ప్రపంచంలో రెండవ సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ..!!

భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు.  ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్లుగా ఉంది. గతంలో కంటే అతని నికర ఆదాయం 4 శాతం($5.5 బిలియన్లు) పెరిగినట్లు జాబితా వెల్లడించింది. దాంతో అదానీ అమెజాన్ జెఫ్ బెజోస్‌ను స్థానాన్ని అధిగమించి రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.అతని కంటే ముందు ఎలోన్  మస్క్ $273.5 బిలియన్ల నికర విలువతో  అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

కాగా గౌతమ్ అదానీ..  భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అయిన సమ్మేళన అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు. అహ్మదాబాద్ కు చెందిన అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్.. దేశంలోని అతి పెద్ద థర్మల్ బొగ్గు ఉత్పత్తిదారిగా పేరొందింది.  అదానీ గ్రూప్ ఆదాయం $13 బిలియన్లుగా ఉంది. 

ఇక అదానీ గ్రూప్ స్టాక్స్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్.. అదానీ ట్రాన్స్‌మిషన్ శుక్రవారం ప్రారంభ డీల్స్‌లో బిఎస్‌ఇలో గరిష్ట రికార్డులను తాకింది. ఇది గ్రూప్ ఛైర్మన్ నికర విలువలో ఆదాయం పెరుగుదలకు దారితీసింది. ఈ సంవత్సరంలో అతని నికర విలువ $70 బిలియన్లకు పైగా  పెరిగింది.  అతను  ఫిబ్రవరిలో ఆసియా ధనవంతుడిగా ఉన్న ముఖేష్ అంబానీని అధిగమించాడు. ఏప్రిల్‌లో సెంటిబిలియనీర్ అయ్యాడు. గత నెలలో  మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్  బిల్ గేట్స్‌ను అధిగమించి నాల్గవ సంపన్న వ్యక్తిగా నిలిచాడు.

మార్చి 2022 స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితా ప్రకారం.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్ ..అదానీ ట్రాన్స్‌మిషన్స్‌లో 75% వాటాలను అతను కలిగి ఉన్నాడు. అదానీ టోటల్ గ్యాస్‌లో 37%.. అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో 65% .. అదానీ గ్రీన్ ఎనర్జీలో 61 శాతం అదానీ వాటా  కలిగి ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. తన 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని అదానీ.. సామాజిక కార్యక్రమాల కోసం  $7.7 బిలియన్లను విరాళంగా ఇస్తున్నట్లు జూన్‌లో ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నాడు.

Optimized by Optimole