‘నజాఫ్‌గఢ్‌ నవాబ్‌’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం..

స్టేడియంలో బంతిని ఎంత బలంగా బాదుతాడో.. చమత్కారమైన ట్విట్స్ తో అంతే నవ్వులు పూయిస్తాడు . అతను క్రీజులో ఉన్నాడంటే జట్టు గెలుస్తుందన్న నమ్మకం.  ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతను ఆడుతున్నాడంటే  కొండంత లక్ష్యం కూడా చిన్నబోతోంది. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నానో  ఈపాటికే అర్థమయి ఉంటుంది. అతను మరోవరో కాదు భారత మాజీ ఆటగాడు నజాఫ్‌గఢ్‌ నవాబ్‌ వీరేంద్ర సెహ్వాగ్ . నేడు 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరేంద్రుడి గురించి ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం..!!

వీరేంద్ర సెహ్వాగ్ 1978 అక్టోబర్ 20 న నజఫ్ ఘడ్  ఢిల్లీలో  జన్మించాడు.అతని ముద్దు పేర్లు వీరూ, నజఫ్ గడ్ నవాబ్, ముల్తాన్ సుల్తాన్ . ఏప్రీల్ 1,1999 న పాకిస్తాన్ పై వన్డే  మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో వీరూ అనేక చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడాడు. 2007 టీ 20 వరల్డ్ కప్ ,2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు.తనదైన బ్యాటింగ్ తో బౌలర్లను చీల్చిచెండాడిన వీరేంద్రుడు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 104 టెస్టులు, 251 వన్డేలు 19 టి20 మ్యాచ్‌లు ఆడాడు.టెస్టుల్లో 13 సెంచరీలు, వన్డేల్లో 15 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో రెండు త్రిపుల్ సెంచరీలు(309,319) చేసిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.అంతేకాక వన్డేల్లో డబుల్ సెంచరీ(219) చేసిన తొలి ఆటగాడు కూడా వీరూనే కావడం విశేషం.

ఐపీఎల్లో ప్లేయర్ కమ్ కోచ్ గా ద్విపాత్రిభినయం..

ఐపీఎల్లో తొలుత  ఢిల్లీ కి ప్రాతినిథ్యం వహించిన వీరూ.. అనంతరం పంజాబ్ కింగ్స్  తరపున ఆడాడు. ఆటగాడిగా కెరీర్ కు ముగింపు పలికాక..ఆజట్టుకు  కోచ్ గా మారాడు. ఐపీఎల్ కెరీర్ పరంగా చూసుకుంటే.. వీరూ  104 టీ20ల్లో  2 వేల 728 పరుగులు సాధించాడు.

ముల్తాన్ కా సుల్తాన్…

2004 లో భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించింది.వన్డే సిరీస్ లో వీరూ అనుకున్నంతగా రాణించలేదు. అయితే టెస్టుల్లో మాత్రం దాయాది బౌలర్లను వీరేంద్రుడు ఉతికిఆరేశాడు.ముఖ్యంగా ముల్తాన్ టెస్టులో చెలరేగి ఆడి కెరీర్ లో  తొలి త్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్యూలో గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సెహ్వాగ్ లాంటి ఆటగాడు ట్రిపుల్ సెంచరీ చేస్తాడని ఎవరూ ఊహించిఉండరని.. మీడియాలో  సైతం తనని టెస్ట్ ప్లేయర్ గా భావించలేదని.. వన్డే ప్లేయర్ గా మాత్రమే పరిగణించిందని చెప్పుకొచ్చాడు.షోయబ్ అక్తర్ ,మహ్మద్ సమీ,రజాక్ , త్రయంతో కూడిన బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కొని బ్యాటింగ్ చేయడం అంత సులువుకాదని సెహ్వాగ్ వెల్లడించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత అతను స్వదేశంలో చెన్నై వేదికాగా దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో 319 పరుగులతో మరో ట్రిపుల్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు.

మొత్తంమీద తనదైన ఆటతీరుతో అలరించిన వీరేంద్రుడు.. రెండో ఇన్నింగ్స్ లో చమత్కారమైన ట్విట్స్ తో అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాడు.సందర్భానుసారం ట్విట్స్ చేయడమే కాకుండా.. విభిన్న గెటప్స్ కలిగిన ఫోటోలతో అలరిస్తున్నాడు.వీరూ చేసే ట్విట్స్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తికాదు.అరవీర భయంకర బ్యాటింగ్ తో   బౌలర్లను చీల్చిచెండాడిన వీరేంద్రుడిలో సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువనే చెప్పవచ్చు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole