలతో కలిసి ముంబై చేరుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇక విశ్వాసపరీక్షకు ముందు ప్రధాని తమను ఆశీర్వదించినట్లు శిందే పేర్కొన్నాడు. అవసరమైతే సహయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అమిత్ షా మీవెన్నంటి ఉంటారని ప్రధాని అన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే మహాడ్రామా చిక్కుముడి వీడటంలో..దేవేంద్రుడు ముఖ్యభూమిక పోషించినట్లు షిందే కుండబద్దలు కొట్టాడు. అతని నిర్ణయాలు ఎవరికీ అంతుపట్టవని..విశ్వాసపరీక్షలో నెగ్గడంలో అతని వ్యూహరచనలు అద్భుతం అంటూ కొనియాడారు షిందే.