– ఎట్లా అబ్బింది నీకింతటి నేర్పరితనం?
– ఇన్నేసి యేళ్లు ఈ నైపుణ్యాన్ని కాపాడుతూ, ఎలా వన్నెపెట్టగలిగావు?
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనొల్డో ప్రస్తావన వస్తే చాలు, మన మెదళ్లలో ఇన్నేసి ప్రశ్నలు సహజం! ఒళ్లు గగుర్పాటుకు ఇది అదనం. ఎందుకంటే, అతగాడి రికార్డు అలాంటిది. వింటేనే విస్మయం కలిగించే రికార్డులు సరే, చూస్తుంటే రోమాలు నిక్కబొడిచేలా… మైదానమంతా లాఘవంగా పరుగెత్తే వేగం, డేగలా ఎగిరే సత్తా, రబ్బరులా వంగే శరీర విన్యాసం, కదలికల మెరుపు నియంత్రణ, కళ్లు మిరమిట్లు గొలిపేలా గోల్స్…… ఊప్ ఒక్కటేమిటి చెప్పనలవికాదు, చూసి తీరాల్సిందే!
నాలుగేళ్లకోసారి ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ‘ఫీఫా వల్డ్‌కప్’లో అసాధారణ ప్రతిభ చూపిస్తున్న క్రీడాకారుడతడు. 5 ప్రపంచ కప్పుల్లోనూ గోల్‌చేసిన ఏకైక ధీరుడు. ఇది మూమూలు విషయం కాదు! సాధారణ విజయం కాదు!! ఒక దేశం, కట్‌త్రోట్ కాంపిటీషన్‌లో నెగ్గి.. వరుసగా అన్నిమార్లు ఫీఫా వల్డ్‌కప్‌కు రావడం, అందులో ఒక ప్లేయర్ వరుసతప్పక వస్తుండటం, ప్రతి కప్ లోనూ తను గోల్ చేయడం….. ! ఇరవై సంవత్సరాల యజ్ఞసమాన కృషితోనే సాధ్యమయ్యే అసామాన్య ప్రతిభ!
ప్రపంచం మొత్తాన్ని 6 కాన్ఫిడరేషన్స్ కింద విడగొట్టి, వివిధ ఖండాల్లోని 211 ఫీఫా సభ్యదేశాల (ఈసారి 206 దేశాల) జట్లు, దాదాపు నాలుగేళ్ల పాటు వివిధ స్థాయిల్లో 865 మ్యాచ్‌లు ఆడి యోగ్యులుగా కప్ ఫైనల్ పోటీలకు ఎంపికయినవే ప్రస్తుత 32 జట్లు. వాటికే ఈ ‘ఎఫ్‌డబ్ల్యుసి’ ఫైనల్ పోటీ ఉంటుంది. అందులో 31 టీమ్‌లు కిందిస్థాయి పోటీల్లో నెగ్గి వస్తే, ఆతిథ్య దేశం (ఈ సారి ఖతర్ ఆతిథ్యదేశమే అయినా, కోరి పోటీల్లోనూ నెగ్గి వచ్చింది) నేరుగా పోటీల్లో పాల్గొంటోంది. ఇదే ప్రక్రియ ప్రతి నాలుగేళ్లకోసారి జరిగేది.
అలా 18 ఏళ్ల వయసులో పోర్చుగల్ జట్టు సభ్యుడుగా 2003 లో తొలి ఫీఫా వల్డ్‌కప్ లో ఆడటం మొదలెట్టి….. ప్రస్తుత కప్ వరకు 5 పోటీల్లోనూ పాల్గని, గోల్స్ చేసి, అరుదైన రికార్డు నెలకొల్పిన మొనగాడు రొనాల్డో! 37 ఏళ్ల వయసులో, తాజా వల్డ్ కప్ లోనూ ప్రతిభావంతంగా ఆడుతూ జుట్టుకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాడు. చివరి ఎనిమిది జట్లలో మిగిలిన పోర్చుగల్ ను క్వార్టర్స్ నుంచి ముందుకు తీసుకువెళ్లి కప్పు గెలిపించాల్సిన భారం, బాధ్యత రొనాల్డో భుజస్కంధాలపైనే ఉంది.
రొనాల్డో… విలేకరుల సమావేశంలో జస్ట్, ఓ కూల్‌డ్రింక్ బాటిల్ పక్కకు జరిపి మంచి నీళ్ల గ్లాస్ తీసుకుంటేనే, అంతర్జాతీయ మార్కెట్లో సదరు కార్పొరేట్ సంస్థ షేర్‌వ్యాల్యూ డమేల్ మనేంత పాపులారిటీ! అయిదు బెలన్ డీ‘ఓర్ అవార్డులు, నాలుగు యురోపియన్ గొల్డెన్ షూ అవార్డులు, 32 ట్రోఫీలు, చాంపియన్స్ లీగ్‌లో అత్యధిక (183) మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ (118), అత్యధిక సహకారాలు (42) ఆయన సొంతం. స్పోర్టింగ్ సీపీ, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జురెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యంతో లెక్కలేనన్ని రికార్డులు! క్లబ్ మార్పిడికి ప్రంచంలోనే అత్యంత ఖరీదైన బేరమతనిది! 2016, 2017 లో ప్రపంచంలోనే అధిక సంపాదన కలిగిన క్రీడాకారుడిగా ‘పోర్బ్స్’ లెక్కించింది. కెరీర్‌లో బిలియన్ అమెరికన్ డాలర్స్ సంపాదించిన, ప్రపంచ తొలి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, మూడో ఆటగాడిగా ఘనతకెక్కాడు.
చివరగా ఒక మాట:
తల్లి ఒక వంట మనిషి, తండ్రి తాగుబోతైన ఓ తోటమాలి. పేదరికంలో నాల్గో సంతానంగా… తల్లి ఇక వద్దూ అని అబార్షన్ కోరుకున్నా, డాక్టర్లు అంగీకరించకపోవడంతో పుట్టిన బిడ్డడు రొనాల్డో! తనలో ఉన్న ఫుట్‌బాల్ క్రీడా నైపుణ్యాల్ని 14వ యేట తానే గుర్తించి, ‘పాక్షిక వృత్తిక్రీడాకారుడిగానైనా కెరీర్ మలచుకుంటానమ్మా, ఇదే ఇకపై నా చదువు, అనుమతించ’మని అమ్మను ఒప్పించి మెట్టు మెట్టు ఎదిగి, ఒదిగిన ధీరశిఖరం రొనాల్డో!
———————–
ఆర్.దిలీప్ రెడ్డి(పొలిటికల్ ఎనలిస్ట్)
పీపుల్స్ పల్స్ డైరెక్టర్